‘ భలే దొంగ ‘ – బతిమాలుకున్న పోలీసులు…!

Dec 16,2023 12:34 #police, #thief

కుత్బుల్లాపూర్‌ : తాళం వేసిన ఇంట్లోకి దొంగ వెళ్లాడు… బీరువా తెరిచి డబ్బంతా తీసి ఎంచక్కా మంచంపై కూర్చొని తీరిగ్గా లెక్క పెట్టుకుంటున్నాడు… ఇంతలో ఆ ఇంటిలో బాలిక దొంగను చూసి అరిచింది.. ఇంకేముంది దొంగ పరుగులంకించుకున్నాడు.. చెరువులో చిన్న దిమ్మపై తిష్ఠ వేశాడు.. ఆ దొంగను బయటకు రప్పించేందుకు పోలీసులు బతిమాలుకున్నారు..నానాతంటాలు పడ్డారు.!

పూర్తి వివరాల్లోకెళితే …

సూరారం ఠాణా పరిధిలోని శివాలయనగర్‌లో నాగలక్ష్మి దంపతులు ఉంటున్నారు. శుక్రవారం వీరు ఇంటికి తాళం వేసి ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. సాయంత్రం 4.30 ప్రాంతంలో వారి రెండో కుమార్తె సాయిజ్యోతి ఇంటికి వచ్చేసరికి గేటుకు తాళం వేసి ఉండగానే ఇంటి తలుపులు తెరచి ఉన్నాయి. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా పడక గదిలో బీరువాలోని వస్తువులు పడేసి ఉండటమే కాకుండా ఓ వ్యక్తి మంచంపై కూర్చుని డబ్బులు లెక్కిస్తూ కన్పించాడు. వెంటనే ఆ బాలిక భయపడి దొంగ.. దొంగ.. అంటు కేకలు వేసుకుంటూ పరుగు తీసింది. ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుండగా స్థానికులు వెంబడించారు. దీంతో దొంగ పారిపోయి చెరువులోకి దిగాడు. అక్కడే మధ్యలో ఓ బండరాయిపై కూర్చున్నాడు. సమాచారం అందుకున సూరారం పోలీసులు చెరువు వద్దకు చేరుకుని అతడిని బయటికి రమ్మని ఎంత నచ్చచెప్పినా ఆ దొంగ వినిపించుకోలేదు. సిఎం రేవంత్‌రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్‌, టీవీ ఛానల్స్‌ వారు ఇక్కడికి వస్తేగానీ చెరువులో నుంచి బయటికి వచ్చేదిలేదంటూ … ఆ దొంగ తెగేసి చెప్పడంతో పోలీసులు తలపట్టుకున్నారు. ఎస్సై వెంకటేశ్‌ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆ దొంగ చెరువులో నుంచి బయటకు రమ్మని ఎంతగా బతిమాలినా రాలేదు. రాత్రి 8.30 గంటలకు అడ్మిన్‌ ఎస్సై నారాయణసింగ్‌ కూడా అక్కడికి చేరుకుని మైకులో హెచ్చరిస్తూ బయటికి రప్పించేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. రాత్రి 12.30 గంటల వరకు పోలీసులు అక్కడే పడిగాపులు కాశారు. మరోవైపు తమ కష్టార్జితం రూ.20వేల వరకూ దొంగ దోచుకుపోయాడని బాధితుడు వాపోయాడు. కాస్త విశ్రాంతి తీసుకుంటాం అంటూ… పోలీసులు సైడ్ అవ్వడంతో… దొంగ నిదానంగా చెరువులో దిగి ఈదుకుంటూ బయటికి వచ్చాడు. ఇంకేముంది.. ఆ దొంగను పోలీసులు పట్టుకున్నారు. దొంగ దగ్గర ఉన్న నగదును, బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు.

పోలీసులు – దొంగ మధ్య మాటలు…!

పోలీసులు : ఏయ్.. మర్యాదగా చెరువులో నుంచి బయటికి వస్తావా ? లేదా ?

దొంగ : నేను రాను సారు.. బయటికి వస్తే మీరు కొడతారు..

పోలీసులు : నిన్నేం కొట్టం రా.. బయటికి..రా

దొంగ : సీఎం, మాజీ సీఎం, టీవీ ఛానల్స్‌ వారు చెరువు దగ్గరికి వస్తేనే బయటికి వస్తా..

పోలీసులు : నీవు బయటికి వచ్చేలోగా వాళ్లను రప్పిస్తాం.. రా ఇక. నీకు పుణ్యముంటుంది.

దొంగ : సార్‌.. మీరు ఎంత చెప్పినా వారంతా వచ్చే దాకా నేను చెరువులోనే ఉంటా.

పోలీసులు : రాత్రి 8 అవుతుందిరా.. దోమలు కుడతాయి.. పాములు కరుస్తాయి. బయటికి రా..నిన్నేమీ కొట్టం.

దొంగ : నేను రానంటే రాను…. అని ఆ వ్యక్తి చెరువులోని బండపైనే భీష్మించి కూర్చుండిపోయాడు.

➡️