మళ్లీ మెరిసిన బుమ్రా

Feb 6,2024 09:22 #again, #Bumrah, #shines

విశాఖపట్నం : తొలి ఇన్నింగ్స్‌లో ఆరువికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించిన పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ బౌలింగ్‌లో మెరిసాడు. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ వికెట్‌ నష్టపోయి 67పరుగులతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్‌ను జస్ప్రీత్‌ బుమ్రా(3/46), అశ్విన్‌(3/72) దెబ్బకు ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు కుప్పకూలింది. దీంతో టీమిండియా 106 పరుగుల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. బుమ్రాకి తోడు రవిచంద్రన్‌ అశ్విన్‌(3/72) అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి 9 వికెట్లు తీసిన బుమ్రాకే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మూడో టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌ వేదికగా ప్రారంభం కానుంది. సోమవారం తొలి సెషన్‌లోనే ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆరంభంలో భారత బౌలర్లను కాస్త ఇబ్బంది పడ్డా.. ఇంగ్లండ్‌ బ్యాటర్లు.. కీలక సమయంలో వికెట్లను సమర్పించారు. మరీ ముఖ్యంగా అశ్విన్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో విజృంభించాడు. జాక్‌ క్రాలే(73) అర్ధసెంచరీ సాధించాడు. రెహాన్‌(23)ను ఎల్బీ చేసిన అక్షర్‌ పటేల్‌ వికెట్ల పతనానికి తెరదీశాడు. కీలకమైన ఓలీ పోప్‌(23), జో రూట్‌(16)ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. పోప్‌ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుతంగా ఒడిసిపట్టాడు. లంచ్‌ విరామానికి ముందు బెయిర్‌ స్టో(26)ను బుమ్రా, జాక్‌ క్రాలేను కుల్దీప్‌ యాదవ్‌ ఔట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ టాప్‌ ఆర్డర్‌ కథ ముగిసింది. డీఆర్‌ఎస్‌కు వెళ్లినా బ్యాటర్లకు అనుకూలంగా ఫలితం రాలేదు. లంచ్‌ సమయానికి ఇంగ్లండ్‌ 43ఓవర్లకు 6వికెట్లు నష్టపోయింది. అనంతరం కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ క్రీజ్‌లోకి వచ్చి బెన్‌ ఫోక్స్‌తో కలిసి దాదాపు పది ఓవర్లపాటు వికెట్‌ ఇవ్వకుండా భారత బౌలింగ్‌ను అడ్డుకున్నాడు. అయితే, అనవసర పరుగుకు యత్నించిన బెన్‌ స్టోక్స్‌ను(11) శ్రేయస్‌ అయ్యర్‌ డైరెక్ట్‌ హిట్‌తో రనౌట్‌ చేశాడు. చివర్లో ఫోక్స్‌(36), హార్ట్‌లీ(36) కాసేపు పోరాడినా.. ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. చివరికి వీరి జోడీని బుమ్రా విడగొట్టాడు. స్లో బంతిని సంధించి రిటర్న్‌ క్యాచ్‌తో ఫోక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. భారత బౌలర్లు అశ్విన్‌, బుమ్రాకు మూడేసి, కుల్దీప్‌, అక్షర్‌ పటేల్‌, ముకేశ్‌ కుమార్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఆఖరి రెండు వికెట్లను ముకేశ్‌, బుమ్రా తీసి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బుమ్రాకు లభించగా.. మూడో టెస్ట్‌ రాజ్‌కోట్‌ వేదికగా ఫిబ్రవరి 15నుంచి జరగనుంది.

స్కోర్‌బోర్డు…

ఇండియా తొలి ఇన్నింగ్స్‌ : 396ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 253ఇండియా రెండో ఇన్నింగ్స్‌: 255ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : క్రాలే (ఎల్‌బి)కుల్దీప్‌ 73, డకెట్‌ (సి)శ్రీకర్‌ భరత్‌ (బి)అశ్విన్‌ 28, రెహాన్‌ అహ్మద్‌ (ఎల్‌బి)అక్షర్‌ 23, ఓలీ పోప్‌ (సి)రోహిత్‌ (బి)అశ్విన్‌ 23, రూట్‌ (సి)అక్షర్‌ (బి)అశ్విన్‌ 16, బెయిర్‌స్టో (ఎల్‌బి)బుమ్రా 26, స్టోక్స్‌ (రనౌట్‌)శ్రేయస్‌ 11, ఫోక్స్‌ (సి అండ్‌ బి)బుమ్రా 36, హార్ట్‌ లీ (బి)బుమ్రా 36, షోయబ్‌ బషీర్‌ (సి)శ్రీకర్‌ భరత్‌ (బి)ముఖేశ్‌ కుమార్‌ 0, ఆండర్సన్‌ (నాటౌట్‌) 5, అదనం 15. (69.2ఓవర్లలో ఆలౌట్‌) 292పరుగులు. వికెట్ల పతనం: 1/50, 2/95, 3/132, 4/154, 5/194, 6/194, 7/220, 8/275, 9/281, 10/292 బౌలింగ్‌: బుమ్రా 17.2-4-46-3, ముఖేశ్‌ కుమార్‌ 5-1-26-1, కుల్దీప్‌ 15-0-60-1, అశ్విన్‌ 18-2-72-3, అక్షర్‌ పటేల్‌ 14-1-75-1.

➡️