విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదనడం మోసపూరితం

ch baburao on electricity charges
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు

ప్రజాశక్తి – విజయవాడ : ప్రతి నెలా సర్దుబాటు భారం మోపుతూ విద్యుత్‌ ఛార్జీలు పెంచడం లేదని ప్రభుత్వం ప్రకటించడం మోసపూరితమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. గత నాలుగేళ్లలో సర్దుబాటు ఛార్జీల పేరుతో వేలాది కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపుతోందని వివరించారు. ప్రభుత్వ చర్యలతో ప్రతి నెలా విద్యుత్‌ భారాలు పెరుగుతున్నాయన్నారు. కార్పొరేట్ల దోపిడీ, పాలకుల అవినీతి ఫలితంగానే ఈ భారాలు పడుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ సంస్థల ఆదాయ, వ్యయ నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ 61వ డివిజన్‌ పాయకాపురంలోని శాంతినగర్‌లో సోమవారం బాబూరావు పర్యటించి వినియోగదారుల విద్యుత్‌ బిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024- 25లో విద్యుత్‌ ఛార్జీలను పెంచడం లేదని, ప్రజలకు ఊరట కలిగిస్తున్నామని విద్యుత్‌ పంపిణీ సంస్థల అధికారులు ప్రకటించడం మోసపూరితమన్నారు. గత నాలుగేళ్లుగా వైసిపి ప్రభుత్వం దొడ్డిదారిన, ప్రజల కళ్లు కప్పి, వినియోగదారులపై వేలాది కోట్ల రూపాయల భారం మోపిందని తెలిపారు. ట్రూ అప్‌ ఛార్జీలు, సర్దుబాటు చార్జీలు…ఇలా పలు రూపాల్లో విద్యుత్‌ బాదుడు కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడి నుంచి ప్రతి యూనిట్‌ పైన ప్రతి నెలా అదనంగా రూ.1.50 భారం మోపుతోందని తెలిపారు. అదనంగా మరో రూ.7200 కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసే ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి.రమణరావు, నాయకులు కె.దుర్గారావు, సిహెచ్‌.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️