‘బేవరేజెస్‌’ ఎమ్‌డిని బదిలీ చేయాలి

  •  కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డి వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని టిడిపి కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు సోమవారం లేఖ రాశారు. రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి చేస్తున్న డిస్టిలరీలు ఎక్కువ శాతం అధికార పార్టీ నాయకుల ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటర్లకు లిక్కర్‌ పంపిణీ చేసేందుకు వైసిపి నాయకులు ఇప్పటికే పెద్దయెత్తున స్టాక్‌ పెట్టుకున్నారని అన్నారు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌, ఎక్సైజ్‌శాఖ, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోందని పేర్కొన్నారు. కొండెపి, పాతపట్నం నియోజకవర్గాల్లో ప్రభుత్వ అధికారులు వైసిపి కార్యకర్తల్లా మారారని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎంఎ షరీఫ్‌.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి విడివిడిగా రెండు లేఖలు రాశారు.

రైతాంగాన్ని ఆదుకోవడంలో జగన్‌ విఫలం : కనకమేడల
సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణను విస్మరించి రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షానికి జగన్‌ ప్రభుత్వం కారణమైందని టిడిపి ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌ విమర్శించారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని టిడిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విమర్శించారు. మేదరమెట్లలో జగన్‌ నిర్వహించింది సిద్ధం కాదని, మయసభ అని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. లోకేష్‌ నిర్వహిస్తున్న శంఖారావం సభలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరుతూ డిజిపికి వర్ల లేఖ రాశారు.

చిలకలూరిపేట సభకు నిర్వహణ కమిటీలు
టిడిపి-జనసేన-బిజెపి ఉమ్మడిగా ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించనున్న సభకు ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేస్తూ అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. అచ్చెన్నాయుడుతో పాటు, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, నాయకులు అనగాని సత్యప్రసాద్‌, జివి ఆంజనేయులు, గొట్టిపాటి రవికుమార్‌, నిమ్మల రామానాయుడు, కిలారు రాజేష్‌, జనసేన నుంచి గద్దె వెంకటేశ్వరరావు, రియాజ్‌, చిల్లపల్లి శ్రీనివాస్‌, బిజెపి నుంచి పాతూరి నాగభూషణం, దయాకర్‌ రెడ్డితో కలిసి సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. వీటితో పాటు వేదిక నిర్వహణ కమిటీ, సభా ప్రాంగణం కమిటీ, ఫుడ్‌ అండ్‌ వాటర్‌ తదితర కమిటీలను ఏర్పాటు చేశారు.

➡️