ఎన్‌ఐఎ చేతికి రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసు

బెంగళూరు  :    రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కి అప్పగించినట్లు బెంగళూరు పోలీసులు సోమవారం వెల్లడించారు.  ఈ కేసులో అనుమానితుడు 9 నిమిషాల పాటు కేఫ్‌లోనే ఉన్నట్లు సిసిటివి ఫుటేజీలో వెల్లడైంది. సన్‌గ్లాస్‌, మాస్క్‌, బేస్‌బాల్‌ హాట్‌ ధరించిన అనుమానితుడు రామేశ్వరం కేఫ్‌ నుండి బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. శుక్రవారం ఉదయం 11.43 గంటలకు కేఫ్‌లోకి ప్రవేశించిన అతను ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. 11.43 గంటలకు కేఫ్‌ నుండి బయటకు వెళ్లినట్లు ఫుటేజీలో కనిపిస్తోంది. మొత్తంగా 9 నిమిషాల పాటు ఆ అనుమానితుడు కేఫ్‌లో ఉన్నట్లు సమాచారం. ఐఇడి ( పేలుడు పదార్థాలు )తో ఉన్న బ్యాగ్‌ను కేఫ్‌లో ఉంచినట్లు ఫుటేజీలో కనిపించింది.

కాగా, ఈ ఘటనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ), పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, వివిధ కోణాలలో కేసును విచారించేందుకు ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసినట్లు కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వరా తెలిపారు.  పలు సిసిటివి ఫుటేజీలను కూడా సేకరించామని అన్నారు.

గత శుక్రవారం  జరిగిన ఈ ఘటనలో కేఫ్‌ సిబ్బంది సహా 10 మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే.

➡️