రైతులపై బిజెపి ప్రభుత్వ దమనకాండ

Feb 23,2024 22:51

ప్రజాశక్తి – రేపల్లె
శుభ్ కరణ్ సింగ్ 23ఏల్ల రైతుని మోడీ ప్రభుత్వం కాల్పుల్లో ప్రాణాలు తీయాటాని, రైతులపై బిజెపి ప్రభుత్వం కాల్పులను ఖండిస్తూ సీఐటీయు, రైతు సంఘాల బ్లాక్ డే ప్రకటించిన సందర్భంగా స్థానిక నెహ్రూ బొమ్మవద్ద శుక్రవారం నిరసన తెలిపారు. మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మద్దతుధర చట్టం చేయాని ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడిన రైతులకు రెండేళ్ల క్రితం క్షమాపణలు చెపుతూ మోడీ హామీలు ఇచ్చాడని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ మణిలాల్‌ పేర్కొన్నారు. వాటిని అమలు చేయాలని, అప్పటి పోరాటం సందర్బంగా చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రెండవ దఫా రైతాంగం మొదలుపెట్టిన ఉద్యమంపై హర్యానా బిజెపి ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపించడం, ఢిల్లీ సరిహద్దుల్లో 23ఏళ్ల పంజాబ్ యువరైతు మృతి చెందిన ఘటనపై బిజెపి ప్రభుత్వ వైఖరిని ఖండించారు. కరోనా సమయంలో రైతుల భూములను, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పుతూ మోడీ తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలు తెచ్చిందని అన్నారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త రైతాంగం 15నెలలు చేశారని అన్నారు. అప్పటి పోరాటం సందర్భంగా మోడీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని రెండవదఫా పోరాటాలకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. గత పదేళ్లలో మోడీ విధానాల ఫలితంగా 1.60లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అననారు. పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేసి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని అన్నారు. ఢిల్లీకి శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతాంగంపైకి హర్యాన బిజెపి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి అంతర్జాతీయ సమాజం నిషేధించిన పెళ్లెట్స్ వంటి ఆయుధాలను, భాష్ప వాయు గోళాలను రైతులపై విసరబట్టే 200మంది రైతులు గాయపడ్డారని అన్నారు. అనేక మంది చూపు కోల్పోయారని అన్నారు. ముగ్గురు రైతులు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. శుభ్ కరణ్ సింగ్ అనే 23ఏళ్ల యువరైతు ప్రాణాలు వదిలాడని గుర్తు చేశారు. ఇవి సాధారణ మరణాలు కావని, మోడీ ప్రభుత్వ హత్యలని ఆరోపించారు. రైతులపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న క్రూరమైన అణిచివేత దేశ ప్రజలకు తెలియకుండా పంజాబ్, హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్‌ను బందు చేశారని, రూ.43లక్షల కోట్ల విలువచేసే వ్యవసాయ రంగాన్ని అంబానీ, అదాని వంటి కార్పోరేట్ స్నేహితులకు అప్పగించేందుకే మోడీ దొడ్డిదారిన నల్ల చట్టాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి ప్రజలంతా మద్దతుగా నిలిచి మోడీ ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు, రైతుసంఘం నాయకులు కె అశ్విరాధం, డి శ్రీనివాసరావు, జి దానియేలు, వై కిషోర్, ఎం వెంకటేశ్వరావు, ఆగస్టిన్ పాల్గొన్నారు

➡️