Liquor Policy Case : కవితను అరెస్టు చేసిన సిబిఐ

  •  నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న దర్యాప్తు సంస్థ
  • ఇప్పటికే మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు చేసిన ఇడి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె కవితను సిబిఐ గురువారం అరెస్టు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో ఆమెను ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇడి) చేసింది. తీహార్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఆమెను సిబిఐ అరెస్టు చేసింది. కేసు దర్యాప్తులో సహకరించనందున ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కవిత భర్త అనిల్‌కు సమాచారం ఇచ్చింది. ఐపిసి 477, 120(బి), పిసి చట్టం 7 సెక్షన్ల ప్రకారం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శుక్రవారం 10:30 నిమిషాలకు కవితను జైలు నుంచి నేరుగా ట్రయల్‌ కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. ఈ నెల 6న దాదాపు మూడు గంటల పాటు ఆమెను సిబిఐ ప్రశ్నించింది. విచారణకు సహకరించడం లేదని, ఆమెను అరెస్టు చేసేందుకు అనుమతివ్వాలని ట్రయల్‌ కోర్టులో సిబిఐ అప్లికేషన్‌ దాఖలు చేయగా, కోర్టు అందుకు అనుమతించడంతో గురువారం ఈ అరెస్టు చేసినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. గత నెల 15న ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) హైదరాబాద్‌లోని కవిత నివాసంలో సోదాలు తరువాత ఆమెను అరెస్ట్‌ చేసి ఢిల్లీకి తరలించగా, రౌస్‌ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి రెండు దఫాలుగా మొత్తం 10 రోజుల ఇడి కస్టడీకి అప్పగించారు. మళ్లీ 14 రోజులు కస్టడీ విధించారు. ఈ నెల 9న ఆ కస్టడీ గడువు ముగియడంతో ఈ నెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించారు. ప్రస్తుతం కవిత తీహార్‌ జైలులోని మహిళా ఖైదీలు ఉండే 6వ నెంబరు కాంప్లెక్స్‌లో ఉన్నారు.
కవిత అరెస్టు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆమె తరపు న్యాయవాది మోహిత్‌రావు అన్నారు. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కవితను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కోర్టు వాదనల తరువాత సిబిఐ స్పెషల్‌ కోర్టు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమను పూర్తిగా బ్లాక్‌ (చీకట్లో)లో ఉంచి కవితను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. చట్టం పక్రారం… ప్రతివాదులుగా తమకు నోటీసు ఇవ్వాలన్నారు. కవిత అరెస్ట్‌పై న్యాయపోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు.

➡️