పోస్టల్‌ బ్యాలెట్‌ జారీలో సందిగ్ధత తొలగించాలి – సిఇఒకు బొప్పరాజు వినతి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ ప్రక్రియలో అధికారుల మధ్య నెలకొన్న సందిగ్ధత తొలగిస్తూ స్పష్టమైన సూచనలు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌, ఎపిజెఎసి అమరావతి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనాను ఎపిజెఎసి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో ప్రతినిధుల బృందం పలిశెట్టి దామోదర్‌, కె రమేష్‌కుమార్‌, వివి మురళీకృష్ణనాయుడు కలిసి వినతిపత్రం అందజేశారు. రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, అవి నిరూపణ కాకపోయినప్పటికీ నిజాయతీగా పనిచేసే ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం కోల్పోయే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్లను వారి సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఓటు వేయానికి వీలుగా మే నెల మొదటి వారంలో స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ను ప్రకటించి, వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించాలని సిఇఒను కోరారు.

➡️