ఎవరికీ పట్టకపోతే నాకెందుకు?- ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని అసంతృప్తి

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో: ‘అందరికీ మేలు జరుగుతుందని మాగుంటను ఎంపి అభ్యర్థిగా పెట్టాలని చూశా.. మిగతా ఇన్‌ఛార్జులెవరికీ పట్టకపోతే నాకెందుకు.? అధిష్టానం ఏది చెబితే దాన్నే అనుసరిస్తా..’ అని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఒంగోలు వచ్చిన బాలినేని తనను కలిసిన మీడియాతో బుధవారం మాట్లాడారు. ఎంపి అభ్యర్థి విషయంపై మిగతా ఇన్‌ఛార్జులెవరూ మాట్లాడడం లేదని, వాళ్లకు లేని బాధ తనకెందుకంటూ వ్యాఖ్యానించారు. తానూ తన నియోజకవర్గానికే పరిమితమవుతానని చెప్పారు. ఒంగోలులో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకే ప్రాధాన్యతనిస్తానన్నారు. చెవిరెడ్డికి చెక్‌ పెట్టిన బాలినేని చెవిరెడ్డి బాష్కరరెడ్డికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెక్‌ పెట్టారు. పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా, ఒంగోలచెంపి అభ్యర్థిగా చెవిరెడిని నిలబెట్టాలని వైసిపి అధినాయకత్వం భావించింది. ఇదే విషయాన్ని పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం నాడు బాలినేని పిలిచి చెప్పారు. బాలినేని ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. అతని కింద పని చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని సజ్జల, విజయసాయిరెడ్డి సిఎంకు చేరవేశారు. దీంతో భాస్కరరెడ్డిని రీజినల్‌ కోఆర్డినేటర్‌గా నియమించే నిర్ణయాన్ని ప్రస్తుతానికి విరమించుకున్నారు.

➡️