వైసిపి పాలనలో బిసిలు బతకాలంటే భయపడే పరిస్థితులు : మాజీ మంత్రి కొల్లు

Jan 30,2024 10:38 #Comments, #kollu raveendra, #YCP

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి పాలనలో బిసిలు బతకాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లా వెల్ధురి మండలం బంగారుపెంట గ్రామానికి చెందిన మత్స్యకారుడు చెవిటిపల్లి దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇతని మరణానికి జగన్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. తెలం గాణ నుంచి మద్యం తీసుకొస్తున్నాడని అక్రమ కేసు పెట్టారని, అనంతరం వైసిపిలో చేరుతావా? చేరవా? అంటూ బెదిరించారని అన్నారు. పోలీసులు బెదిరింపుల వల్లే మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. పల్నాడు జిల్లాలో చంద్రయ్య టిడిపిలో బ్రహ్మానందరెడ్డికి తోడుగా ఉన్నాడని అతనిపై వేధింపులకు దిగారన్నారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన మత్స్యకార మహిళ పద్మ వైసిపిలో చేరలేదని వివస్త్రను చేసి వేధించారన్నారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. అలాగే విజయవాడకు చెందిన బొందల అనే బిసి సామాజిక తరగతికి చెందిన రాంసింగ్‌ అనే ఆర్‌టిసి బస్సు డ్రైవర్‌ హారన్‌ కొట్టాడని నడి రోడ్డుపై దారుణంగా చితక బాదారని గుర్తు చేశారు. రేపల్లెలో పదోతరగతి చదివే బిసికి చెందిన అమర్‌నాథ్‌గౌడ్‌ అనే యువకుడు తన అక్కను వేధించవద్దని చెప్పినందుకు పెట్రోల్‌ పోసి తగులబెట్టారన్నారు. విజయనగరం జిల్లాలో కృష్ణ అనే ఉపాధ్యాయుడును దారుణంగా హత్య చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. బిసి కార్పొరేషన్‌ నుంచి ఒక్కపైసా సహాయం చేయలేదని, బిసిలకు హక్కుగా రావాల్సిన పథకాల్ని అణగదొక్కారని విమర్శించారు. వైసిపి సభలకేనా బస్సులు: ఆర్‌టిసి ఎమ్‌డికి వర్ల రామయ్య లేఖవైసిపి రాజకీయ సభలకు బస్సులు పంపు తున్న ఆర్‌టిసి యాజమాన్యం, టిడిపి సభలకు ఆర్‌టిసి బస్సులు అద్దెకు ఇవ్వకపోవడానికి కారణాలేంటని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ మేరకు ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావుకు ఆయన లేఖ రాశారు. భీమునిపట్నంలో జరిగిన వైసిపి సభకు ఎన్ని బస్సులు పంపారు? పంపిన బస్సులకు చెల్లింపులు ఏ లెక్కన ఛార్జ్‌ చేశారు? ఆర్‌టిసి నిర్ణయించిన రేట్ల ప్రకారం వైసిపి అద్దెను చెల్లించిందా? చెల్లిస్తే ఏ విధానంలో (మోడ్‌ ఆఫ్‌ పేమెంట్‌) ఎంత, ఎవరి పేరు మీద చెల్లించారో వంటి వివరాలు వెల్లడించాలని వర్ల రామయ్య లేఖలో కోరారు.

➡️