మంచి నిద్రతో మెరుగైన ఆరోగ్యం..

Feb 13,2024 10:00 #feature

ఆరోగ్యం బాగుండాలంటే సరైన నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర అంటే నిద్ర వచ్చినప్పుడు పోవడం కాదు. నిద్రకు సరిపడా సమయం కేటాయించడం. కానీ చాలామంది నిద్రకు సరైన సమయం ఇవ్వరు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక, శారీరక ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా పిల్లలు ఎక్కువ నిద్రపోతే, వృద్ధులకు అస్సలు నిద్ర రాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలి అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ‘ఎవరు, ఎన్ని గంటలు పడుకోవాలి?’ అనేది వాళ్ల వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. వయస్సు ప్రకారం.. తగినంత నిద్ర లేకపోతే, అనారోగ్యానికి గురవ్వడం ఖాయం.

నేషనల్‌ స్లీప్‌ ఫౌండేషన్‌ వివరాల ప్రకారం..

0 నుంచి 3 నెలల పిల్లలు 14 నుంచి 17 గంటల వరకు నిద్రపోవాలి. 4 నుంచి 12 నెలల పిల్లలు 12 నుంచి 16 గంటల వరకు, 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలు 11 నుంచి 14 గంటలు, 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 10 నుంచి 13 గంటలు, 6 నుంచి 9 సంవత్సరాల పిల్లలు 9 నుంచి 12 గంటలు, 14 నుంచి 17 సంవత్సరాల వారికి రోజుకు 8-10 నిద్ర అవసరం. టీనేజ్‌లో ఉన్న వాళ్లు 7 నుంచి 9 గంటల నిద్ర పోవడం చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే 65 ఏళ్లు పైబడిన వారు కూడా రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి.

మహిళలు ఎక్కువ సమయం

                    ఈ జాబితాలో మహిళల నిద్ర సమయం ప్రత్యేకంగా పరిగణించారు. మహిళలు ఎక్కువగా నిద్రపోవాలని నేషనల్‌ స్లీప్‌ ఫౌండేషన్‌ పరిశోధన చెబుతోంది. టీనేజ్‌ అమ్మాయిలకు 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం. అదే సమయంలో 24 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు రోజుకు ఏడు గంటలు నిద్రపోవాలి. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరమని ఓ పరిశోధనలో తేలింది. ప్రతి స్త్రీ పురుషుడి కంటే 20 నిమిషాలు ఎక్కువ నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరానికి ఏం ప్రయోజనం ?

                 సరిపడా నిద్ర లేకపోతే శరీరం నిస్సత్తువుగా తయారవుతుంది. తరచూ తలనొప్పి లేదా కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఏకాగ్రత స్థాయి తగ్గుతుంది, చికాకును పెరుగుతుంది, శరీర బరువు, ఒత్తిడి ఎక్కువవుతాయి. రోజూ సరిపడానిద్ర పోతే మీ శరీరం, మనసు చాలా ఉత్సాహంగా పనిచేస్తాయి.

మెరుగైన జ్ఞాపకశక్తి

                     నిద్రలో, మన మెదడు జ్ఞాపకాలను బలపరుస్తుంది. మేల్కొన్నప్పుడు, వాటి అభ్యాస ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రతి రోజూ ఇలాగే జరుగుతుంది. మంచి నిద్ర పోయేవాళ్ల జ్ఞాపకశక్తితో పోల్చుకుంటే తక్కువ నిద్రపోయే వాళ్ల జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యస్థితిని పోల్చిచూసినప్పుడు, సరిపడా నిద్ర పోయేవాళ్ల సామర్థ్యానికి తక్కువ నిద్ర పోయే వాళ్ల సామర్థ్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.

హానికర సి-రియాక్టివ్‌ ప్రొటీన్‌ స్థాయిలు పెరుగుతాయి

                    సరిపడా నిద్ర లేకపోతే, ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ల స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల అధిక రక్తపోటు, మధుమేహం, స్ట్రోక్‌, ఆర్థరైటిస్‌, వృద్ధాప్యం మొదలైన వాటి ప్రమాదం పెరుగుతుంది. ఆరు లేదా అంతకంటే తక్కువ గంటలు నిద్రపోయే వ్యక్తుల శరీరంలో సి-రియాక్టివ్‌ ప్రోటీన్‌ ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ప్రోటీన్‌ హార్ట్‌ స్ట్రోక్‌, ఇతర గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది.

ఇతర ఆరోగ్య సమస్యలు..

            సరైన నిద్ర పోకపోతే.. రక్తపోటు పెరుగుతుంది. అధిక మోతాదులో ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. సుదీర్ఘమైన నిద్ర లేమి వల్ల దైనందిన జీవనశైలిలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటాయి.

బరువు నియంత్రణ

             బరువు నియంత్రణలో నిద్ర ప్రభావం చాలా ఉంది. సరిగ్గా నిద్రపోని కారణంగా రోజురోజుకూ శరీర బరువు పెరుగుతుంది. సరిపడా నిద్ర, ఆహారంలో మార్పులు చేసుకుంటే బరువు నియంత్రించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్య ప్రయోజనాలు

సరైన నిద్ర లేకుండా, ఆహారంలో మార్పులు చేసుకున్నంత మాత్రాన ఆరోగ్య సమస్యలు దూరం కావు. ఎంత మంచి ఆహారం తీసుకున్నా, తక్కువ నిద్రపోతే, శరీరం ఎండిపోయినట్లు అనిపిస్తుంది, ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి, జీర్ణక్రియ బలహీనంగా ఉంటుంది.

పిల్లల్లో ప్రభావాలు..

పిల్లలు రోజూ కనీసం 8 గంటలు నిద్రపోలేకపోతే వాళ్ల ఏకాగ్రత స్థాయి తగ్గుతుంది. హైపర్యాక్టివ్‌గా ఉంటారు. అంటే ఉద్రేక స్థాయిలు పెరుగుతాయి. చిరాకుగా ఉంటారు.మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరం. దైనందిన జీవితంలో కొన్ని అలవాట్లను మెరుగుపర్చుకుంటే రోజూ సరిపడా నిద్ర పోగలం. తద్వారా ఆరోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చు.

➡️