తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత బంగారం, వజ్రాభరణాలు

Jan 24,2024 10:48 #Tamil Nadu
bengaluru court on jayalalitha jewellery

 బెంగళూరు కోర్టు తీర్పు

బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన బంగారు నగలను, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అభరణాల వినియోగంపై తమిళనాడు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపింది. జయలలిత, ఇతరులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మెటీరియల్‌ సాక్ష్యాల్లో భాగంగా ఈ అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల్లో భాగంగా ఈ కేసును కర్ణాటకలో విచారిస్తున్నారు. అందువలన ఈ అభరణాలన్నీ ప్రస్తుతం కర్ణాటక ట్రెజరీలో ఉన్నాయి. పై తీర్పును అదనపు సిటీ సివిల్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి హెచ్‌ఎ మోహన్‌ వెలవరించారు. కాగా, ఈ అభరణాలను దక్కించుకోవడానికి జయలలిత బంధువులు అర్హులు కాదని కోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. జయలలిత మేనకోడలు, మేనల్లుడు జె దీప, జె దీపక్‌ వేసిన పిటీషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఇచ్చిన తీర్పులో.. ‘నగలను వేలం వేయడానికి బదులుగా తమిళనాడు హోం శాఖకు అప్పగించడం ద్వారా తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయడం మంచిది’ అని జడ్జి పేర్కొన్నారు. అలాగే, ఈ కేసును కర్ణాటక రాష్ట్రంలో విచారించిన కారణంగా విచారణ ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5 కోట్లు చెల్లించాలని కూడా ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. చెన్నైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో జయలలితకు సంబంధించిన ఖాతాలో ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నుంచి ఈ చెల్లింపులు జరపాలని పేర్కొంది. జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికళ, జయలలిత పెంపుడు కుమారుడు సుధాకరన్‌, శశికళ కోడలు జె.ఇళవరసిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు విచారించింది.

➡️