సత్యపాల్‌ మాలిక్‌ నివాసంలో సిబిఐ సోదాలు

Feb 23,2024 11:19 #national, #satyapal, #Satyapal Malik

శ్రీనగర్‌ : కిరు జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు సంబంధించి మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఇంటిపై సీబీఐ దాడులు జరిపింది. దాదాపు 100 మంది అధికారులు మాలిక్‌ ఇల్లు, అనేక నగరాల్లోని 29 ఇతర ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. రూ. 2,200 కోట్ల విలువైన ప్రాజెక్టు సివిల్‌ వర్క్స్‌ కేటాయింపులో అవినీతి జరిగిందని సీబీఐ పేర్కొన్నది. మాలిక్‌ 2018, ఆగస్టు 23 నుంచి 2019, అక్టోబర్‌ 30 మధ్య జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌గా పనిచేశారు. మాలిక్‌, గవర్నర్‌గా ఉన్నప్పుడే, ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒకటి సహా రెండు ఫైళ్లను క్లియర్‌ చేయటానికి రూ. 300 కోట్లు లంచం ఇచ్చారని సీబీఐ ఆరోపిస్తున్నది. ఈ కేసుకు సంబంధించి చినాబ్‌ వ్యాలీ పవర్‌ ప్రాజెక్ట్స్‌ (పి) లిమిటెడ్‌ మాజీ చైర్మెన్‌ నవీన్‌ కుమార్‌ చౌదరి, ఇతర మాజీ అధికారులు ఎం.ఎస్‌.బాబు, ఎం.కె.మిట్టల్‌, అరుణ్‌ కుమార్‌ మిశ్రా, పటేల్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌లపై దర్యాప్తు సంస్థ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి జనవరిలో ఐదుగురి ఇండ్లలో కూడా ఏజెన్సీ సోదాలు నిర్వహించింది.కేంద్రంలోని మోడీ సర్కారుపై మాలిక్‌ తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే కేంద్రం ఉద్దేశపూర్వకంగా సీబీఐతో దాడులు జరిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అనారోగ్యంతో ఉన్నా వేధింపులు

తాను అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా కేంద్రం వేధింపులకు గురి చేస్తోందని సత్యపాల్‌ సామాజిక మాధ్యమాల్లో ఆందోళన వ్యక్తం చేస్తూ గురువారం పోస్టు చేశారు. తాను కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు, అయినప్పటికీ తనపై ‘నిరంకుశ శక్తులు’ తన నివాసంపై దాడి చేస్తున్నాయని విమర్శించారు. సోదాల పేరుతో తన డ్రైవర్‌ను, సహాయకుడిని దర్యాప్తు సంస్థ అధికారులు వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వాటికి తాను భయపడే ప్రసక్తేలేదని, రైతులకు కూడా అండగా నిలుస్తానని ప్రకటించారు. కాగా గతంలో ఓ బీమా పథకం ఒప్పందానికి చెందిన అవినీతి కేసులోనూ సిబిఐ ..సత్యపాల్‌ను సాక్షిగా 5 గంటల పాటు విచారణ చేసిన సంగతి విదితమే.

➡️