వేటకు విరామొంనేటి నుంచి 61 రోజుల పాటు చేపల వేటపై నిషేధం

వేట నిషేధ భృతిని 2018 వరకు మోటారు బోట్లకు పరిమితం

పెండింగ్‌లో 800 మందికి పరిహారం

భృతి చెల్లింపునకు సర్వేపై ఇంకా రాని మార్గదర్శకాలు

సముద్రంలో చేపల వేటపై సోమవారం నుంచి నిషేధం అమలు కానుంది. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేయనుంది. ఈ సమయాల్లో వేట సాగిస్తే మత్స్య సంపద దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా వేటకు విరామాన్ని ప్రకటిస్తూ వస్తోంది. చేపల వేటకు దూరంగా ఉంటున్న మత్స్యకారులకు ప్రభుత్వం 61 రోజుల కాలానికి రూ.10 వేలు భృతి చెల్లింపునకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పరిహారం చెల్లింపునకు అర్హులైన వారిని గుర్తించేందుకు గతేడాది 17వ తేదీ నుంచే సర్వే చేపట్టగా, ఈ ఏడాది వాటికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా వెలువడలేదు.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

వేట నిషేధ భృతిని 2018 వరకు మోటారు బోట్లకు పరిమితం చేయగా, రెండేళ్లుగా తెప్పలపై చేపల వేట సాగిస్తున్న వారికీ ప్రభుత్వం భృతిని వర్తింపజేసింది. జిల్లాలోని 11 మండలాల్లో 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. చేపల వేట ప్రధాన వృత్తిగా సుమారు 25 వేల కుటుంబాలు బతుకుతున్నాయి. వేట నిషేధ కాలపు పరిహారాన్ని ప్రభుత్వం కొందరికే పరిమితం చేస్తోంది. పడవలో గరిష్టంగా పది మంది వరకు చేపల వేటకు వెళ్తారు. మోటరైజ్డ్‌ బోట్లపై వేట సాగించిన వారిలో ఆరుగురికి, సంప్రదాయ తెప్పలపై వేట చేస్తున్న వారిలో ముగ్గురికి మాత్రమే సాయాన్ని అందిస్తోంది. దీంతో మిగిలిన మత్స్యకార కుటుంబాలు సాయం పొందలేకపోతున్నాయి. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు వేటకు వెళ్తున్నా, అందులో ఒక్కరికే డబ్బులు అందిస్తోంది. చేపల వేట నిషేధంతో మత్స్యకార మహిళలు చేపలు అమ్ముకోవడానికి అవకాశం లేకపోవడంతో వారికీ ఉపాధి లేకుండా పోయింది. ప్రభుత్వం ఇచ్చిన సాయం డబ్బులనే అందరూ కలిసి పంచుకుంటున్న పరిస్థితి ఉంది.సర్వేపై వెలువడని మార్గదర్శకాలుచేపల వేటపై నిషేధం నేపథ్యంలో అర్హులైన మత్స్యకారులను గుర్తించేందుకు చేపట్టే సర్వేపై ఇంకా మార్గదర్శకాలు రాలేదు. గతేడాది 17వ తేదీన జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ఒకేసారి సర్వే చేపట్టారు. మత్స్యకారుల నుంచి బ్యాంకు ఖాతా, ఆధార్‌ నంబర్లు తదితర వివరాలను సేకరించారు. బోటుకు పైభాగంలో పసుపు, కింది భాగంలో నీలం రంగు వేయాలని నిబంధన విధించారు. రిజిస్ట్రేషన్‌ అయిన బోట్లకే పరిహారం చెల్లించారు. వివరాలను క్రోడీకరించి అర్హులైన వారి జాబితాలను సిద్ధం చేసి, ఏప్రిల్‌ చివరి వారంలో తుది జాబితా ప్రదర్శించారు. మే పదో తేదీన ప్రభుత్వం నగదు జమ చేసింది. ఈ ఏడాది వీటికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడకపోవడంతో పరిహారం ఎప్పుడు అందుతుందోనన్న ఆందోళన మత్స్యకారుల్లో నెలకొంది.వలస కార్మికులు వెనక్కిజిల్లాలో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వెళ్లిన జిల్లాకు చెందిన మత్స్యకారులు చేపల వేట నిషేధంతో తమ స్వస్థలాలకు వస్తున్నారు. చేపల వేట ప్రధానంగా సాగే గుజరాత్‌లోని వీరావళి, చెన్నై తదితర ప్రాంతాలకు జిల్లా నుంచి మత్స్యకారులు పెద్దసంఖ్యలో వలస వెళ్తుంటారు. 61 రోజులు వేట నిషేధం అమల్లో ఉండడంతో గ్రామాలకు చేరుకుంటున్నారు.

➡️