పులివెందులలో సిబిఐ అధికారులు

Dec 20,2023 09:23 #cbi officers, #pulivendula

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ :మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసు విషయమై సిబిఐ అధికారులు మంగళవారం పులివెందులకు వచ్చారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పటి విచారణ అధికారి రామ్‌సింగ్‌, వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై ఈ నెల 15న పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. థర్డ్‌ డిగ్రీ ఉపయోగించి కేసులో సంబంధం లేని వ్యక్తుల పేర్లు చెప్పాలని బలవంతం చేసినట్లు అప్పటి సిబిఐ అధికారి రామ్‌సింగ్‌, సునీత, రాజశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వివేకా పిఎ కృష్ణారెడ్డి గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై వారిపై కేసు నమోదైంది. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని పులివెందుల పోలీసులను కోర్టు ఆదేశించింది. సిబిఐ అధికారి రామ్‌సింగ్‌ తరుఫున మంగళవారం స్థానిక పులివెందుల కోర్టుకు సిబిఐ అధికారులు వచ్చారు. విచారణ సమయంలో కృష్ణారెడ్డి నుంచి సేకరించిన వాంగ్మూలాన్ని కోర్టుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. పులివెందులలో న్యాయమూర్తి లేకపోవడంతో జమ్మలమడుగు కోర్టుకు వెళ్లారు. పులివెందులలో సిబిఐ అధికారుల కదిలికతో వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

➡️