ప్రేమా మజాకా..! : ప్రియురాలి వేషంలో ప్రియుడు పరీక్షకు హాజరయ్యాడు… ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Jan 29,2024 15:56

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రియురాలి కోసం ప్రియుడు అమ్మాయి వేషం వేయడం సినిమాల్లో చూస్తాం. ‘మేడమ్‌’ సినిమాలో రాజేంద్రప్రసాద్‌నే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సినిమాల్లో చూసినట్టుగా.. రియల్‌గానూ ఓ సంఘటన జరిగింది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఓ ప్రేమికుడు ప్రియురాలి కోసం… తానే అమ్మాయి వేషం వేసుకుని పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యాడు. తీరా అక్కడికెళ్లిన తర్వాత విషయం బయటపడి దొరికిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన అంగ్రేజ్‌ సింగ్‌, పరమ్‌జిత్‌ కౌర్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కౌర్‌ ‘బాబా ఫరీద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌’ నిర్వహించే మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతుంది. తన ప్రియురాలు పరీక్షల కోసం కష్టపడడం చూసి అంగ్రేజ్‌సింగ్‌ తట్టుకోలేకపోయాడు. పరీక్షల రోజు కౌర్‌కి బదులు తాను పరీక్షల్ని రాయడానికి సిద్ధమయ్యాడు. అచ్చం అమ్మాయిలా కనిపించేందుకు మీసాలు, గెడ్డం గీయించి, పెదాలకు లిప్‌స్టిక్‌ వేసుకుని, సల్వర్‌ కమిజ్‌ వేసుకొని రెడీ అయిపోయాడు. తీరా బయోమెట్రిక్‌ దగ్గర ఫింగర్‌ ప్రింట్స్‌ ఫెయిలయి అంగ్రేజ్‌సింగ్‌ పట్టుబడ్డాడు. దీంతో సోషల్‌మీడియాలో అంగ్రేజ్‌సింగ్‌పై మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

➡️