కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న

  • బీహార్‌ జన నాయక్‌కు ప్రకటించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ : దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డును బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ‘సోషలిస్టు’ నేత కర్పూరి ఠాకూర్‌కు మరణానంతరం ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ”శ్రీ ఠాకూర్‌ను గౌరవించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి చిహ్నంగా ఆయన పాత్రను ప్రభుత్వం గుర్తిస్తోంది. సమాజంలో అణగారిన వర్గాల్లో స్ఫూర్తిదాయకమైన నేతగా ఆయన విశేషమైన ప్రభావాన్ని చూపారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతీక, సమానత్వం, సోదర భావం, అందరికీ న్యాయం కోసం పోరాడిన నేత” అని ఆ ప్రకటన పేర్కొంది. ఠాకూర్‌ మరణించిన 35 ఏళ్ళ తర్వాత, బుధవారం ఆయన శత జయంతి నేపథ్యంలో ఈ అవార్డు ప్రకటన వెలువడింది. 1988 ఫిబ్రవరి 17న ఆయన మరణించారు. బీహార్‌లోని సమస్తిపూర్‌లో నాయీబ్రాహ్మణ కమ్యూనిటీలో 1924లో కర్పూరి ఠాకూర్‌ జన్మించారు. సన్నకారు రైతు కుమారునిగా మొదలై ప్రముఖ రాజకీయ నేతగా ఎదిగే వరకు ఆయన జీవితమంతా వెనుకబడిన కులాల సంక్షేమం, అభివృద్దికే అంకితమైంది, ఆయన రాజకీయ జీవితంలో అనేక మైలురాళ్ళు వున్నాయి. మొట్టమొదటి కాంగ్రేస్సేతర సోషలిస్టు ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. మొత్తంగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. 1970 మొదటిసారి డిసెంబరు 1970 నుండి 1971 జూన్‌ వరకు స్వల్పకాలమే పనిచేసినా తిరిగి 1977 డిసెంబరు నుండి 1979 ఏప్రిల్‌ వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రి గా వున్న సమయంలో రాష్ట్రంలో మద్యంపై పూర్తి నిషేధం అమలు చేశారు. సామాజిక సంస్కరణల పట్ల ఆయనకు గల నిబద్ధతను ఈ చర్య తెలియచేస్తుంది. అభివృద్దిలో వెనుకబడిన బీహార్‌లో అనేక పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వెనుకబడిన తరగతుల ‘జననాయక్‌ ”జననాయక్‌’గా అందరికీ చిరపరిచితులైన ఆయన వెనుకబడిన వర్గాల కోసం పోరాడారు. వెనుకబడిన కులాలను మొదటగా సమీకరించిన ఆయన 1978 నవంబరులో బీహార్‌లో ప్రభుత్వ సర్వీసుల్లో వారికి 26శాతం రిజర్వేషన్‌ కల్పించేందు కు మార్గం సుగమం చేశారు. ఆయన చేసిన కృషి అనంతర కాలంలో అంటే 1990ల్లో ఇతర వెనుబడిన తరగతులు (ఒబిసి)కు రిజర్వేషన్లు ఇచ్చేందుకు మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుకు దోహదపడ్డాయి.క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన జైలు శిక్ష అనుభవించారు. 1952 ఎన్నికల్లో తొలిసారిగా విజయం సాధించిన తర్వాత ఆయన ఏ ఎన్నికల్లోనూ ఎన్నడూ ఓడిపోలేదు. అత్యంత ప్రజాదరణ పొందిన ఆయన నిరాడంబర జీవితం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాలే ఇందుకు కారణం. రాష్ట్రానికి చెందిన మొదటి కాంగ్రేస్సేతర ముఖ్యమంత్రికి ఈ అవార్డును అందచేయడంతో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీ దీర్ఘకాల డిమాండ్‌ నెరవేరినట్లైంది. భారతదేశంలో సామాజిక న్యాయానికి, సాధికారతకు పర్యాయపదంగా భావించే ఠాకూర్‌ ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే 1977లో ముంగేరీ లాల్‌ కమిషన్‌ నివేదిక వచ్చింది. వెనుకబడిన వర్గాలను అత్యంత వెనుకబడిన వర్గాలుగా, వెనుకబడిన వర్గాలుగా తిరిగి వర్గీకరించాలని ఈ కమిషన్‌ నివేదిక సిఫార్సు చేసింది. 1978లొనే ఈ నివేదికను అమలు చేశారు. బీహార్‌లో వెనుకబడిన వర్గాల రాజకీయాలు పరిఢవిల్లడానికి థాకూర్‌ విధానాలు, ఆయన తీసుకున్న చొరవలు చూపించిన ప్రభావమే ప్రధాన కారణం.ప్రధాని హర్షంసామాజిక న్యాయానికి కరదీపిక, గ్రేట్‌ జన నాయక్‌ కర్పూరీ ఠాకూర్‌ జీకి భారత రత్న ప్రదానం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించడం పట్ల చాలా ఆనందంగా వున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్‌్‌లో పోస్టు పెట్టారు. అదికూడా ఆయన శత జయంతి సమయంలో కావడం ఇంకా సంతోషంగా వుందన్నారు. సమానత్వం, సాధికారతకు నిలువెత్తు ప్రతీకగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషికి ఈ ప్రతిష్టాకరమైన అవార్డు ఒక నిదర్శనమని వ్యాఖ్యానించారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి పట్ల ఆయనకు గల అచంచలమైన నిబద్ధత, దార్శనికతతో కూడిన ఆయన నాయకత్వం భారతదేశ సామాజిక, రాజకీయ కూర్పుపై చెరగని ముద్ర వేశాయని మోడీ ప్రశంసించారు. ఈ అవార్డు, కలకాలం గుర్తుండిపోయేలా ఆయన చేసిన సేవలను గౌరవించుకోవడమే కాకుండా మరింత న్యాయమైన, సమానమైన సమాజం సృష్టించాలన్న తన దీక్షను కొనసాగించడానికి స్ఫూర్తిని కూడా కలిగిస్తోందని మోడీ పేర్కొన్నారు.

➡️