బీహార్‌లో ద్రోహం !

Feb 3,2024 07:15 #Editorial

నితీష్‌ ‘పల్టీ’, అవకాశవాదానికి వ్యతిరేకంగా ఎవరైనా దాడి చేయవచ్చు. అయితే ఈ అవకాశవాద భాగస్వామ్యానికి మరో పార్శ్వం కూడా వుంది. ఫిరాయింపులను ప్రోత్సహించడంలో, అవినీతి, ఎలాంటి సూత్రబద్ధ వైఖరి లేనివారిగా విమర్శించే నేతలను తన పార్టీ లోకి ఆహ్వానించడంలో బిజెపికి నితీష్‌తో సమానంగా, లేదనుకుంటే అంతకంటే ఎక్కువ అవకాశవాద రికార్డు వుంది. గతేడాది జనవరిలో, నితీష్‌ మాట్లాడుతూ, వెనక్కి తిరిగి బిజెపిలోకి వెళ్లడం కంటే చావడం మంచిదని వ్యాఖ్యానించారు. దానిపై అమిత్‌ షా కూడా అంతే ఘాటుగా ప్రతిస్పందిస్తూ, నితీష్‌కు ద్వారాలు శాశ్వతంగా మూసుకుపోయాయని అన్నారు. ఈ వ్యక్తి వెనక్కి తిరిగి బిజెపిలోకి రావడానికై తలుపులు బార్లా తెరవడానికి అదే అమిత్‌ షాకు కొద్ది గంటలు కూడా పట్టలేదు.

బీహార్‌ ముఖ్యమంత్రి, జెడి(యు) నేత నితీష్‌ కుమార్‌ మళ్ళీ పల్టీలు కొట్టారు. 2022 ఆగస్టులో బిజెపిని వీడి, ఆర్‌జెడితో కలిసి మహాఘటబంధన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్‌ ఇప్పుడు తిరిగి బిజెపి లోకి ఫిరాయించారు. ఐదుసార్లు పార్టీలు ఫిరాయించి, తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీష్‌ కుమార్‌ భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో ఒక అపఖ్యాతి రికార్డు సాధించారు. ఈసారి తీసుకున్న ‘యు టర్న్‌’ అత్యంత ఆసక్తికరమైన పరిస్థితుల్లో చోటు చేసుకుంది. గతేడాది జులై నుండి, నితీష్‌ బిజెపి వ్యతిరేక ప్రతిపక్షాలను ఒక్కతాటి పైకి తీసుకురావడంలో తలమునకలై పనిచేశారు. ఆయన తీసుకున్న చొరవ ఫలితంగానే 2023 జూన్‌లో పాట్నాలో మొట్టమొదటి ప్రతిపక్ష పార్టీల సదస్సు జరిగింది. కానీ, ప్రతిపక్షాల ఐక్యతను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి కేవలం ఆరు మాసాల వ్యవధిలోనే బిజెపి ఆస్థానంలో చేరడం ఎలా జరిగింది?

ఇండియా బ్లాక్‌ కన్వీనర్‌గా తనను ఎన్నుకోవడంలో జనవరి 13న జరిగిన ప్రతిపక్షాల సమావేశం విఫలమవడంతో నితీష్‌ విసిగిపోయారని, దీని కోసం ఆయన గత కొన్ని మాసాలుగా వేచి చూస్తున్నారని ఆయన సన్నిహిత సహచరులు చెప్పారు. నితీష్‌ పార్టీ ఫిరాయింపునకు గల కారణాల్లో ఇదొకటిగా వుంది.

ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినట్లైతే, ఆయనను కన్వీనర్‌గా చేయకపోవడం ఇండియా బ్లాక్‌ అదృష్టమనే చెప్పవచ్చు, ఒకవేళ ఇండియా బ్లాక్‌ ఏకైక కన్వీనర్‌గా ఆయనను చేసినట్లైతే, ఆయన తన భాగస్వాములను మోసం చేసి, బిజెపితో చేతులు కలిపితే ప్రభావం ఎలా వుండేదో ఒక్కసారి ఊహించుకోవచ్చు. కన్వీనర్‌గా కీలకమైన పదవిని చేపట్టి ప్రతిపక్షాలను వెన్నుపోటు పొడిచే అవకాశాన్ని నితీష్‌ కుమార్‌కు ఇవ్వకపోవడం అదృష్టం. ఎలాంటి తప్పు చేయనందుకు, అవకాశవాది అయిన నితీష్‌ కుమార్‌ ఈ కన్వీనర్‌ పదవిని ఉపయోగించుకుని బిజెపితో మరింత గట్టిగా బేరసారాలు అడేవారు.

నితీష్‌ ‘పల్టీ’, అవకాశవాదానికి వ్యతిరేకంగా ఎవరైనా దాడి చేయవచ్చు. అయితే ఈ అవకాశవాద భాగస్వామ్యానికి మరో పార్శ్వం కూడా వుంది. ఫిరాయింపులను ప్రోత్సహించడంలో, అవినీతి, ఎలాంటి సూత్రబద్ధ వైఖరి లేనివారిగా విమర్శించే నేతలను తన పార్టీ లోకి ఆహ్వానించడంలో బిజెపికి నితీష్‌తో సమానంగా, లేదనుకుంటే అంతకంటే ఎక్కువ అవకాశవాద రికార్డు వుంది.

గతేడాది జనవరిలో, నితీష్‌ మాట్లాడుతూ, వెనక్కి తిరిగి బిజెపిలోకి వెళ్లడం కంటే చావడం మంచిదని వ్యాఖ్యానించారు. దానిపై అమిత్‌ షా కూడా అంతే ఘాటుగా ప్రతిస్పందిస్తూ, నితీష్‌కు ద్వారాలు శాశ్వతంగా మూసుకుపోయాయని అన్నారు. ఈ వ్యక్తి వెనక్కి తిరిగి బిజెపిలోకి రావడానికై తలుపులు బార్లా తెరవడానికి అదే అమిత్‌ షాకు కొద్ది గంటలు కూడా పట్టలేదు.

బిజెపి, మోడీ ప్రభుత్వం రెండింట్లోనూ ఫిరాయింపు దారులే వున్నారు. ప్రతిపక్షంలో వున్నపుడు అవినీతి వ్యక్తులుగా ముద్ర వేయబడిన వారు బిజెపిలో చేరిన తర్వాత అవినీతి రహితులుగా మారతారు. వారిపై ప్రతిపక్షంలో వున్నపుడు ప్రారంభించిన ఇ.డి, సిబిఐ విచారణలు, దర్యాప్తులు నిలిచిపోతాయి. బిజెపి బుజ్జగింపులు, వాక్చాతుర్యానికి లొంగనివారు తర్వాత ఇ.డి, సిబిఐ విచారణలను ఎదుర్కొనాల్సి వుంటుంది. నితీష్‌-బిజెపి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌లకు వరుసగా ఇ.డి విచారణ కోసం పిలుపులు రావడం ఇదే విషయాన్ని సూచిస్తుంది.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాల పట్ల బిజెపికి గల అభద్రత, భయాందోళనలు బీహార్‌ ఆపరేషన్‌తో మరింత స్పష్టమవుతోంది. ఉత్తర భారతంలో ప్రధాన రాష్ట్రాల్లో ఒకటైన బీహార్‌లో మహాఘటబంధన్‌కు వ్యతిరేకంగా బిజెపికి గల అవకాశాలు చాలా పేలవంగా వున్నాయి. జెడి(యు)ను గనక తమ వైపునకు తిప్పుకోగలిగితే, ఈ గడ్డు పరిస్థితులను అధిగమించవచ్చని బిజెపి ఆశిస్తోంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి-జెడి(యు)కు వ్యతిరేకంగా పోరాడిన ఆర్‌జెడి-వామపక్షాలు-కాంగ్రెస్‌ కూటమి బలీయమైన శక్తిగా వుంది. ఎన్నికల్లో చాలా తక్కువ తేడాతోనే ఓడిపోయినా 43 సీట్లతో మూడో స్థానంలో నిలిచింది. మరోపక్క జెడి(యు) ప్రాబల్యాన్ని కోల్పోయింది. అస్సాం గణ పరిషత్‌లా బిజెపితో పొత్తు పెట్టుకున్న ఇతర ప్రాంతీయ పార్టీల భవిష్యత్‌ మాదిరిగానే జెడి(యు) భవితవ్యం కూడా వుండనుంది. నామమాత్రపు భాగస్వామి స్థాయికి కుదించుకుపోతుంది. పైగా దాని బలాబలాలను హిందూత్వ పార్టీ సమీక్షిస్తుంది. నితీష్‌ కుమార్‌ అనైతికంగా, అసంబద్ధంగా జరిపిన ఫిరాయింపుతో ఎలాగైనా ఈ సిగ్గుమాలిన కూటమిని ఓడించాలనే పట్టుదల, దీక్ష, కృతనిశ్చయం మహాఘటబంధన్‌కు మరింత బలోపేతమవుతాయి.

( ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

➡️