బ్లాస్ట్‌ ఫర్నెస్‌ని పునరుద్ధరించాలి

Dec 4,2023 20:40 #Dharna, #visaka, #visakha steel

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖ) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ను పునరుద్ధరించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ జె అయోధ్యరామ్‌ డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే దీక్షలు సోమవారం నాటికి 1026వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌-2 విభాగ కార్మికులు కూర్చున్నారు. ఆదివారం మృతి చెందిన స్టీల్‌ప్లాంట్‌ మాజీ డైరెక్టర్‌ అయ్యప్పనాయుడుకు ముందుగా నివాళులర్పించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో డైరెక్టర్‌ హోదాలో అయ్యప్పనాయుడు నిబద్ధతతో పనిచేశారని గుర్తుచేసుకున్నారు. అనంతరం దీక్షలనుద్దేశించి అయోధ్యరామ్‌ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం గడిచిన సంవత్సర కాలంగా బ్లాస్ట్‌ఫర్నేస్‌-3 ద్వారా ఉత్పత్తి చేయకుండా లాభాలార్జిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్మికులను అసంతృప్తికి గురిచేస్తున్నారని, ఉత్పత్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాలను ఈ పార్లమెంట్‌ సమావేశాలలో విశాఖ ఎంపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ప్లాంట్‌ యాజమాన్యం, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని స్టీల్‌ప్లాంట్‌లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️