ఇసి పనితీరుపై నీలినీడలు

ప్రశ్నార్థకం అవుతున్న పారదర్శకత
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల కమిషన్‌ (ఇసి) పనితీరుపై నీలినీడలు అలముకున్నాయి. దాని పారదర్శకత రానురానూ ప్రశ్నార్థకం అవుతోంది. గోయల్‌ రాజీనామాతో ఇప్పుడు ఇసిలో కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మాత్రమే ఉన్నారు. గత నెలలో పదవీ విరమణ చేసిన అనూప్‌ పాండే స్థానంలో ఇప్పటి వరకూ ఎవరినీ నియమించలేదు. ఈ వారంలోనే ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై ఖాళీగా ఉన్న రెండు పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది.
ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నికల కమిషన్‌ నిర్వహించే పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభలకు ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు కూడా ఎన్నికల కమిషనే ఎన్నికలు నిర్వహిస్తుంది. వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండేలా ఈసీ చర్యలు తీసుకుంటుంది. అయితే ఇటీవలి కాలంలో దేశంలో స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం అసాధ్యంగా మారింది. ప్రజాస్వామ్యానికి తావే లేకుండా పోతోంది. నియంతృత్వం రాజ్యమేలుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ స్వతంత్రత, పారదర్శకత, పనితీరు ప్రశ్నార్థకంగా మారింది.

ఇబిలపై పిల్లిమొగ్గలు
ఎన్నికల బాండ్ల (ఇబి) పథకంపై సుప్రీంకోర్టు గత నెలలో సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత మూడు రోజుల వరకూ ఇసి పెదవి విప్పలేదు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని సిఇసి రాజీవ్‌ కుమార్‌ ముక్తసరిగా చెప్పారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల మేరకు ఈసీ ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా ఎన్నికల బాండ్ల వివరాలను తన వెబ్‌సైట్‌లో పెట్టాల్సి ఉంటుంది. వాస్తవానికి ఎన్నికల బాండ్ల పథకంపై ఈసీ మొదటి నుండి పిల్లిమొగ్గలు వేస్తోంది. ఈ పథకం ప్రారంభం కావడానికి ముందు దానిని వ్యతిరేకిస్తూ న్యాయ శాఖకు లేఖ రాసింది. అయితే 2021లో హఠాత్తుగా తన వైఖరిని మార్చుకుంది. ఎన్నికల బాండ్ల జారీపై స్టే విధించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది.

ఈవీఎంలు, వీవీపాట్లపై…
ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీపాట్లను ఉపయోగించడంపై పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీపాట్ల మధ్య వచ్చిన వ్యత్యాసాలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ కేంద్రానికి ఎలాంటి వివరణలు ఇవ్వలేదు. గత నాలుగు సంవత్సరాలుగా ఈసీ నుండి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గత జూలైలో పార్లమెంటుకు తెలియజేసింది. ఈవీఎంలను నూటికి నూరు శాతం పరిశీలించడం తిరోగమనమే అవుతుందని, అది తిరిగి పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతికి దారితీస్తుందని గత సెప్టెంబరులో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈసీ తెలిపింది.

ప్రధాని నిర్ణయం మేరకే…
అరుణ్‌ గోయల్‌ రాజీనామా అనేక ప్రశ్నలు లేవనెత్తింది. అయితే ఆయన నియామకం వివాదరహితమైనదేమీ కాదు. ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేసిన మరునాడే 2022 నవంబర్‌ 10న ఆయన ఈసీగా నియమితులయ్యారు. ఈ హడావిడి ప్రక్రియను సుప్రీంకోర్టు తప్పు పట్టింది కూడా. ఈసీలో ఇప్పుడు ఖాళీగా ఉన్న ఎన్నికల కమిషనర్ల పదవులను నూతన చట్టం ప్రకారం భర్తీ చేస్తారు. ఈసీలు, సీఈసీల నియామక ప్రక్రియ నుండి ప్రధాన న్యాయమూర్తిని తప్పించిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని అభీష్టం మేరకే నియామకాలు జరిగిపోతాయి. ఎంపిక కమిటీలో ప్రతిపక్ష నేత సభ్యుడుగా ఉన్నప్పటికీ ఆయన మాట చెల్లుబాటు కాదు.

అసమ్మతి తెలిపితే అంతే
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కావడానికి కొద్ది నెలల ముందు అంటే 2020 ఆగస్టులో ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసా తన పదవికి రాజీనామా చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని లవాసా అభిప్రాయపడ్డారు. ఈసీలో మిగిలిన ఇద్దరు సభ్యులు దీనితో ఏకీభవించకపోవడంతో కమిషన్‌ ఆదేశాలలో తన అసమ్మతిని నమోదు చేయాలని లవాసా పట్టుబట్టారు.
ఈ ఉదంతం జరిగిన తర్వాత కొన్ని వారాలకు లవాసా మొబైల్‌ ఫోన్‌ పెగాసస్‌ స్పైవేర్‌కు లక్ష్యంగా మారింది. 2019లో లవాసా భార్య, కుమారుడు, సోదరిపై కూడా దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ లవాసా 2020లో కమిషన్‌కు రాజీనామా చేసి ఆసియన్‌ అభివృద్ధి బ్యాంక్‌లో ఉపాధ్యక్షుడుగా చేరారు. ప్రస్తుతం ఆయన అక్కడే పనిచేస్తున్నారు. తన రాజీనామాకు ముందు ఆయన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో ఓ వ్యాసం రాస్తూ ‘ఇది హుందాగా వ్యవహరించినందుకు లభించిన మూల్యం’ అని వ్యాఖ్యానించారు.

 

➡️