బరి తెగించిన విద్వేషం

Apr 23,2024 05:55 #edit page, #PM Modi

ఏ ఎన్నికల్లో గెలవాలన్నా బిజెపి ఎంచుకునే అస్త్రం మతోన్మాదాన్ని రాజేసే విద్వేష కుట్రలని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే దారిని రహదారిలా చేసుకున్నారని తాజాగా రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలలో ప్రధాని నరేంద్ర మోడీ లంకించుకున్న వివాదాస్పద వ్యాఖ్యలే నిదర్శనం. ఆదివారం రాజస్థాన్‌లో పలు బహిరంగసభల్లో ప్రసంగించిన మోడీ, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే ప్రజలు కష్టపడి సంపాదించుకున్న స్థిర, చరాస్తులను ముస్లింలకు పంచుతారని విద్వేషపూరితంగా మాట్లాడారు. అంతేనా, వ్యక్తులు సంపాదించుకున్న బంగారం, వెండి, భూములు, నగదు, మొత్తం సంపదను ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారికి, చొరబాటుదారులపరం చేస్తారని, అందుకు మీరు సమ్మతిస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీది అర్బన్‌ నక్సల్‌ మనస్తత్వమని, మహిళలు పవిత్రంగా భావించే మంగళసూత్రాలను సైతం లాక్కొని పంపిణీ చేస్తారని ఉన్మాదపూరిత వ్యాఖ్యలు చేశారు. మోడీ వేసిన వీరంగం వెనుక పరమార్ధం అంతుబట్టకపోవడానికి పెద్దగా పరిశోధించడానికేమీ లేదు. కేంద్రంలో పదేళ్ల పాలన వెలగబెట్టిన బిజెపి ప్రభుత్వానికి, ప్రజలకు ఏం మేలు చేసిందో చెప్పుకోడానికి ఏమీ లేదు. అందుకే ఇటువంటి కుట్రలు, పన్నాగాలు.
పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి, నిరుద్యోగం, పెట్రోలు, డీజిల్‌ ఛార్జీల పెంపు, నిత్యావసరాల ధరల పెరుగుదల, కార్పొరేట్ల దోపిడీకి అనుకూల విధానాలు, రైతు వ్యతిరేక చర్యలు…చెప్పుకుంటూ పోతే మోడీ ప్రభుత్వ వైఫల్యాల చిట్టా కొండవీటి చాంతాడంత ఉంటుంది. వీటికి తోడు మతపరంగా ప్రజలను నిట్టనిలువునా చీల్చే మెజార్టీ మతోన్మాదం, రాజ్యాంగం ధ్వంసం, ప్రజాస్వామ్య హక్కుల హననం, నిరంకుశత్వం ఉండనే ఉన్నాయి. మోడీ ప్రభుత్వ దుర్మార్గాలు ఎన్నికల్లో బిజెపి, ఎన్‌డిఎ పార్టీల కంటిపై కునుకు పట్టనీయట్లేదు. ప్రజా వ్యతిరేకత నుంచి బయట పడటానికి, జనం దృష్టిని వాస్తవాల నుంచి వేరేవైపు మళ్లించడానికి బిజెపి అమ్ముల పొదిలో ఎప్పుడూ హిందూమతోన్మాదం ఆయుధం సిద్ధంగా ఉంటుంది. అదే రాజస్థాన్‌లో ప్రధాని నోట జాలువారిన విద్రోహ వ్యాఖ్యానాల పూర్వరంగం. దేశం వికసిత భారత్‌ వైపు దూసుకెళుతోంది, ఎన్నికల్లో 400 సీట్లు సాధించి మూడోసారి హ్యాట్రిక్‌ కొడతామని ఊరేగుతున్న నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, బిజెపి నేతలు ఒక్కసారిగా అభివృద్ధి గురించి వదిలేసి హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలు పెంచే మాటలెందుకు మాట్లాడుతున్నట్టు?
దేశంలో శుక్రవారం 102 స్థానాల్లో తొలిదశ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్‌ జరిగిన ఆయా ప్రదేశాల్లో బిజెపి పట్ల ఓటర్లు చూపించిన తీవ్ర స్థాయి విముఖత బిజెపి నేతలకు అర్థమైంది. మిగిలిన ఆరు దశల్లో జరగనున్న ఎన్నికల్లో అటువంటి పరిస్థితులే ఎదురయ్యేలా ఉందని బెంబేలెత్తిన బిజెపి గణాలు ప్రజలను తప్పుదారి పట్టించి, మత ఉద్రేకాలు పెంచి, ఒక మతం వారి ఓట్లను తమ వైపు సమీకరింపజేసుకొని, రాజకీయంగా లబ్ధి పొందేందుకు మోడీ, అమిత్‌షా, నడ్డా, యోగి, వంటి వారు హిందూ మతోన్మాద జెండాను భుజానికెత్తుకున్నారని జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలుస్తుంది. గతంలోనూ అయోధ్య, కార్గిల్‌, 370 ఆర్టికల్‌, పుల్వామా వంటి వాటిని ప్రయోగించారు. ఇప్పుడూ రామాలయ నిర్మాణం, యుసిసి, సిఎఎ, హిందీ, సంస్కృత భాషల బలవంతపు చొప్పింపు, పాలనలో, విద్యలో, చివరికి దూరదర్శన్‌ చిహ్నాలకు కాషాయరంగు, గోవుల పరిరక్షణ పేరిట దళితులు, ముస్లింలపై పాశవిక దాడులు, గణేష్‌ ఉత్సవాలు, శ్రీరామనవమి, హనుమత్‌ జయంతి శోభాయాత్రలు, ఇవన్నీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఓట్లు తెచ్చిపెట్టే సాధనాలు. మోడీ స్వయంగా రంగంలోకి దిగి చేస్తున్నదిదే. ఏ ఒక్కరినీ రెచ్చగొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయడం నేరమని సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు గడ్డి పెట్టింది. శిక్షలూ వేసింది. ఎన్నికలవేళ అటువంటివి కూడదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి చెబుతోంది. బహిరంగసభల్లో మతాలను రెచ్చగొట్టే విధంగా విద్వేష ప్రసంగాలు చేస్తున్న ప్రధాని మోడీపై సుప్రీం కోర్టు సూమోటోగా పరిగణించి కోర్టు ధిక్కారం కింద కఠిన చర్యలు చేపట్టాలి. ఇ.సి. సైతం చర్యలు తీసుకోవాలి. అప్పుడే న్యాయం, చట్టం, వ్యవస్థలు స్వేచ్ఛగా తమ పని తాము చేసుకుపోతాయన్న విశ్వాసం కలిగిస్తాయి. ఎంతటి వారైనా కోర్టులు, చట్టం, వ్యవస్థల ముందు సమానమేనన్న రాజ్యాంగం నిర్దేశం ఆచరణలో నిలబడుతుంది.

➡️