మూడు పూలు… ఆరు కాయలు

Jan 9,2024 11:00 #PM Modi, #Trump
  • భారత్‌లో దినదినాభివృద్ధి చెందిన ట్రంప్‌ వ్యాపారాలు
  • ఆయన హయాంలో 2.82 లక్షల డాలర్లు ఖర్చు చేసిన కేంద్రం
  • మోడీతో సన్నిహిత సంబంధాలే కారణం డెమొక్రటిక్‌ సభ్యుల కమిటీ వెల్లడి

వాషింగ్టన్‌ : డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన దేశంలో ఆయన వ్యాపారాలు మూడు పూలు…ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందుతూ వర్థిల్లాయి. ప్రధాని మోడీతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలే దీనికి కారణం. వ్యాపారాల ద్వారా ఆయన భారత్‌ సహా ఇరవై దేశాల నుండి కనీసం 7.8 మిలియన్‌ డాలర్లు ఆర్జించారని చెబుతూ అమెరికా హౌస్‌ ఓవర్‌సైట్‌ కమిటీలోని డెమొక్రటిక్‌ సభ్యులు ఓ నివేదికను విడుదల చేశారు. అమెరికా ప్రతినిధుల సభకు చెందిన ఈ కమిటీ అత్యంత శక్తివంతమైనది. ప్రభుత్వ విభాగాలలో జవాబు దారీతనాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుంది.

న్యూయార్క్‌లోని ట్రంప్‌ వరల్డ్‌ టవర్‌లో, అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో 2017-2020 మధ్యకాలంలో భారత్‌ 2,82,764 డాలర్లు ఖర్చు చేసిందని ఆ నివేదిక తెలిపింది. ట్రంప్‌ వ్యాపారాలలో చైనా, సౌదీ అరేబియా, ఖతార్‌, యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌, మలేసియా, కువైట్‌, ఫిలిప్పీన్స్‌ దేశాలు కూడా ఖర్చు చేశాయని నివేదిక వెల్లడించింది. ట్రంప్‌కు గతంలో అకౌంటింగ్‌ సంస్థగా వ్యవహరించిన మజార్స్‌, అమెరికా సెక్యూరిటీలు-ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ నుండి సేకరించిన పత్రాల ఆధారంగా ఈ వివరాలు బయటపడ్డాయి. ‘అమ్మకానికి శ్వేతసౌధం : అధ్యక్షుడు ట్రంప్‌కు రాకుమారులు, ప్రధానులు, దేశాధినేతలు ఎలా ప్రయోజనం చేకూర్చారు’ అనే శీర్షికతో ఈ నివేదికను రూపొందించారు.

అమెరికా వెలుపల ట్రంప్‌ యాజమాన్యంలో నడిచిన వ్యాపార ప్రాజెక్టులలో అత్యధికం మన దేశంలోనే ఉన్నాయి. భారత్‌లో ట్రంప్‌కు ఉన్న వ్యాపార సంస్థలను, ఆయన అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అమెరికా విదేశాంగ విధానానికి ఆయన ఇచ్చిన సూచనలను గమనిస్తే వాటికి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని అర్థమవుతుంది. ట్రంప్‌ తన వ్యాపార కార్యకలాపాల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. దేశాధ్యక్షుడు కావడానికి ముందే తన వ్యాపార ప్రయోజనాల కోసం ట్రంప్‌ మన దేశానికి వచ్చారు. ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించినప్పుడు కూడా శ్వేతసౌధంలో ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు.

  • ఈ రెండింటిలోనే భారీగా ఖర్చు

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో న్యూయార్క్‌ నగరంలోనూ, వాషింగ్టన్‌ డీసీలోనూ ఆయన ఆస్తులలో భారత ప్రభుత్వం కనీసం 2,82,764 డాలర్లు ఖర్చు చేసింది. వరల్డ్‌ టవర్‌లో రెండు యూనిట్ల ఏర్పాటుకు అయిన ఖర్చును మన ప్రభుత్వమే భరించింది. ట్రంప్‌ అధ్యక్షుడుగా ఉన్నంతకాలం ఈ టవర్లు మన ప్రభుత్వ అధీనంలోనే ఉండేవి. వాషింగ్టన్‌ డీసీలో ట్రంప్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ హోటల్‌లో అమెరికాలోని భారత రాయబారులు అనేకసార్లు బస చేశారు. ఆ ఖర్చంతా మన ప్రభుత్వమే భరించింది.

కమిటీకి మజార్స్‌ ఇచ్చిన పత్రాల ప్రకారం…ఐరాసలో భారత శాశ్వత కార్యకలపాల కోసం న్యూయార్క్‌లోని ట్రంప్‌ టవర్స్‌లో రెండు యూనిట్లను తీసుకున్నారు. 2018లో వీటి కోసం 66,046 డాలర్లు చెల్లించారు. ట్రంప్‌ అధికారంలో ఉన్న సమయంలో ఈ యూనిట్ల కోసం భారత ప్రభుత్వం 2,64,184 డాలర్లు ఖర్చు చేసి ఉంటుందని అంచనా. అదనపు ఛార్జీలను ఇందులో కలపలేదు. ఒక్క 2018లోనే 66,046 డాలర్ల కామన్‌ ఛార్జీలతో పాటు అదనపు ఛార్జీలు, ఫీజుల రూపంలో 13,983 డాలర్లు చెల్లించారు. వాషింగ్టన్‌లోని ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో 2017 ఫిబ్రవరి, మార్చిలో ఎనిమిది మంది భారత దౌత్యవేత్తలు బస చేసి 18,580 డాలర్లు చెల్లించారు.

కుటుంబ ప్రాజెక్టులు సైతం...

ట్రంప్‌ అమెరికా అధ్యక్షు డుగా ఉన్న కాలంలో ఆయన సంతానం డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌, ఎరిక్‌ ట్రంప్‌ల నేతృత్వంలోని ట్రంప్‌ ఆర్గనై జేషన్‌ మన దేశంలో అనేక ప్రాజెక్టులు చేపట్టింది. ట్రంప్‌ వ్యాపారాలలో భారతీయ మార్కెట్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని ‘ఓపెన్‌సీక్రెట్స్‌’ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. భారత్‌ కంటే మరే దేశానికీ ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ ప్రాధాన్యత ఇవ్వలేదని ఈ సంస్థ వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ట్రంప్‌ ఆస్తులలో, ఆయన వ్యాపారాలలో భారత్‌ పెట్టిన ఖర్చు ఆయనకు అనేక మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని అందించింది. దేశాధ్యక్షుడు కావడానికి ముందే ఆయన మన దేశంలో దశాబ్ద కాలానికి పైగా వ్యాపారాలు నిర్వహించారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే సమయానికి ఐదు ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయి. ట్రంప్‌ అనేక మంది ప్రముఖ వ్యాపారవేత్తలతో కలిసి భాగస్వామ్యాలు నెరిపారు. వీరికి రాజకీయాలతో కూడా సంబంధం ఉండడం గమనార్హం. ట్రంప్‌ వ్యాపార భాగస్వాములలో అనేక మందిపై మోసం, దుష్ప్రవర్తన వం టి ఆరోపణలు ఉన్నాయి. ఆయా కంపెనీలపై విచారణలు కూడా జరిగాయి.

అటకెక్కిన విచారణలు

అమెరికా అధ్యక్షుడుగా ఎన్నిక కావడానికి ముందే ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకు ట్రంప్‌ అనేక ప్రయత్నాలు చేశారు. మోడీ ప్రధాని అయిన కొద్ది కాలానికి ఆయన ముంబయి వచ్చి మోడీపై ప్రశంసలు కురిపించారు. ట్రంప్‌ వ్యాపార భాగస్వామి మంగళ్‌ ప్రభాత్‌ లోథా బీజేపీ ఎమ్మెల్యేగా సుదీర్ఘ కాలం పనిచేశారు. లోథా కంపెనీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో 2013లో వాటిపై విచారణ జరిగింది. అయితే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోథా, ట్రంప్‌ భాగస్వాములుగా ఉన్న ముంబయి టవర్‌ ప్రాజెక్టుకు అవరోధాలు తొలగి పోయాయి. విచారణలన్నీ అటకెక్కాయి. మోడీ హయాం లో భారత్‌లో వ్యాపారాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు 2014లో జరిపిన పర్యటనలో ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఆయన ఆ పర్యటనలో స్థానిక మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ మోడీని పొగడ్తలతో ముంచెత్తారు.

భారత వ్యాపారులతో భాగస్వామ్యాలు

మన దేశంలో ట్రంప్‌ చేపట్టిన అనేక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు బీజేపీతో కుటుంబ సంబంధాలున్న కంపెనీల ద్వారానే నడిచాయి. ట్రంప్‌ ప్రాజెక్టులకు మన అధికారులు పలు విధాలుగా అండదండలు అందించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులలో రుణాలు సైతం ఇప్పించారు. అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టే సమయంలో కూడా ట్రంప్‌ అనేక మంది భారతీయ వ్యాపార భాగస్వాములను కలిశారు. ఎన్నికైన వారం రోజుల తర్వాత న్యూయార్క్‌లోని ట్రంప్‌ టవర్స్‌లో ముగ్గురు భారత వ్యాపారులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా వ్యాపార, రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. ట్రంప్‌ తరచూ తనపై కురిపించిన ప్రశంసల జల్లులను మోడీ ఎప్పుడూ మరచిపోలేదు. ఆయన కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ట్రంప్‌ను కొనియాడేవారు.

ఇబ్బడి ముబ్బడి ఆదాయం

మోడీ శ్వేతసౌధాన్ని సందర్శించిన తర్వాత వైట్‌హౌస్‌ ప్రతినిధిగా ఇవాంకా ట్రంప్‌, ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ అధిపతిగా డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ మన దేశానికి తరచూ వచ్చే వారు. మోడీ ఆహ్వానం మేరకు ట్రంప్‌ సతీమణి కూడా హైదరాబాద్‌ వచ్చి అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గన్నారు. ట్రంప్‌ సతీమణి భారత పర్యటన తర్వాత కొద్ది కాలానికే రాజధాని న్యూఢిల్లీ శివారులోని గురుగావ్‌లో ట్రంప్‌ టవర్ల నిర్మాణానికి ఆఘమేఘాల మీద అనుమతులు మంజూరయ్యాయి. ట్రంప్‌ జూనియర్‌ మన దేశానికి వచ్చినప్పుడు మోడీతో ఏకాంత సమావేశం జరిపారు. తన తండ్రి అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ట్రంప్‌ జూనియర్‌ మన దేశంలో వ్యాపార విస్తరణకు కృషి చేశారు. 2019లో ఆయన న్యూఢిల్లీలోని ట్రంప్‌ టవర్స్‌లో ఫ్లాట్ల కొనుగోలుదారులతో సమావేశమయ్యారు. కొనుగోలుదారు లు ఫ్లాట్లలోకి ప్రవేశించక ముందే పది నుండి యాభై లక్షల డాలర్ల వరకూ లైసెన్స్‌ ఫీజు చెల్లించారు. తన పదవీకాలంలో ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏటా లక్ష డాలర్ల నుండి పది లక్షల డాలర్ల వరకూ సంపాదించానని ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు. కొల్‌కతాలోని డీటీ టవర్స్‌ ద్వారా ఏడాదికి లక్ష నుండి పది లక్షల డాలర్ల వరకూ ఆర్జించానని కూడా తెలిపారు. అధ్యక్షుడుగా ఉన్న చివరి సంవత్సరంలో కూడా ఈ వెంచర్‌ ద్వారా ట్రంప్‌కు యాభై వేల నుండి లక్ష డాలర్ల ఆదాయం లభించింది.

పరస్పర మద్దతుతో…

అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు భారత్‌లోని ట్రంప్‌ వ్యాపారాలు దినదిన ప్రవర్థమానమై విలసిల్లాయి. ట్రంప్‌, మోడీ…వీరిద్దరూ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ బలమైన వ్యక్తిగత సంబంధాలు కొనసాగించారు. ద్వైపాక్షిక పర్యటనలు నిర్విరామంగా జరిగాయి. మత స్వేచ్ఛకు మోడీ రక్షకుడంటూ భారత్‌లో పర్యటించిన ప్రతిసారీ ట్రంప్‌ పొగిడే వారు. అధ్యక్ష బాధ్యతల నుండి వైదొలిగే సమయంలో కూడా భారత్‌తో నెలకొల్పిన ప్రత్యేక సంబంధాల ప్రాధాన్యతను ప్రస్తావించారు. గత సంవత్సరం ఆయన ఓ ఇంటర్వ్యూ ఇస్తూ ‘భారత్‌కు నా కంటే మంచి స్నేహితుడు ఉన్నాడని నేను అనుకోను. అది నేను ఏర్పరచుకున్న సంబంధాలలో ఒకటని మీకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

➡️