ప్రతిభాపాటవాల వెలికితీతకు బాలోత్సవాలు దోహదం

Dec 17,2023 09:09 #Balotsavam, #Visakha

– బాలోత్సవాల్లో పలువురు వక్తలు

– తిరుపతిలో ప్రారంభం.. విశాఖలో ముగింపు

ప్రజాశక్తి- తిరుపతి సిటి/ ఎంవిపి.కాలనీ (ఎంవిపి.కాలనీ):విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలను వెలికి తీసేందుకు బాలోత్సవాలు దోహదం చేస్తాయని పలువురు వక్తలు అన్నారు. పిల్లలను ప్రోత్సహించేందుకు, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు విశాఖ, తిరుపతిలో శనివారం బాలోత్సవాలు నిర్వహించారు. తిరుపతిలోని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌ రోటరీక్లబ్‌ సౌజన్యంతో తిరుపతి బాలోత్సవం ఆధ్వర్యంలో పిల్లల పండుగా2 శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టిటిడి చైర్మన్‌, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, కార్పొరేషన్‌ మేయర్‌ డాక్టరు శిరీషా ముఖ్యఅతిథులుగా హజరయ్యారు. తిరుపతి బాలోత్సవం గౌరవాధ్యక్షులు టెంకాయల దామోదరం అధ్యక్షతన జరిగిన సభలో భూమన మాట్లాడుతూ పిల్లలను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం నెహ్రూ వేదిక వద్ద చిత్రలేఖనం, గోపికృష్ణ వేదికపై శాస్త్రీయ కళా ప్రదర్శనలు, గురుజాడ వేదికపై దేశభక్తి గీతాలాపన, అన్నమయ్య వేదికపై జానపద నృత్యప్రదర్శనలు, బళ్ళారి రాఘవ వేదికపై ఏకపాత్రాభినయం వంటి వాటితోపాటు పలు అనేక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం అధ్యక్షులు నడ్డా నారాయణ, కార్యదర్శి మల్లారపు నాగార్జున, కార్పొరేటర్‌ గీత, ఎస్‌పిజెఎన్‌ఎంహెచ్‌ స్కూల్‌ హెచ్‌ఎం మునిశేఖర్‌, ఎంఈవోలు బాస్కర్‌ నాయక్‌, బాలాజీ, బండి మధుసూధనరెడ్డి, తదతరులు పాల్గన్నారు. విశాఖ నగరంలోని సెయింట్‌ ఆంథోనీ స్కూలులో మూడు రోజులుగా జరుగుతున్న విశాఖ బాలోత్సవం శనివారంతో ముగిసింది. చివరి రోజు మట్టి బమ్మల తయారీతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నాలుగు వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. బృంద, సోలో నృత్యాలు ఆకట్టుకున్నాయి. అకడమిక్‌ ఈవెంట్స్‌లో భాగంగా క్విజ్‌, తెలుగులో మాట్లాడడం, మంట లేని వంటలు వంటి అంశాలపై పోటీలు జరిగాయి. ఈ బాలోత్సవంలో విశాఖ నగరానికి చెందిన 130 పాఠశాలల నుంచి సుమారు ఆరు వేల మంది పాల్గన్నారు. ముగింపు వేడుకలో సెయింట్‌ ఆంథోని స్కూలు నిర్వాహకులు రత్న కుమార్‌, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్‌ రమేష్‌ కుమార్‌, అల్లూరి విజ్ఞాన కేంద్రం ట్రస్టీ విఎస్‌.పద్మనాభరాజు, సామాజిక కార్యకర్త డాక్టర్‌ కె.రమాప్రభ తదితరులు పాల్గన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

➡️