నకిలీ పిఎంఓ అధికారిపై సిబిఐ చార్జిషీట్‌

Jan 8,2024 11:16 #Case, #PMO
duplicate pmo officer

న్యూఢిల్లీ : పిఎంఓ అధికారిగా మోసం, పిఎంఓ పేరును దుర్వినియోగం చేసిన కేసులో అహ్మదాబాద్‌కు చెందిన మయాంక్‌ తివారీపై సిబిఐ చార్జిషీట్‌ నమోదు చేసింది. మయాంక్‌ తివారీ పిఎంఓలో ఒక ఉన్నతస్థాయి అధికారిగా పనిచేస్తున్నట్లు నటిస్తూ డాక్టర్‌ అగర్వాల్స్‌ సంస్థ ప్రమోటర్లను బెదిరిస్తున్న కేసులో సుమారు మూడు నెలల పాటు విచారణ జరిపిన సిబిఐ తాజాగా న్యూఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీటు నమోదు చేసింది. చార్జిషీటులోని వివరాల ప్రకారం కంటి ఆసుపత్రులను నిర్వహించే డాక్టర్‌ అగర్వాల్స్‌ సంస్థ ఫ్రాంచైజీ కోసం ఇండోర్‌లో ఆసుపత్రి నిర్వహిస్తున్న ఇద్దరు డాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. వారికి సుమారు రూ.16 కోట్లను చెల్లించింది. ఒప్పందంలోని నిబంధనలను ఇండోర్‌లోని వైద్యులు ఉల్లంఫించడంతో, తమ రూ.16 కోట్లను తిరిగి ఇవ్వాలని ఇండోర్‌లోని వైద్యులను కోరింది. ఈ వివాదం హైకోర్టుకు వెళ్లగా, ఒక మధ్యవర్తిని నియమించింది. ఆ మధ్యవర్తి తన మధ్యంతర ఉత్తర్వుల్లో నాలుగు వారాల్లోగా రూ.16.43 కోట్లు చెల్లించాలని ఇండోర్‌ వైద్యులను ఆదేశించారు. ఇదే సమయంలో మయాంక్‌ తివారీ పిఎంఓ అధికారిగా నటిస్తూ డాక్టర్‌ అగర్వాల్స్‌ ప్రమోటర్లపై బెదిరింపులకు దిగాడు. రూ.16 కోట్లను మరిచిపోవాలని, ఇండోర్‌ వైద్యులతో సమస్యను పరిష్కరించుకోవాలని బెదిరించసాగాడు. ఈ విషయం తెలిసిన పిఎంఓ సిబిఐకి ఫిర్యాదు చేసింది. విచారణ ప్రారంభించిన సిబిఐ అహ్మదాబాద్‌, ఇండోర్‌లలో సోదాలు నిర్వహించి, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.

➡️