పురోగతికి పుస్తకాలే ప్రేరణ

Mar 31,2024 07:43 #books, #Library, #Sneha, #Stories
  • చిన్నప్పుడు మీకు ఇష్టమైన కథ ఏది అని అడిగితే టక్కున ఏ రాజు కథో, చేపల కథో, పులి-మేక కథో, పేదరాసి పెద్దమ్మ, మూడు కుండలు, కాకి-పాము, తెనాలి రామలింగడి చమత్కారం లేదా పంచతంత్రంలోని మిత్ర భేదం, మిత్ర లాభం, అదీకాకపోతే చందమామలోని భేతాళుడి కథ ఇలా పెద్ద లిస్టే వస్తుంది. ఇది బాల్యంలో సహజంగా ఎదిగే పిల్లల అనుభవం. కథ వినకుండా, కథ చెప్పకుండా, కథ చదవకుండా ఎవరి బాల్యం అయినా గడిచింది అంటే అక్కడేదో సమస్య ఉన్నట్లే. తలిదండ్రులు, తాత అవ్వల పక్కన పడుకొని, వాళ్ళు కథ చెబుతుంటే మధ్యలోనే ఆపించి, నేనొక కథ చెబుతాను అంటూ కథలు అల్లడం నేర్చుకున్న బాల్యాన్ని మిస్‌ అయ్యాము అంటే నీ ఊహాశక్తికి రెక్కలు కత్తిరించినట్లే. ఒకే పుస్తకం కోసం పోటీ పడే బాల్య స్నేహితులు లేరంటే అందమైన బాల్యంలో నీవొక పేజీని కోల్పోయినట్లే. పెద్దవాళ్లు చదివే పుస్తకాలు వారు చూడకుండా దొంగతనంగా చదివి, అందులో వున్న విషయాలను మిత్రులతో చర్చించిన జ్ఞాపకం.. బాల్యం, యవ్వనం మధ్య జరిగే అంతర్మథనం నుంచి ఏది మంచీ ఏది చెడూ అని నిర్ణయించుకొనేందుకు సహకరించిన ఉపాధ్యాయులను జీవితాంతం గుర్తుచేసుకుంటాం. మానవ వికాసానికి, సాంస్కృతిక పురోగతికి పుస్తకాలు దోహదపడతాయనేది అక్షర సత్యాలు. ఏప్రిల్‌ 2వ తేదీన ”ప్రపంచ పిల్లల పుస్తక దినోత్సవం” సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..

వేమన పద్యం, సుమతీ శతకం పద్యాలు కంఠతా పట్టి, పద్యం-భావం చెప్పడం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కథలు, పుస్తకాలు బాల్యంతో ఎంతలా పెనవేసుకొని వున్నాయో కదా అనిపిస్తుంది. అవి పసి హృదయాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. నీతి-నిజాయితీ, మంచి-చెడు, స్నేహం- సహాయం, త్యాగం-ప్రేమ, జంతు ప్రేమ, ప్రకృతిపై మక్కువ, దేశభక్తి, ఇతరుల పట్ల మెలగడం, శ్రమ, తిండి మొదలైనవన్నీ అండర్‌ కరెంట్‌గా పిల్లల మదిలో చెరగని ముద్ర వేస్తాయి. ఇది వారిని జీవితాంతం వెన్నంటి వుంటుంది. బాల్యం ఎలా గడిచింది అనే దానిని బట్టి నీ భవిష్యత్‌ చెప్పవచ్చు అంటారు. అటువంటి బాల్యాన్ని ప్రభావితం చేయగలిగేవి స్నేహితులతో పాటు పుస్తకాలు. మనదేశంలో కథలు చెప్పే గొప్ప సంప్రదాయం వుంది. ఇది వారసత్వ సంపదగా వస్తున్నది.

 


పఠనాసక్తి కలిగించడం..
బాలల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని కలిగించడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. పిల్లలతో పాటు యువకులనూ, పెద్దవాళ్ళను బాలసాహిత్యం వైపు ఆకర్షించే విధంగా, చదవడం పట్ల ఆసక్తి కలిగించే విధంగా, వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. పాఠశాలల్లో, గ్రంథాలయాల్లో స్వచ్ఛంద సంస్థలు, సాహిత్య సంస్థలు, ప్రచురణ సంస్థలు, తల్లిదండ్రులు, ప్రభుత్వాలు, వ్యక్తులు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. బాలసాహిత్య రచయితలు తమ పుస్తకాలను ఈ సందర్భంగా ప్రత్యక్షంగానూ, అంతర్జాలంలోనూ ఆవిష్కరిస్తున్నారు.
తెలుగులో బాలసాహిత్యంపై 1980 దశకం వరకూ ఎంతో విశేషమైన కృషి జరిగింది. 1976లో ఆంధ్రప్రదేశ్‌లో బాలల అకాడమీ ఏర్పడింది. ఇదే మన దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి బాలల అకాడమీ. 1977 ఫిబ్రవరిలో ‘ఆంధ్రప్రదేశ్‌ బాలల మహాసభలు’ హైదరాబాద్‌లో కేశవ మెమోరియల్‌ హైస్కూల్‌లో జరిగాయి. ఆ సందర్భంగా బాల సాహిత్యానికి సంబంధించిన అమూల్యమైన వ్యాసాలతో ప్రత్యేక సంచికను కూడా ప్రచురించారు. ఆ సంచికలో దాదాపు అంతవరకూ నడిచిన మన బాలసాహిత్య చరిత్రంతా కనబడుతుంది. ఎనభైల తరువాత నెలకొన్న పరిస్థితుల వల్ల తెలుగు బాలసాహిత్యం వెనకపట్టు పట్టినా గడచిన రెండు దశాబ్దాలుగా మళ్ళీ పుంజుకున్నది. ముఖ్యంగా అన్ని దినపత్రికలూ పిల్లల కోసం పేజీ పెట్టడం, ఆదివారం స్పెషల్‌లో పిల్లల కథలు, బాలల దినోత్సవం, వేసవి సందర్భంగా ప్రత్యేక సంచికలు తీసుకురావడం. బాలల కోసం చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, చెకుముకి, చంపక్‌, స్పార్క్‌ , టెల్‌ మి వై? కామిక్స్‌, విజ్ఞాన వాహిని వంటి మాస పత్రికలూ తెలుగుతో పాటు అన్ని భాషలలో ప్రచురితమవుతున్నాయి.

 


కొత్త కొత్త మార్పులు..
ఈనాటి పిల్లల అభిరుచులకూ, అవసరాలకూ తగినట్టుగా బాలసాహిత్యంలో వస్తువు విషయంలోనూ, భాష విషయంలోనూ కొత్త మార్పులు వస్తున్నాయి. పిల్లలు కథలు, కవితలే కాకుండా యాత్రా చరిత్రలు, స్వగతాలు, ఇతిహాస పాత్రలపై విశ్లేషణలూ, పర్యావరణ పరిరక్షణపైనా రాస్తున్నారు. పెద్దల సహకారంతో అవి పుస్తకాలుగా వస్తున్నాయి. వాటితో పాటు పెద్ద నగరాల్లో రీడింగ్‌ రూమ్స్‌, రీడింగ్‌ క్లబ్స్‌, లైబ్రరీలు, స్టోరీ రూమ్స్‌, ప్లే విత్‌ బుక్‌, విజిట్‌ యువర్‌ లైబ్రరీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్స్‌, గ్రంథాలయాలు, ఇతర అనేక సంస్థల వేసవి శిబిరాల్లో పుస్తక పఠనం ప్రధానమైన ఆక్టివిటీగా నిర్వహిస్తున్నాయి.

ఒక్కరోజే కాదు.. ప్రణాళిక ఉండాలి..
ప్రపంచ పిల్లల పుస్తక దినోత్సవం ఒకరోజు జరుపుకోవడంతో బాటు కనీసం నెలకు ఒక్కరోజైనా పిల్లలు వివిధ రకాల పుస్తకాలతో గడిపే ఏర్పాటు పాఠశాలలు చేయాలి. పుస్తకాలను చదువుకునే వాతావరణం కల్పించాలి. బాలల రచనలు చేసే పిల్లలు, పెద్దలతో పాఠశాలల్లో, గ్రంథాలయాల్లో, అపార్ట్‌మెంటుల్లో చర్చలు పెట్టాలి. నగరాల్లో పిల్లలకోసం తప్పనిసరిగా ఓ పిల్లల లైబ్రరీ ఉండేలా పెద్దలు ప్రయత్నించాలి.
ప్రతి ఊరిలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో బాలలకోసం సాహిత్య వేదికలో, సంస్థలో ఏర్పాటు చేయడానికి ఉపాధ్యాయులూ, సాహిత్య అభిమానులూ పూనుకోవాలి. పిల్లల గ్రంథాలయాలు నడుపుతూ.. పిల్లలకు పుస్తకాల స్నేహం కలిగిస్తున్నవాళ్ళు ఉండొచ్చు. పిల్లల్ని వారి ఆలోచనలూ, అనుభవాలూ, ఊహలూ, కల్పనలూ వివిధ సాహిత్య ప్రక్రియల్లో రాసేలా ప్రోత్సహించాలి. అలాంటి ప్రయత్నం అవనిగడ్డ డిగ్రీ కాలేజీలో జరిగింది. విద్యార్థులు చేతివ్రాతతో ‘దివిసీమ దివిటీలు’ అనే పేరుతో మాసపత్రికను నిర్వహిస్తున్నారు. ‘స్పార్క్‌’ కేరళ బాల సంఘం డిజిటల్‌ మ్యాగజైన్‌. దీనిలో బాలలే ప్రధాన రచయితలు.

 


పిల్లల దగ్గరికి చేరుద్దాం..
ప్రథమ్‌ సంస్థ అసర్‌ (ASER) నివేదిక 2022 ప్రకారం, మనదేశంలో పిల్లల ప్రాథమిక పఠన సామర్థ్యం 2012 కంటే ముందు స్థాయికి పడిపోయింది. సెల్‌ఫోన్‌ వచ్చిన తరువాత పుస్తకాలకు దూరమవుతున్న తరం మనకు కనిపిస్తుంది. ఆ దూరం నుండి పుస్తకానికి దగ్గరగా తీసుకురావాలి. నేటి బాలలే రేపటి పౌరులని నినాదాలకే పరిమితం కాకుండా పుస్తక పఠనం వంటి కార్యక్రమాల ద్వారా వారిలో భాషా నైపుణ్యాలు వికసిస్తాయి.. మంచీచెడు విచక్షణ అలవడుతుంది. లోకజ్ఞానం, లోకరీతులూ తెలుస్తాయి. నైతిక విలువలు నేర్చుకుంటారు. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతాయి. సమస్యల వేళ ధైర్యంగా నిలబడగలుగుతారు. తార్కికంగా, శాస్త్రీయంగా ఆలోచించగలుగు తారు. మంచి పుస్తకాలకు పిల్లలు చేరువైతే తెలుగు భాషకూ, పిల్లలకూ, భవిష్యత్తరాలకూ, సమాజానికీ, దేశానికీ, ఈ ప్రపంచానికీ తప్పకుండా మేలు జరుగుతుంది. మానవ చరిత్ర పురోగమనంలో పుస్తకాల పాత్ర అత్యంత విలువైనది. వాటిని పిల్లల దగ్గరకు చేరుద్దాం. సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం చేద్దాం.

ప్రశ్నలు ఉదయించాలి..
ఏమిటి, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు – వీటిని ప్రశ్నా పంచాకంగా పేర్కొంటారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ప్రతి బాలునిలో, బాలికలో సహజంగా ఉదయించే ప్రశ్నలివి. వీటికి సమాధానాలు చెప్పి, బాలబాలికల కుతూహలాన్ని తీర్చ గల సాహిత్యం మనకి సమృద్ధిగా రావాలి. కుతూహలాన్ని సకాలంలో సక్రమంగా తీర్చకపోతే, అది అసలే అణగారిపోతుంది. ఇట్టి కుతూహలం లేని బాలబాలికలు బాధ్యతాయుతులైన పౌరులుగా వికసించలేరు.

నామమాత్రపు కేటాయింపులు..
బడ్జెట్‌ విషయానికి వచ్చినట్లయితే నామమాత్ర బడ్జెట్‌ పాఠశాలలకు కేటాయించినప్పటికీ గ్రంథాలయాలకు వినియోగించకుండా ఇతర వాటికి ఉపయోగిస్తున్నారు. కచ్చితంగా గ్రంథాలయాలకు బడ్జెట్‌ కేటాయించాలి. వీటితో కొత్త పుస్తకాలు, విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు అందించాల్సిన అవసరముంది. విద్యార్థులను పుస్తక పఠనం వైపు మళ్ళించే కార్యక్రమాలు రూపొందించాలి. బాలల పుస్తకాలు ముద్రించే వారికి ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం ద్వారా తక్కువ ఖరీదుకు అమ్మవచ్చు. అప్పుడు అందరూ కొనుక్కోగలుగుతారు.

ఇదీ అసలు కథ..
పుస్తకాలు చదవడం ప్రోత్సహించడం కోసం ‘ప్రపంచ పిల్లల పుస్తక దినోత్సవం’ ఏప్రిల్‌ 2వ తేదీన నిర్వహిస్తున్నారు. బాలల కోసం నూట అరవై ఎనిమిది కథలు రాసి, బాల సాహిత్యానికి అమూల్యమైన సేవ చేసిన డెన్మార్క్‌ దేశానికి చెందిన రచయిత ‘హాన్స్‌ క్రిస్టియన్‌ ఆండర్సన్‌ (1805-1875)’ పుట్టిన రోజు సందర్భంగా ‘ద ఇంటర్నేషనల్‌ బోర్డ్‌ ఆన్‌ బుక్స్‌ ఫర్‌ యంగ్‌ పీపుల్‌’ (ఐ.బి.బి.వై) అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా బాల సాహిత్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్నారు. ఆండర్సన్‌ పిల్లల కోసం రాసిన అనేక కథల సంపుటాలు 125కు పైగా భాషల్లోకి అనువాదమై, అనేక దేశాల పిల్లలకు అందుబాటులోకి వచ్చాయి. ఆండర్సన్‌ 1805లో డెన్మార్క్‌లోని ‘ఓడెన్స్‌’ అనే ఓ చిన్న గ్రామంలో పేద కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి చెప్పులు కుట్టేవాడు. తల్లి బట్టలు ఉతికే పని చేసేది. అనారోగ్యంతో తండ్రి ఆండర్సన్‌ పదకొండో ఏటనే మరణించాడు. కానీ ఆయన బతికి ఉన్న రోజుల్లో ప్రతిరోజూ రాత్రి పడుకునేటప్పుడు ఆండర్సన్‌కు కథలు చెప్పేవాడు. అలా చిన్నతనం నుంచే ఆండర్సన్‌కు కథల పట్ల మక్కువ ఏర్పడింది. తండ్రి చనిపోయిన తరువాత నాయనమ్మ ఆ పిల్లాడికి రాత్రిళ్ళు కథలు చెప్పడం కొనసాగించింది.
కొందరు సహృదయుల సహకారంతో ఆండర్సన్‌ విశ్వవిద్యాలయంలో చదువుకోగలిగాడు. ఆయన ‘టేల్స్‌ టోల్డ్‌ ఫర్‌ చిల్డ్రన్‌’ అనే పేరుతో నాలుగు కథల సంపుటాలు ముద్రించాడు. ఆ కథల సంపుటాలు ఆయనకు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఆయన పేరుతో డెన్మార్క్‌ ప్రభుత్వం బాల సాహిత్యంలో అత్యున్నత అవార్డును ఇస్తోంది.
తెలుగులో కూడా ఆయన కథలు ‘బాలానందం’ పేరుతో రెండు సంపుటాలుగా వచ్చాయి. ‘ఆండర్సన్‌ కథల’ పేరుతో పీకాక్‌ క్లాసిక్స్‌, హైదరాబాద్‌ వారు 2008లో అచ్చు వేశారు. మంచి పుస్తకం వారు కూడా ఆండర్సన్‌ కథలను ‘ఎగిరే పెట్టె- ఆండర్సన్‌ కథలు’ అనే పుస్తక రూపంలో 2017లోనూ, 2020లోనూ ప్రచురించారు. ఆండర్సన్‌ కథలు ఊట్ల కొండయ్యగారు అనువదించారు. ప్రఖ్యాత చిత్రకారులు బాపు బొమ్మలు వేశారు. ఈనాటి పిల్లలు ఆ కథలు చదవవచ్చు.

 


ప్రోత్సాహం ప్రధానం..
పిల్లల సాహిత్య ప్రేమికులు పిల్లలతో వివిధ ప్రక్రియల్లో రాయించడం, వాటిని పుస్తకాల రూపంలో అచ్చు వేయించి, వెలుగులోకి తెస్తున్నారు. సాహిత్య అకాడమీలూ, ప్రభుత్వాలూ, విశ్వవిద్యాలయాలూ, స్వచ్ఛంద, సాహిత్య సంస్థలూ పిల్లల రచనలకు బహుమతులు, అవార్డులు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఈనాటి పిల్లలు తాము రాసిన పుస్తకాల ద్వారా స్కాలర్‌ షిప్పులూ, జాతీయ స్థాయి గుర్తింపులూ, బహుమతులూ, అవార్డులూ పొందుతున్నారు. కొన్ని సంస్థలు బాల సాహిత్య కార్యశాలలు కూడా నిర్వహిస్తూ బాలలతో కథలు రాయిస్తున్నారు. అలాంటి ప్రయత్నం జన విజ్ఞానవేదిక, ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక చేసాయి.

మన రాష్ట్రంలో వేసవి సెలవుల్లో, జాతీయ పండగల సందర్భంగా, గ్రంథాలయాలలో, బాలోత్సవాలలో పిల్లలకు కథలు, కవితల, కథా విశ్లేషణ పోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. పిల్లల ప్రత్యేక సంచిక ”చిరుమువ్వలు” ప్రజాశక్తి చిల్డ్రన్స్‌ డే సందర్భంగా వేసింది. 170 మంది పిల్లలు ఇందులో రాశారు. దానిలో కథలు 40 మంది, కవితలు 50 పైన, 60కి పైగా చిత్రాలు, ఇంకా చిన్నచిన్న వ్యాసాలతో చిన్నారుల మదిలో భావాలకు ప్రతిరూపం ఇచ్చారు. ఇప్పుడు పిల్లలలకు ఏమీ రాదు అనుకునే వారందరూ ఈ పుస్తకం చదవాలి. స్నేహం, పర్యావరణము, ఐక్యమత్యం, రైతు, భూమి.. ఇలా వాళ్ళు తడమని అంశం లేదు. చక్కటి వ్యక్తీకరణ, చిన్నచిన్న పదాలతో భవిష్యత్‌ రచయితలుగా ఎదిగేవారికి ఇటువంటి ప్రచురణలు ఎంతో ప్రోత్సాహకముగా ఉంటాయి. పిల్లల ఆలోచన లకు పెద్దలు కాస్త ఊతం ఇస్తే అల్లుకుపోతారు. ఇటువంటి రచనలు మరిన్ని రావాలి పిల్లల నుంచి. పుస్తక ప్రదర్శనలో పిల్లల పుస్తకాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటున్నాయి.

 


పండగలా జరపాలి..
ప్రపంచ పిల్లల పుస్తక దినోత్సవాన్ని పాఠశాలల్లో, నగరాల్లో, గ్రామాల్లో పిల్లలు ఉన్న ప్రతిచోటా పండగలా జరుపుకోవాలి. పిల్లలను పుస్తకాలకు దగ్గర చేసే రకరకాల కార్యక్రమాలు జరగాలి. బాలసాహిత్య అవసరాన్ని గుర్తించి, విశేష కృషి చేసిన వారి జన్మ దినం రోజు ఆ పుస్తకాలు చదివించడం, పోటీలు పెట్టి బహుమతులుగా పుస్తకాలు ఇవ్వడం చేయాలి. బాలసాహిత్యంలో ప్రపంచ ప్రసిద్ధ పుస్తకాలు టామ్‌సాయర్‌, హకల్‌ బెరీఫిన్‌, కాంచన ద్వీపం, రిప్‌వాన్‌ వింకిల్‌, గలీవర్‌ సాహసయాత్రలు, యూసోపు కథలు, టాల్‌స్టారు పిల్లల కథలు, ఆస్కార్‌వైల్డ్‌ పిల్లల కథలు, రాబిన్‌ సన్‌ క్రూసో, సోవియట్‌ పిల్లల పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. ఆండర్సన్‌ కథల పుస్తకాలను, దేశ దేశాల పిల్లల జానపద కథల పుస్తకాలను అందుబాటులోకి తేవాలి. అలాగే, భారతీయ భాషల్లో అద్భుతమైన బాలసాహిత్యాన్ని రచించిన రవీంద్రనాథ్‌ ఠాకూర్‌, ప్రేమ్‌చంద్‌, సత్యజిత్‌రే, గిజూభాయి, చిత్త ప్రసాద్‌, గురజాడ, కందుకూరి వీరేశలింగం, కొడవటిగంటి కుటుంబరావు, చంద్రశేఖర్‌ ఆజాద్‌, శ్రీశ్రీ, ముళ్లపూడి వంటి వారి రచనల పుస్తకాలను నేటి పిల్లలకు పరిచయం చేయాలి. రొమిల్లా థాఫర్‌, రస్కిన్‌ బాండ్‌, అనుష్క రవిశంకర్‌, మాధురీ పురంధరే, కమలా బాసిన్‌ వంటి వందలాది బాలసాహిత్య రచయితల పుస్తకాలను, వాటి అనువాదాల పుస్తకాలను పిల్లలకు అందుబాటులో ఉంచాలి.

మహనీయుల మాటలు..
మంచి పుస్తకం దగ్గరుంటే మనకు మంచి మిత్రులు వెంటలేని లోటు కనిపించదు.
– మహాత్మాగాంధీ

చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో.
– కందుకూరి వీరేశలింగం పంతులు.

మానవ శరీరానికి రక్త ప్రసరణ.. హృదయం.. ఎంత అవసరమో సమాజానికి గ్రంథాలయాలు అంత అవసరం.
– డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌.

గ్రంథాలయాలు ఊహాశక్తికి ప్రేరణనిచ్చే శక్తిని నిల్వ చేస్తాయి. అవి ప్రపంచాన్ని అన్వేషించడానికి, సాధించడానికి, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి కిటికీలను తెరుస్తాయి, దోహదపడతాయి.
– సిడ్నీ షెల్డన్‌

వెబ్‌సైట్లు..
ఇప్పుడు కథలు, కవితలు, ఇంటరాక్టివ్‌ కార్యకలాపాలతో కూడిన బాల సాహిత్యాన్ని అందించే అనేక వెబ్‌సైట్‌లు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రసిద్ధమైనవి స్టోరీలైన్‌ ఆన్‌లైన్‌ (story lineonline.net), స్టోరీనరీ (storynory.com), ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ డిజిటల్‌ లైబ్రరీ (childrenslibrary.org), స్టార్‌ఫాల్‌ (starfall.com), స్కాలస్టిక్‌ కిడ్స్‌ (scholastic.com/kids/home/), నేషనల్‌ జియోగ్రాఫిక్‌ కిడ్స్‌ (kids.nationalgeographic.com), PBS కిడ్స్‌, (storyberries.com),reed.gov (library of congress),Mrs. Pus Magic library వీaస్త్రఱష శ్రీఱbతీaతీy ప్రస్తుతం ఎంతసేపూ చదువు, చదువు అంటూ బాలలను యంత్రాలుగా మార్చేస్తున్నారు. బాలలకు చదవడం అంటే పాఠ్యపుస్తకాలు మాత్రమే చదవడం కాదు. కథల పుస్తకాలు, మానసిక ఉల్లాస పుస్తకాలు, ప్రేరణగొల్పే పుస్తకాలు, సామాజిక అవగాహన, స్పృహ కలిగిన పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు విద్యార్థులకు అనుగుణంగా ఉండే పుస్తకాలు కలిగిన గ్రంథాలయంతో పఠానుబంధం ఉండాలి. గ్రంథాలయాన్ని వినియోగించుకునేందుకు టైంటేబుల్‌లో సమయం కేటాయించక పోవడం బాధాకరం. విషయమేమంటే విద్యార్థి ఫీజులో గ్రంథాలయ ఫీజు కూడా ఉండటం గమనార్హం. వారి నుండి గ్రంథాలయం కోసం వసూలు చేసిన రుసుము కూడా వాటికి ఉపయోగించక పోవడం ఇబ్బంది కలిగించే అంశం.
”పుస్తకాల నుంచి స్వీకరించే సామర్థ్యాన్ని మనం ఏర్పరచుకుంటే మనకి చెందిన ప్రతిదీ వాటినుంచి లభిస్తుంది.” దాదాపు ఒక శతాబ్దం క్రితం రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అన్నది.. ఈనాటికీ పిల్లల విషయంలో కొనసాగుతున్నది. మనదేశంలో పిల్లల ప్రచురణ మానవ వికాసానికి, సాంస్కృతిక పురోగతికి కీలకం.

 

  • డా. కె. రమాప్రభ,
    సామాజిక కార్యకర్త
    9492348428
➡️