ఆ ఇద్దరూ ఎందరినో కదిలించారు …

Jan 5,2024 10:12 #feature

కొత్త సంవత్సరం రోజు ఏం చేయాలి? ఆ రోజంతా స్నేహితులతో గడిపేయాలి. మంచి సినిమా చూడాలి. నచ్చిన వంట వండుకోవాలి. ఇష్టమైన ప్రదేశానికి వెళ్లాలి.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా నూతన సంవత్సరాన్ని ప్రారంభించి ఉంటారు. అయితే ముంబయికి చెందిన ఈ ఇద్దరు స్నేహితులు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు. తమతో కలసివచ్చిన స్నేహితులతో కలసి జనవరి 1న ముంబై బీచ్‌లో ఏకంగా 4 లక్షల 50 వేల కేజీల చెత్తను ఏరిపారేశారు. మొత్తం 25 వేల మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

క్షత్‌ షాహ్, శుభ మెహతా 12వ తరగతి చదివేటప్పుడు అంటే 2019లో ‘చేంజ్‌ ఈజ్‌ అస్‌’ పేరుతో వారాంతాల్లో బీచ్‌ శుభ్రం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇద్దరితోనే ఇది ప్రారంభమైంది. ముంబయి గిర్‌గావ్‌ చౌపతి బీచ్‌లో 450 టన్నుల చెత్తను మొట్టమొదట ఏరిపారేసింది ఈ మిత్రద్వయం. సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు తమ కార్యకలపాలను మిత్రులతో పంచుకోవడం వీళ్ల హాబీ.

‘నేను ఒకసారి సోషల్‌ మీడియాలో గ్రేటా థన్‌బర్గ్‌ పర్యావరణంపై చేసిన ఉపన్యాసం విన్నాను. ‘ఈ భూమి మనది. దీనిని కాపాడుకోవడం మన బాధ్యత’ అంటున్న ఆమె ఆ లక్ష్యం నెరవేరడం కోసం దేశవిదేశాల ప్రతినిధులతో పోరాడడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. గొప్పగా ప్రభావితం చేసింది. అప్పటి నుండి పర్యావరణాన్ని పరిశీలించడం ప్రారంభించాను. బీచ్‌లో పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ నా దృష్టిని ఆకర్షించింది. కొన్ని నెలల పాటు ముంబై బీచ్‌లన్నీ తిరిగాను. అక్కడ కొంతమంది స్వచ్ఛందంగా చెత్త ఏరే పనులను చేస్తున్నారు. వారాంతాల్లో కొంతమంది, ఏదైనా ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుని మరికొంతమంది ఈ పనిని చేస్తున్నట్లు నాతో చెప్పారు. అప్పుడే నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. శుభ్‌తో ఈ విషయం పంచుకున్నాను. తను కూడా నాతో చేయి కలిపాడు’ అంటున్నాడు అక్షత్‌. ప్రస్తుతం స్నేహితులిద్దరూ ఇంజినీరింగ్‌ చేస్తున్నారు.

ఈ బృందంలో ఉన్న మొత్తం వాలంటీర్లలో 10 ఏళ్ల నుండి 75 ఏళ్ల వారు ఉన్నారు. ‘మా చిన్నప్పుడు కూడా బీచ్‌లో చెత్త ఉండేది. అయితే అదంతా ఆహార వ్యర్థాలు. కానీ ఇప్పుడు అలా లేదు. ప్లాస్టిక్‌ సంచులు, సీసాలు, ఇంకా ఇతర వ్యర్థాలతో బీచ్‌ అంతా నిండిపోయింది. ఎన్నో ఆహ్లాదకర సాయంత్రాలను ఇక్కడ గడిపాం. కానీ ఇప్పుడు ఇక్కడికి రావాలంటేనే భయంగా ఉంటోంది. అందుకే వీళ్లు చేస్తున్న పనిలో భాగం కావాలనుకుని వీళ్లతో చేయి కలిపాను’ అంటోంది 75 ఏళ్ల కుంతీ ఓజా. జమీలా సాలేమ్‌ (18) ఏడు నెలలుగా ఈ కార్యక్రమంలో భాగమైంది. ‘మొదట నేను ఒక్కదాన్నే వచ్చాను. తరువాత నా స్నేహితులను కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు మేమంతా క్రమం తప్పకుండా బీచ్‌ని శుభ్రం చేస్తున్నాం’ అంటోంది. 55 ఏళ్ల క్రాంతీ సాల్వీ ట్రెక్కింగ్‌, నడక, పరుగుపోటీలు వంటివి నిర్వహిస్తుంటారు. ‘బాధ్యతాయుతమైన ఈ పనిని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ గ్రహాన్ని రక్షించడంలో నా బాధ్యత నెరవేరుస్తున్నానని తృప్తిగా ఉంటుంది’ అని చెబుతున్నారు ఆమె.

‘చాలా మంది యువత ఈ పనిలో భాగమవుతున్నారు. మేమంతా ఒక ప్రాంతాన్ని నిర్దేశించుకుని వీలున్న సమయంలో అక్కడ కార్యక్రమం చేస్తాం. మొదట్లో మేమిద్దరమే ఈ పని చేస్తుంటే అందరూ మమ్నల్ని అదోలా చూసేవాళ్లు. ఇప్పుడు వేలాదిమందితో కలసి చేస్తుంటే అక్కడ ఉన్న వారు కూడా మాతో చేతులు కలుపుతున్నారు. చాలా సంతోషంగా ఉంటోంది’ అంటున్నాడు శుభ్‌. ‘2019 జులైలో 18 మంది వాలంటీర్లతో మొదటి క్లీనప్‌ ప్రోగ్రామ్‌ చేశాం. ఇప్పుడు 25 వేల మందిమి కలసి పనిచేస్తున్నాం. ప్రతి డ్రైవ్‌ని మేము ఎంతో బాధ్యతాయుతంగా చేయడమే కాదు, ఈ బాధ్యత అందరిదీ అని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తాం’ అంటున్నారు మిత్రులిద్దరూ.

➡️