పోలీసుల అదుపులో బైకు దొంగలు

Mar 27,2024 23:33 ##Police #Crimenews

ప్రజాశక్తి – భట్టిప్రోలు
స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని రోజుల క్రితం దొంగిలించబడిన మోటార్ సైకిళ్లను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు రేపల్లె డిఎస్పి మురళీకృష్ణ, వేమూరు సిఐ పి రామకృష్ణ, భట్టిప్రోలు ఎస్‌ఐ కె శ్రీనివాసరావు తమ సిబ్బందితో భట్టిప్రోలు పరిసర ప్రాంతాల్లో దొంగిలించబడిన 8బైకులను, బైకుల చోరీకి వినియోగించిన ఇన్నోవా కారును అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి మురళీకృష్ణ వివరాలను వెళ్లడించారు. ఐలవరంలో మణికంఠ సప్లయర్స్ వద్ద ఈనెల 20న రోడ్డు పక్కన పెట్టి ఉన్న మోటార్ బైకును దొంగిలించగా బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలానికి చెందిన మీరా జ్యోతి ప్రసన్నకుమార్ నాయక్ అనే 23ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. బట్టిప్రోలు మండలంలో నాలుగు మోటర్ సైకిల్లు, కర్లపాలెం స్టేషన్ పరిధిలో ఒక మోటార్ సైకిల్, టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మోటార్ సైకిల్ దొంగిలించినట్లు ఒప్పుకున్నాడని చెప్పారు. వీటిని దొంగలించటానికి ఇన్నోవా కారును ఉపయోగించుకున్నట్లు తెలిపారు. ఆ కారులో వెళుతూ రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న బైకులను మారు తాళంతో తీయడం లేదా దానికి సంబంధించిన వైర్లను తొలగించి బైకులను దొంగిలిస్తూ ఉండేవారని పేర్కొన్నారు. ఇతనితోపాటు రమావత్ దుర్గాప్రసాద్ నాయక్, బాణావత్ తులసి బాబు నాయక్, బాణావథ్ హనుమాన్ నాయక్ ఉన్నట్లుగా తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి విచారించి వారి నుండి రూ.3.80లక్షల విలువైన బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భట్టిప్రోలు స్టేషన్ పరిధిలో జనవరి 27న మరో ముద్దాయిలు గ్రామ శివారులో పసుపులేటి రాజేష్ పొలం ఎదురుగా ఎన్‌హెచ్ 216 రోడ్డులో రాత్రి సమయంలో రోడ్డు పక్కన పెట్టి పొలంలోకి వెళ్లిన మోటార్ సైకిల్‌ను దొంగిలించిన కేసులో ముద్దాయిలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు విచారించగా కర్లపాలెం మండలం పెద్ద పులుగు వారిపాలెంకు చెందిన శవనం శ్రీనివాసరెడ్డి, మురళీకృష్ణారెడ్డి, భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామానికి చెందిన దాసరి భరత్ అదుపులోకి తీసుకొని విచారించగా రూ.1.40లక్షల విలువైన రెండు మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో సుగాలి యువకులు ఈ ప్రాంతంలో పంట పొలాలకు వినియోగించే పరదాలు, అద్దె ప్రాతిపదికన అందించేందుకు వచ్చిన సమయంలో ఈ ప్రాంతాన్ని గమనించి బైకులు దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు. బైకులను కూడా కోర్టుకు అందజేసినట్లు తెలిపారు. చట్టంతో సంఘర్షణ పడిన మరొక బాలుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని అభినందించారు.

➡️