తమ్ముడు… చెల్లెళ్లకు అన్నీతానై…

Feb 16,2024 00:00

– కోమాలో చావు బ్రతుకుల్లో తల్లి
– తల్లికి తోడుగా తండ్రీ ఆసుపత్రిలోనే
– నలుగురు పసిబిడ్డలకు ఆ చిన్నారే అమ్మానాన్న
– హృదయాలను ద్రవింపజేస్తున్న చిన్నారి లక్ష్మి సేవలు
ప్రజాశక్తి – పంగులూరు
తల్లికి రెండు రోజుల క్రితం పురిటినొప్పులు వచ్చాయి. ఆమెను ప్రభుత్వ వైద్యశాల్లో తండ్రి చేర్చాడు. కాన్పు అయినప్పటికీ పుట్టిన బిడ్డ చనిపోయింది. తల్లి కోమాలోకి వెళ్లింది. తల్లికి వైద్యసేవలు చేస్తూ తండ్రీ హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఆ దంపతులకు ఇతకు ముందు ఐదుగురు బిడ్డలు ఉన్నారు. పెద్దకూతురు లక్ష్మికి పదేల్లు. మిగిలిన నలుగురు అతకన్నా చిన్నవాళ్లు. తల్లి, తండ్రీ ఇద్దరూ ఇంటి వద్ద లేకపోవడంతో ఆ నలుగురికీ పదేళ్ల లక్ష్మి అన్నీ సేవలు చేస్తు.. ఆలన, పాలన చూస్తుంది. ఆ చిన్నారి చేస్తున్న సేవలను, కష్టాలను చూసిన గ్రామస్థులు చలించి పోయారు.
ఒకవైపు కట్టెల పొయ్యి పొగలు కక్కుతుంది. తను కట్టుకున్న బట్టలతోనే కళ్ళు తుడుచుకుంటూ… ముక్కులు తుడుచుకుంటూ…. కళ్ళు మూసుకుంటూ కట్టెల పొయ్యిలో తలపెట్టి ఊదుతుంది. మరోవైపు గుక్కపెట్టి ఏడ్చే తమ్ముడు దగ్గరికి వెళ్లి, వాడి ఏడుపు మాన్పించేందుకు ఏవేవో చిన్నచిన్న మాటలు నాలుగు చెపుతుంది. ఈలోపు చెల్లెలు ఆకలిగా ఉందని ఏడుస్తుంటే… అమ్మ… కొద్దిసేపు ఆగు అన్నం తిందువుగాని. పొయ్యి మీద ఉడుకుతుంది. అని సర్ధి చెప్పే మాటలు చెబుతుంది. ఇంకోవైపు మరో తమ్ముడు అమ్మ కావాలి. అమ్మ కావాలి అంటూ ఏడుస్తుంటే.. అమ్మ రెండు రోజుల్లో వచ్చిద్ది. రెండు రోజుల్లో నాన్న అమ్మని తీసుకొని, కాయలు తీసుకొని ఇంటికి వస్తారని చెబుతుంది. ఈ మాటలు చెబుతుంది ఎవరో పెద్ద వయసు మహిళ కాదు. పిల్లల తల్లి అంతకన్నా కాదు. పదేళ్లు కూడా నిండని చిన్నారి లక్ష్మి. చక్కగా పాఠశాలకెళుతూ చదువుకుంటూ, అమ్మానాన్నలతో హాయిగా గడపాల్సిన ఆ చిన్నారి చిన్నవయసులోనే కుటుంబ భారం అంతా నెత్తిన వేసుకొని, ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్లకు ఆలనా పాలన చూస్తూ అహర్నిశలు శ్రమిస్తుంది. కనీసం ఒక గంట నిద్రపోదాం అన్నా కూడా పిల్లల ఏడుపులు, గోల మధ్య ఆ చిన్నారి జీవితం పొగ చూరిపోతుంది. ఉదయాన్నే పొలాల వైపు వెళ్లి పుల్లలు ఏరుకొని వచ్చి చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అన్నం వండి పెట్టటం. వాళ్ళని సముదాయించడంతోనే ఆ చిన్నారి జీవితం సరిపోతుంది. హృదయాలను ద్రవింపజేసే ఈ సన్నివేశం మండలంలోని రామకూరు గ్రామానికి దూరంగా ఉన్న కొండ దగ్గర క్రషర్ సమీపంలో ఉన్న ఓ చిన్న కుటీరం దగ్గర జరుగుతుంది. వివరాల్లోకెళ్తే మధ్యప్రదేశ్‌కు చెందిన దేవా, దేవి అనే దంపతులు 15ఏళ్ల క్రితం రామకూరు దగ్గర ఉన్న క్రషర్‌లో పనిచేయటానికి వచ్చారు. అక్కడ తమిళనాడుకు చెందిన ఒక మేస్త్రీ దగ్గర పని కుదిరి అక్కడే నమ్మకంగా పని చేసుకుంటూ ఉన్నారు. వారికి ఇప్పటికీ ఆరుగురు పిల్లలు పుట్టారు. వారిలో ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. అయితే ఏడాదిన్న క్రితం నుండి దేవికి మానసికంగా దెబ్బతినింది. మతి స్థిమితం కోల్పోయి గ్రామంలో తిరుగుతూ చిత్తుకాగితాలు, పాతబట్టలు ఏరుకుంటూ ఉంటుంది. ఆమెను భర్త దేవా ఎప్పుడో 15రోజులకు 20రోజులకు తీసుకెళ్లి స్నానం చేయించి పంపిస్తాడు. అయితే ఈలోపు దేవి మళ్లీ గర్భిణీ అయింది. కాన్పు అయ్యే సమయంలో ఆమె పరిస్థితి చూసిన గ్రామస్తులు ఆమెను గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో చేర్చారు. ఆసుపత్రిలో దేవి కాన్పు అయిన తర్వాత పుట్టిన బిడ్డ చనిపోయింది. దేవి ఆరోగ్య పరిస్థితి శృతిమించి కోమాలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆమె చావు బ్రతుకుల మధ్య ఉంది. ఆమె భర్త దేవా 12ఏళ్ల వయసు గల పెద్ద కుమారుడు గుంటూరు జనరల్ హాస్పిటల్లోనే దేవి దగ్గర ఉన్నారు. వారు అక్కడ ఉంటే ఇంటిదగ్గర ఉన్న ఐదుగురు పిల్లలకు పదేళ్ల వయసున్న లక్ష్మి దిక్కయింది. వీరందరికీ కడుపునిండా తిండి వండి పెట్టడం, వారిని ఏడవకుండా ఉజ్జగించటం, వారి బరువు బాధ్యతలన్నీ చూస్తుంది. చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు మోస్తున్న లక్ష్మీని చూసి ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్నారు. పదేళ్లు నిండనీ వయసులోనే ఇంత బాధ్యతలు మోయటం ఏమిటని మనసును కలచి వేస్తుంది.
ఆదుకుంటున్న రామకూరు చారిటబుల్ ట్రస్ట్
మా రామకూరు గ్రామంలో ఆకలితో ఎవరు ఇబ్బంది పడకూడదు. అందరూ కడుపునిండా తినాలి. అంటూ దేవా కుటుంబ సభ్యుల ఆకలిని తీర్చేందుకు రామకూరు చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. గ్రామానికి చెందిన కొంతమంది ఎన్నారైలు గ్రామస్తుల సహకారంతో కొంత డబ్బును వసూలు చేసి దేవా పిల్లలకు ఆహారపరంగా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. వారికి ఆహారంతో పాటు బట్టలు, ఇతరత్రా సౌకర్యాలు చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆసుపత్రిలో కోమాలో ఉన్న దేవి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తును గురించి కూడా ఆలోచించి ఒక నిర్ణయం చేస్తామని ట్రస్టుకు చెందిన సభ్యులు ఒకరు “ప్రజాశక్తి”కి తెలిపారు.

➡️