బిజెపి ఎంపి ఆరోపణలు – టిఎంసి నేత మహువా ఇంట్లో సిబిఐ సోదాలు

కోల్‌కతా : తఅణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపి మహువా మొయిత్రా పై బిజెపి ఎంపి నిషికాంత్‌ దుబే చేసిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోడిని లక్ష్యంగా చేసుకునేలా పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి మహువా రూ.2 కోట్లతోపాటు ఖరీదైన బహుమతులు తీసుకున్నారంటూ … బిజెపి ఎంపి నిషికాంత్‌ దుబే ఫిర్యాదు చేశారు. దీంతో కోల్‌కతాలోని మహువా మొయిత్రా నివాసంలో, ఇతర నగరాల్లో ఆమెకు చెందిన కార్యాలయాల్లోనూ సిబిఐ అధికారులు సోదాలు చేపట్టారు.

లోక్‌సభలో బహిష్కరణ వేటు…
బిజెపి ఎంపి నిషికాంత్‌ దుబే ఇచ్చిన ఫిర్యాదు మేరకు… మహువాపై దర్యాప్తు చేపట్టాలని, ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని సిబిఐని లోక్‌పాల్‌ ఆదేశించింది. దీంతో గత గురువారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఈరోజు తనిఖీలు నిర్వహించింది. బిజెపి ఎంపి ఫిర్యాదుపై విచారణ చేపట్టామని తెలిపిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ…. మహువా అనైతిక ప్రవర్తనకు, సభా ధిక్కరణకు పాల్పడ్డారని నిర్థారించింది. ఈ నివేదిక ఆధారంగా గతేడాది డిసెంబరులో స్పీకర్‌ బహిష్కరణ వేటు వేయడంతో మహువాకు లోక్‌సభ సభ్యత్వం రద్దయింది.

మహువా తీవ్ర ఖండన…
బిజెపి ఎంపి ఆరోపణలను, తనపై స్పీకర్‌ వేసిన బహిష్కరణ వేటును మహువా తీవ్రంగా ఖండించారు. లోక్‌ సభలో బహిష్కరణ వేటుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా … ఇదే వ్యవహారానికి సంబంధించిన విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనల ఉల్లంఘన కేసులో ఈడీ మహువాకు సమన్లు జారీ చేసింది.

➡️