మరి కొంత సమయం ఇవ్వండి : బిల్కిస్‌ బానో కేసులో నిందితులు

Jan 18,2024 11:26 #Bilkis Bano Case, #Supreme Court

న్యూఢిల్లీ :   బిల్కిస్‌బానో కేసు నిందితుల్లో ఒకరైన గోవింద్‌బాయ్  నాయ్  జైలులో లొంగిపోయేందుకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. తన అనారోగ్యం, కుటుంబ బాధ్యతల నేపథ్యంలో లొంగిపోయేందుకు మరో నాలుగు వారాల గడువుల కావాలని గురువారం పిటిషన్‌లో కోరారు.  మంచాన ఉన్న తన తండ్రి (88 ఏళ్లు), తల్లి (75) తనపై ఆధారపడి ఉన్నారని బార్బర్‌గా పనిచేస్తున్న నారు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  తన ఇద్దరు చిన్నారుల ఆర్థిక అవసరాలను తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. తాను ఆస్తమాతో బాధపడుతున్నానని, శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వుందని తెలిపారు. జైలు నుండి విడుదలైన తర్వాత తాను చట్టాన్ని ఉల్లంఘించలేదని, విడుదల ఆర్డర్‌లోని నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. మరో   ఇద్దరు నిందితులు కూడా పలు కారణాలతో లొంగిపోయేందుకు సమయం  ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. కాగా, ఈ  పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.

2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారాని పాల్పడటంతో పాటు ఆమె మూడేళ్ల కుమార్తె సహా ఏడుగురు కుటుంబసభ్యులను హత్య చేసిన 11 మంది నిందితులను గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌పై విడుదల చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ జనవరి 22లోగా నిందితులు జైలులో లొంగిపోవాలని ఈ నెల 8న ఆదేశించింది.

➡️