అరటి రైతు దిగాలు

Mar 6,2024 09:52 #special story
  • కర్పూర రకం రూ.150 నుంచి రూ.200
  • ఊరటనివ్వని శివరాత్రి, పెళ్లిళ్ల సీజన్‌

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : అరటి రైతులకు సీజన్‌లోనూ ఊరట లభించడం లేదు. ఒకవైపు పెళ్లిళ్లు మరోవైపు, శివరాత్రి పండగ ఉన్నప్పటికీ ధరలు ఆశాజనకంగా లేవు. గత సీజన్‌లో కర్పూర రకం అరటి గెల రూ.400 నుంచి రూ.600 వరకూ విక్రయం జరిగింది. ప్రస్తుతం ధర రూ.150 నుంచి రూ.200 మించడం లేదు. చక్రకేళి రకం గెల గత సీజన్‌లో రూ.550 ఉంది. ప్రస్తుతం రూ.350కు, అమృతపాణి గెల ధర రూ.350 నుంచి రూ.250కు పడిపోయింది. ఉభయ తూర్పుగోదావరి జిల్లాల్లో అరటిని రైతులు విస్తృతంగా సాగు చేస్తున్నారు. రావులపాలెం, అంబాజీపేట మార్కెట్లు ప్రధానమైనవి. పెరవలి, కొవ్వూరు తోటల నుంచి రాజమహేంద్రవరం, తాడేపల్లి మార్కెట్లకు తరలిస్తుంటారు. తోటలకెళ్లి రైతుల నుంచి అరటిని దళారులు మార్కెట్‌కు తీసుకొచ్చినందుకు గెలకు రూ.50 చొప్పున కమీషన్‌ తీసుకుంటున్నారు. మరి కొంతమంది బడా వ్యాపారులు నేరుగా తోటలలోకి లారీలతో వచ్చి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారు. ప్రస్తుతం ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెరదుతున్నారు. కోనసీమ జిల్లాలో రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, అంబాజీపేట మండలాల్లో విస్తారంగా అరటి సాగవుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో కొవ్వూరు, పెరవలి, ఉండ్రాజవరం, తాళ్లపూడి మండలాల్లో అరటి సాగు అధికం. అధికారుల గణాంకాల ప్రకారం ఉభయ తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 45 వేల ఎకరాల్లో అరటి తోటలు సాగవుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మంది రైతులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. రావులపాలెం మార్కెట్‌ నుంచి ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కోల్‌కత్తా తదితర రాష్ట్రాలకు కూడా ప్రతి రోజూ ఎగుమతులు అవుతుంటాయి. రావులపాలెం, ఆత్రేయపురం అరటికి మంచి డిమాండ్‌ ఉంది. సైజు, లావు, నాణ్యతతో పాటు రుచి, సువాసన కలిగి ఉంటుంది. ప్రధానంగా కర్పూరం, తెల్ల చక్రకేళి, బుసావళి, ఎర్ర చక్రకేళి, బొంత తదితర రకాల అరటిని రైతులు సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.90 వేలు ఖర్చు అవుతోంది.

తగ్గిన ఎగుమతులు

               సీజన్‌లో రోజూ సుమారు 150కిపైగా లారీల అరటి ఎగుమతి అవుతుంటాయి. ఇందులో 80 లారీల సరుకు ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. ప్రస్తుతం ఎగుమతులు వంద లారీలకు మించడం లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో 45 వేల ఎకరాల్లో అరటి సాగవుతోంది. సుమారు ఎనిమిది లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ధరలో నిలకడ లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. గెలకు రూ.250 వరకూ లభిస్తే కొంత మిగులు ఉంటుందని, లేకపోతే నష్టపోతామని వారు చెప్తున్నారు. ప్రస్తుతం ధర ఆశాజనకంగా లేకపోవడంతో గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా అరటి సాగవు తోంది. శబరి నదీ పరివాహక ప్రాంతాల్లోనూ ఈ ఏడాది దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో లోకల్‌ అరటికి ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లేదని వ్యాపారులు చెప్తున్నారు. అరటిని నిల్వ చేసుకొనే సౌకర్యాలు కల్పించాలని, ఆ దిశగా అధికార యంత్రాంగం చొరవ చూపించాలని రైతులు కోరుతున్నారు.

సీజన్‌లోనూ ధరలు లేవు

గత 20 సంవత్సరాలుగా అరటి సాగు చేస్తున్నాను. ఈ ఏడాది కర్పూర రకం అరటి వేశాను. పది టన్నుల దిగుబడి వచ్చింది. రూ.95 వేలకు విక్రయించాను. గెల ధర రూ.150 మించలేదు. మార్కెట్లో ఒక్కో రోజు ఒక్కో ధర ఉంటోంది. ధర బాగా ఉందని అధిక సంఖ్యలో గెలలు దించితే ఒక్కసారిగా ధరలు పడిపోతున్నాయి. అరటిని నిల్వ చేసుకునే సౌకర్యాలు లేకపోవడంతో వ్యాపారులు అడిగిన ధరకు విక్రయించక తప్పడం లేదు. గెలకు కనీసం రూ.250 వస్తేగానీ గిట్టుబాటు కాదు.  -గూడాల వెంకటేశ్వరరావు, కౌలు రైతు, ముక్కాముల, పెరవలి మండలం

 

➡️