బ్రిటన్‌ తాను తీసుకున్న గోతిలోనే పడిందా?

గాజాలో బ్రిటిష్‌ సహాయక సిబ్బందిని బ్రిటీష్‌ బాంబులే బలిగొన్నాయా?
తక్షణమే దర్యాప్తుకు
వామపక్ష ఎంపీల డిమాండ్‌
గాజా : గాజాలో సోమవారం మరణించిన బ్రిటీష్‌ సహాయ కార్యకర్తలు బ్రిటన్‌ సరఫరా చేసిన బాంబుల దాడిలోనే మరణించారా అనే అంశంపై తక్షణమే విచారణ జరిపించాలని వామపక్షాల ఎంపీలు, కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.. సోమవారం వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ బృందంపై ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో ఏడుగురు సహాయక సిబ్బంది మరణించారు. ఈ సంఘటనపై అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మరణించిన వారిలో ముగ్గురు బ్రిటీష్‌ జాతీయులు వున్నారు. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ కెమరాన్‌కు బుధవారం ఒక లేఖ రాస్తూ లీడ్స్‌ ఈస్ట్‌ లేబర్‌ ఎంపి రిచర్డ్‌ బర్గన్‌, బ్రిటన్‌ తక్షణమే ఇజ్రాయిల్‌కు ఆయుధాల సరఫరాను ఎందుకు నిలిపివేయాలో ఈ దాడి నొక్కి చెబుతోందని అన్నారు. గాజాపై ఇలాంటి ప్రాణాంతకమైన దాడులకు దిగుతూ ఇజ్రాయిల్‌ ప్రభుత్వం యుద్ధ నేరాలకు పాల్పడుతోందని అన్నారు. మానవతా సాయాన్ని అందచేసే సిబ్బందిపై ఇటువంటి దాడులను అంతర్జాతీయ చట్టం నిషేధిస్తోందని తాను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. 2015 నుండి ఇజ్రాయిల్‌కు 47.4కోట్ల విలువ చేసే మిలటరీ ఎగుమతులకు బ్రిటన్‌ లైసెన్స్‌ మంజూరు చేసిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. వీటిల్లో యుద్ధ విమానాల విడిభాగాలు, క్షిపణులు, ట్యాంక్‌లు, సాంకేతికత, చిన్నపాటి ఆయుధాలు, మందుగుండు వంటివి వున్నాయి.

దాడికి బాధ్యత అమెరికాదే : ఇరాన్‌
సిరియాలో ఇరాన్‌ ఎంబసీపై ఇజ్రాయిల్‌ దాడి తర్వాత అమెరికా ప్రభుత్వానికి తమ దేశం కీలక సందేశాన్ని పంపించిందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమిర్‌ అబ్దుల్లా తెలిపారు. ఈ దాడిలో అనేకమంది సైనిక కమాండర్లు, సీనియర్‌ సలహాదారులు మరణించారు. ఇరాన్‌ విదేశాంగ శాఖలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అమెరికా డైరెక్టర్‌ జనరల్‌ ఇస్సా కమేలిని పిలిపించి ఈ దాడికి తమ తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇజ్రాయిల్‌ జరిపిన ఈ తీవ్రవాద దాడికి, నేరానికి బాధ్యత అమెరికాదేనని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఇస్లామిక్‌ దేశాల సమాఖ్య (ఓఐసి) కూడా ఈ దాడిని ఖండించాలని అమిర్‌ అబ్దుల్లా కోరారు. ఈ మేరకు ఆయన ఓఐసి సెక్రటరీ జనరల్‌ హుస్సేన్‌ బ్రహిమ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఇజ్రాయిల్‌ నేరాలపై ఓఐసి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఓఐసి చీఫ్‌ కూడా ఇజ్రాయిల్‌ నేరాన్ని తీవ్రంగా ఖండించారు.

యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయిల్‌కు పెద్ద సంఖ్యలో ఆయుధాల అమ్మకాలకు బైడెన్‌ ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనున్నట్లు అమెరికా మీడియా తెలిపింది. 1800కోట్ల డాలర్లు విలువ చేసే ఆయుధాలు ఇజ్రాయిల్‌కు అమ్మనుంది. ఇందుకు సంబంధించిన వర్గాలను ఉటంకిస్తూ సిఎన్‌ఎన్‌ ఒక నివేదికను ప్రచురించింది. గతేడాది అక్టోబరు 7న యుద్ధం ఆరంభమైన్పటి నుండి ఇప్పటివరకు వందకు పైగా మిలటరీ అమ్మకాలు ఇజ్రాయిల్‌కు జరిగాయి.

ఐక్యరాజ్య సమితి ఖండన
సిరియాలో ఇరాన్‌ ఎంబసీపై దాడిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్య సమితి అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌ ఖలీద్‌ భద్రతా మండలిలో మాట్లాడుతూ, ఇజ్రాయిల్‌ దారుణాలను ఖండించారు. అత్యంత సంయమనం పాటిస్తూ, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి వ్యవహరించాలని కోరారు. ప్రాంతీయ అస్థిరతలను రెచ్చగొట్టే ఎలాంటి కవ్వింపు చర్యలకు ఎవరూ పాల్పడరాదని కోరారు. పౌరులను, అలాగే మౌలిక సదుపాయాలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. ఇప్పటికే మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు దిగజారుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి కవ్వింపు చర్యలవల్ల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని హెచ్చరించారు.

➡️