వేసవి వ్యాధులపై అప్రమత్తం

Apr 4,2024 22:05

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: వేసవిలో ప్రబలే అనారోగ్య సమస్యలకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు రావు సూచించారు. ఎంఆర్‌ నగరంలో నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య తనిఖీల వివరాలు, వైద్య పరీక్షలను పరిశీలించారు. అక్కడ ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు లభ్యతను పరిశీలించారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం నీటి శాతాన్ని కోల్పోతుందని, తద్వారా కూడా జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో గానీ, ఆరోగ్య కేంద్రాల్లో గానీ జ్వరాలు గుర్తించేటప్పుడు మలేరియా, డెంగీ సంబంధిత జ్వరమా లేదా డీహైడ్రేషన్‌, వడదెబ్బ, ఇతర కారణాలా? అని వెంటనే నిర్ధారణ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండతీవ్రత వల్ల శరీరం నీటిశాతాన్ని కోల్పోతుందని, అశ్రద్ధ చేస్తే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఎండతీవ్రత సమయంలో బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులు చేయరాదన్నారు. ఎల్లప్పుడూ అందుబాటులో తాగునీరు ఉంచుకోవాలన్నారు. కోల్పోతున్న నీటి శాతాన్ని ఎప్పటికప్పుడు నీరు, నిమ్మ రసం, మజ్జిగ, ఒఆర్‌ఎస్‌, కొబ్బరి నీళ్లు, తదితర ద్రావణాలు తీసుకోవడం ద్వారా భర్తీ చేయాలన్నారు. ఎక్కువగా శాఖాహారం తీసుకోవాలని సూచించారు. శరీరాన్ని డీహైడ్రేట్‌ చేసే టీ, కాఫీ, కార్బోనేటెడ్‌ కూల్‌ డ్రింక్స్‌, నూనె వంటలు, ఎక్కువ కారం, ప్రోటీన్‌, కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు మానుకోవాలన్నారు. వడదెబ్బకు గురయ్యే సమయంలో తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం, మత్తు నిద్ర, పాక్షికంగా అపస్మారక స్థితి మొదలగు లక్షణాలు ఉంటాయని చెప్పారు. వెంటనే దగ్గర్లో చల్లని ప్రదేశానికి తీసుకువెళ్ళి, తడి గుడ్డతో శరీరాన్ని రుద్దుతూ ఉండాలని తెలిపారు. స్పృహలో ఉన్నప్పుడు మాత్రమే నీరు, ఇతర ద్రావణాలు తాగించాలని సూచించారు. సాధారణ స్థితికి రాకుంటే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తలు పాటించాలన్నారు. వేసవి జాగ్రత్తల పట్ల సిబ్బంది ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ వి.అనూష, ఆరోగ్య కార్యాలయ డెమో వై.యోగీశ్వరరెడ్డి, సూపర్‌వైజర్స్‌ సత్తిబాబు, శంకరరావు, వైద్య సిబ్బంది నందిని, పోలమ్మ, బంగారునాయుడు, 104 సిబ్బంది కిరణ్‌, కోటీశ్వరరావు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️