జూన్‌లో పెంచుతాం… ఎంత అనేది చెప్పలేం 

Jan 18,2024 08:36 #Anganwadi strike, #CITU, #Protest, #strike
botsa satyanarayana

‘ప్రజాశక్తి’తో మంత్రి బొత్స

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : అంగన్‌వాడీలకు వచ్చే జూన్‌లో వేతనం పెంచుతామని, అయితే, ఎంత పెంచుతామనేది చెప్పబోమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వచ్చే జూన్‌లో సమీక్ష చేసి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పెంచాలన్నదే ప్రభుత్వ ఆలోచనని చెప్పారు. ‘వెయ్యే కాదు… పరిస్థితిని బట్టి రూ.2 వేలు లేదా రూ.3 వేలైనా పెంచుతాం’ అంటూ మెరకముడిదాం మండలం సోమలింగాపురంలో తనను కలిసిన అంగన్‌వాడీలతో మంగళవారం ఆయన చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స బుధవారం తనను కలిసిన ‘ప్రజాశక్తి’తో మాట్లాడుతూ వేతనాలు పెంచడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదని, అయితే, ఇప్పుడు పెంచితే ఇతర ఉద్యోగులు కూడా వచ్చి ప్రభుత్వంపై పడతారని అన్నారు. ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచితే అంగన్‌వాడీలు మమ్మల్ని మర్చిపోతారు. అందుకే ఎన్నికల తర్వాత పెంపుదల ఉంటుందని మంత్రి నర్మగర్భంగా చెప్పారు. ఎన్నికలకు ముందు వేతనాలు పెంచడం సంప్రదాయం కాదని అన్నారు. తమ ప్రభుత్వం చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు ముందు ఆశ చూపించే రకం కాదని చెప్పారు. అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చిన 12 సమస్యలకు పరిష్కారం చూపామని, మిగిలిన వేతనాల పెంపు డిమాండ్‌ కూడా సమంజసమేనని, అందుకే దాన్ని కూడా పరిష్కరించేందుకు హామీ ఇస్తున్నామని అన్నారు.

 

అంగన్‌వాడీలకు తక్షణం జీతాలు పెంచాల్సిందే

మంత్రి బొత్స వ్యాఖ్యలు సరికాదు : సుబ్బరావమ్మ

అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలకు తక్షణం జీతాలు పెంచాల్సిందేనని, ఆకలి బాధతో అల్లాడుతున్న కార్మికులకు వేతనాలు పెంచితే ప్రభుత్వానికి ఎటువంటి నష్టం వాటిల్లదని అంగన్‌ వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుసాల సుబ్బరావమ్మ పేర్కొన్నారు. ఒకరికి జీతాలు పెంచితే మిగిలిన వారికి జీతాలు పెంచాల్సి వస్తుందని అందుకే పెంచడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం కరెక్ట్‌ కాదన్నారు. ఏ శాఖ కార్మికులైనా తాము పడే శ్రమకు వేతనం పెంచాలంటున్నారే తప్ప గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. జూన్‌లో పెంచితే..అప్పుడైనా మిగతావారు అడుగుతారు కదా! కాబట్టి ఆ వాదనలో పసలేదన్నారు. ప్రభుత్వ పరంగా ఆలోచించకుండా పార్టీ పరంగా ఆలోచిస్తున్నట్టున్నదని ఆమె పేర్కొన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాలను పక్కన పెట్టి అంగన్వాడీల జీతాలు ఎంత పెంచుతారో? ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టంగా చెప్పాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ జీతాలు పెంచకపోతే తాము కూడా ప్రత్యామ్నాయాల వైపు చూడాల్సి వస్తుందని ఆమె తెలిపారు. ప్రభుత్వం తక్షణమే జీతాల పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

➡️