బీజేపీకి భారతీ గ్రూపు భారీ విరాళాలు

– ఈబీల ద్వారా రూ.150 కోట్లు
– ‘టెలికాం’లో భారతీకి అనుకూలంగా
మోడీ సర్కారు నిర్ణయాలు
– హడావిడిగా కొత్త చట్టం
– విస్మయం కలిగిస్తున్న డొనేషన్లు

దేశంలో ఎలక్టోరల్‌ బాండ్ల(ఈబీ) విరాళాల వెనకున్న గుట్టు క్రమక్రమంగా రట్టవుతున్నది. నీకిది, నాకది (క్విడ్‌ ప్రో కో) ఉద్దేశంతోనే ఈ ఈబీ విరాళాలు జరిగినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా, కేంద్రంలోని అధికార బీజేపీకి ఈ విధంగానే విరాళాలు వచ్చి చేరినట్టు అర్థమవుతున్నది. బెదిరింపుల ద్వారానో, అనుకూలంగా వ్యవహరించటం ద్వారానో కాషాయపార్టీ పెద్ద ఎత్తున ఈబీల ద్వారా నిధులను సమీకిరించుకోగలిగింది. భారతీ గ్రూపు బీజేపీకి రూ.150 కోట్ల విరాళాన్ని అందించటం, టెలికాం విషయంలో ఆ సంస్థకు లాభం చేకూరేలా మోడీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటం ఒకదాని తర్వాత ఒకటి జరగటం చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ పాలనలో 2012లో ప్రభుత్వం కేటాయించిన 122 టెలికాం లైసెన్సులను సుప్రీంకోర్టు రద్దు చేసి.. దానికి బదులుగా టెలికాం స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని ఆదేశించింది. ఆ సమయంలో మీడియా నివేదికలు ఈ తీర్పును ”అవినీతిపై నిర్ణయాత్మక దెబ్బ”గా అభివర్ణించాయి.
అయితే స్పెక్ట్రమ్‌ను తప్పనిసరి వేలం వేయాలని సుప్రీంకోర్టు 2012లో ఆదేశించినప్పటికీ, మోడీ ప్రభుత్వం కాంగ్రెస్‌ అనుసరించిన అదే మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నది. డిసెంబరు, 2023లో, పోటీ వేలం అవసరం లేకుండా శాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ను అడ్మినిస్ట్రేటివ్‌ ఆర్డర్‌ ద్వారా కేటాయించటానికి అనుమతించే కొత్త టెలికాం చట్టాన్ని పార్లమెంటు ద్వారా హడావిడిగా తీసుకొచ్చింది. వేలం నుంచి వైదొలగటానికి న్యాయపరమైన ఆమోదం కోరుతూ సుప్రీంకోర్టులో రిఫరెన్స్‌ కూడా దాఖలు చేసింది. వన్‌వెబ్‌ ఇండియా స్పెక్ట్రమ్‌ కోసం దరఖాస్తు చేయటానికి అవసరమైన లైసెన్స్‌, స్పేస్‌ అథరైజేషన్‌ రెండింటినీ పొందింది.
వన్‌వెబ్‌ అనేది అంతర్జాతీయ శాటిలైట్‌ సంస్థ యూటెల్‌శాట్‌ భారతీయ అనుబంధ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉన్నది. యూటెల్‌శాట్‌ అతిపెద్ద వాటాదారు టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌ ఎయిర్‌టెల్‌ మాతృ సంస్థ భారతి ఎంటర్‌ప్రైజెస్‌. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్నది. టెలికాం, డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, స్పేస్‌ కమ్యూనికేషన్స్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, రియల్‌ ఎస్టేట్‌ వంటి విభిన్న శ్రేణి పరిశ్రమలలో దీనికి వాటా ఉన్నది. ఆగస్ట్‌ 24, 2021న వన్‌వెబ్‌ అనేది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ విభాగం నుంచి శాటిలైట్‌ ద్వారా గ్లోబల్‌ మొబైల్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్స్‌ (జీఎంపీసీఎస్‌)ను పొందిన మొదటి కంపెనీగా అవతరించింది. నవంబర్‌ 21, 2023న శాటిలైట్‌ సామర్థ్యాన్ని ఉపయోగించటం కోసం ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌(ఇన్‌-స్పేస్‌) ద్వారా దీనికి అథారిటీ మంజూరైంది. ఇప్పటివరకు ఈ అధికారాన్ని పొందిన ఏకైక సంస్థ ఇదే కావటం గమనార్హం.
పలు సందేహాలు, ప్రశ్నలు
శాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం ఇంకా కేటాయించనప్పటికీ, ఇటీవల విడుదల చేసిన ఎలక్టోరల్‌ బాండ్ల డేటా మాత్రం పలు సందేహాలను, ప్రశ్నలను కలిగిస్తున్నది. శాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ వేలం అవసరం లేకుండా ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ముందు, తర్వాత కొనుగోలు చేసిన రెండు సెట్ల బాండ్ల ద్వారా భారతి గ్రూప్‌ బీజేపీకి రూ. 150 కోట్లను విరాళంగా అందించింది. అయితే, ఒక నెల తర్వాత మోడీ సర్కారు స్పెక్ట్రమ్‌ పొందటం కోసం వన్‌వెబ్‌కు స్పేస్‌ ఆథరైజేషన్‌ను మంజూరు చేయటం గమనార్హం.
2023 టెలికాం బిల్లు స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశం మోడీ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావమూ చూపలేదు. డిసెంబర్‌ 18, 2023న లోక్‌సభలో కొత్త టెలికమ్యూనికేషన్స్‌ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఇంటర్నెట్‌ సస్పెన్షన్‌, నిఘా కోసం కఠినమైన అధికారాలను కలిగి ఉండటమే కాకుండా, స్పెక్ట్రమ్‌ నిర్వహణకు భారత దేశ విధానాన్ని మారుస్తుంది. వేలం ద్వారా కాకుండా ”నిర్దిష్ట ఉపగ్రహ ఆధారిత సేవల” కోసం స్పెక్ట్రమ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కేటాయింపులకు మార్గం సుగమం చేస్తుంది. 143 మంది ప్రతిపక్ష ఎంపీలను ఉభయ సభల నుంచి సస్పెండ్‌ చేయటంతో బిల్లు డిసెంబర్‌ 20న లోక్‌సభలో వాయిస్‌ ఓటింగ్‌ ద్వారా ఆమోదించబడింది. ఒకరోజు తర్వాత రాజ్యసభ బిల్లును ఆమోదించింది. క్రిస్మస్‌ వేళ భారత రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేసి చట్టం చేశారు.

150 కోట్ల విలువైన బాండ్లు
ఈ చట్టం భారతీ గ్రూపునకు అనుకూలంగానే ఉన్నది. చట్టాన్ని అమలు చేస్తున్న క్రమంలో ఆసక్తికరమైన మరో ఘటన చోటు చేసుకున్నది. నవంబర్‌ 9న, భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌ రూ. 100 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసి, మొత్తాన్ని బీజేపీకి విరాళంగా ఇచ్చింది. నాలుగు రోజుల తర్వాత నవంబర్‌ 13న బీజేపీ అన్ని బాండ్లనూ ఎన్‌క్యాష్‌ చేసుకున్నది. ఎనిమిది రోజుల తర్వాత (నవంబర్‌ 21న) వన్‌వెబ్‌.. భారత్‌ నుంచి శాటిలైట్‌ ఆథరైజేషన్‌ను పొందిన మొదటి కంపెనీగా అవతరించింది. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే, భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌ మరో రూ. 50 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్‌లను కొనుగోలు చేసింది. వీటిని బీజేపీ జనవరి 12న ఎన్‌క్యాష్‌ చేసుకుంది. యుటెల్‌శాట్‌ వన్‌వెబ్‌ కోసం.. ప్రభుత్వం నుంచి లైసెన్స్‌, స్పేస్‌ ఆథరైజేషన్‌ రెండింటినీ పొందటం శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సెక్టార్‌లో చర్చనీయాంశంగా మారింది.

బాండ్లు, ట్రస్ట్‌లతో ‘భారతి గ్రూపు’
భారతి ఎంటర్‌ప్రైజెస్‌ భారతీయ రాజకీయ పార్టీలకు అధికారికంగా నిధులు సమకూర్చటానికి రెండు మార్గాలను ఉపయోగించింది. అవి ఎలక్టోరల్‌ బాండ్‌లు, ఎలక్టోరల్‌ ట్రస్ట్‌లు. ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ అనేది లాభాపేక్ష లేని సంస్థ. దీని ద్వారా కార్పొరేషన్‌లు, వ్యక్తులు తమ విరాళాలను రాజకీయ పార్టీలకు పంపవచ్చు. అయితే పన్ను మినహాయింపులు ఇందులో ఉంటాయి. ”ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌” అని పిలువబడే దేశంలో అతిపెద్ద ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ 2013లో భారతి గ్రూప్‌ ద్వారా ప్రారంభించబడింది. ఇది అతిపెద్ద దాతలలో ఒకటిగా కొనసాగుతున్నది. ప్రుడెంట్‌ తన విరాళాలలో ఎక్కువ భాగాన్ని బీజేపీకి నిరంతరం అందజేస్తున్నది.
2019లో బీజేపీ ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రుడెంట్‌ దాదాపు రూ. 218 కోట్లను పార్టీకి విరాళంగా అందించింది. ఆ ఏడాది ప్రుడెంట్‌కు భారతి రూ.27.25 కోట్లు విరాళంగా అందించింది. అదే ఏడాది ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా భారతి.. బీజేపీకి రూ.51.4 కోట్లు ఇచ్చింది. ఆ తర్వాతి సంవత్సరంలో భారతి.. ప్రూడెంట్‌కు రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చింది. కానీ ఎలాంటి ఎలక్టోరల్‌ బాండ్‌లనూ కొనుగోలు చేయలేదు. అలాగే, భారతి గ్రూపు 2021, 2022 ఏడాదుల్లో బాండ్ల ద్వారా బీజేపీకి రూ. 35 కోట్లు అందించింది. 2023లో ఈ సంఖ్య అకస్మాత్తుగా రూ. 100 కోట్లకు చేరుకున్నది. ఇవన్నీ యూటెల్‌సాట్‌ వన్‌వెబ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఒప్పందాన్ని పొందే రోజుల ముందు కొనుగోలు చేయబడటం గమనార్హం.
2019ా2024 మధ్య, గ్రూప్‌ కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ లిమిటెడ్‌, భారతీ టెలిమీడియా లిమిటెడ్‌ రూ. 247 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. రూ. 236.4 కోట్లు(95 శాతానికి పైగా) విరాళం ఇచ్చాయి. ఎన్నికల సంఘం ఎలక్టోరల్‌ బాండ్ల డేటా విశ్లేషణ దీనిని స్పష్టం చేస్తున్నది. అయితే, ఈ విధమైన విరాళాల విషయంలో లోతైన దర్యాప్తు అవసరమున్నదని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు, మేధావులు సూచిస్తున్నారు.

➡️