జగన్‌, చంద్రబాబు ఇద్దరూ మోడికి బానిసలు

Apr 14,2024 22:50 #speech, #ys sharmila

– ‘ఇండియా’తోనే ప్రత్యేక హోదా సాధ్యం
– 2.30 లక్షల ఉద్యోగాల పైనే మొదటి సంతకం
– పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా):వైసిపి అధినేత జగన్‌.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ నరేంద్ర మోదీకి బానిసలని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఏ నాడూ ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, సత్యవేడులో ఆమె ఆదివారం ఎన్నికల ప్రచారసభలో పాల్గన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఇండియా వేదికతోనే ప్రత్యేక హోదా సాధ్యమని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ సమస్య తీర్చడానికి 2.30 లక్షల ఉద్యోగాల భర్తీపై మొదటి సంతకం పెడతానని చెప్పారు. చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని మోడీకి తాకట్టు పెట్టారన్నారు. పోలవరం ప్రాజెక్టు, దుగ్గిరాజుపట్నం ఓడరేవు, విశాఖ రైల్వే జోన్‌, కడప స్టీల్‌ ప్లాంటు, మన్నవరం విద్యుత్‌ ఉపకరణాల తయారీ ప్రాజెక్టు, కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేకపోవడం బాధాకరమని తెలిపారు. జగన్‌ తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని విస్మరించారన్నారు. చదువుకునే ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ప్రతి ఏడాది జాబ్‌ కేలండర్‌, మెగా డిఎస్‌సి అని నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల వేళ 6 వేల పోస్టులతో దగా డిఎస్‌సి నిర్వహించడానికి నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. ఎవరైనా ఎన్నికలకు రెండు నెలల ముందు డిఎస్‌సికి నోటిఫికేషన్‌ ఇస్తారా? అని ప్రశ్నించారు. జగన్‌ పాలనలో ఏడు పర్యాయాలు విద్యుత్‌ ఛార్జీలు, రెండు సార్లు ఆర్‌టిసి ఛార్జీలు పెంచారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచడంతో సామాన్యుల బతుకు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. ఇండియా వేదిక అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.లక్ష ఆర్థిక సాయం, 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వఅద్ధులు, వితంతువులకు నెలకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు చొప్పున పింఛను అందజేస్తామని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షలతో పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. ప్రతి ఓటరు ఆలోచించి మంచి చేసే వారికి ఓటు వేయాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ పోతుగుంట రాజేష్‌ నాయుడు, తిరుపతి ఎంపి అభ్యర్థి డాక్టర్‌ చింతామోహన్‌, సత్యవేడులో ఎమ్మెల్యే అభ్యర్థి బాలాగురు బాబుని ప్రజలు గెలిపించాలని కోరారు.

➡️