BBC: భారత్ లో న్యూస్ రూమ్ ను మూసేసిన బిబిసి

Apr 7,2024 12:00 #BBC, #BJP Govt

ఢిల్లీ : భారతదేశంలో తన న్యూస్ రూమ్ ను బిబిసి మూసివేసింది. ఆదాయపు పన్ను శాఖ నిరంతర దాడులు, విచారణల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. బిబిసి యొక్క ప్రచురణ లైసెన్స్‌ను భారతీయ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బదిలీ చేసినట్లు బిబిసి ప్రకటించింది. ఉద్యోగులతో కలెక్టివ్ న్యూస్ రూం పేరుతో దేశంలో ప్రసారాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. పబ్లిషింగ్ లైసెన్స్‌ను మరో సంస్థకు అప్పగించడం తన చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొంది. జర్నలిజంలో రాజీపడబోమని బిబిసి స్పష్టం చేసింది.

2002 గుజరాత్ మారణహోమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రను బట్టబయలు చేసిన ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీ ప్రసారమైన తర్వాత  ఢిల్లీ, ముంబైలలోని బిబిసి కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఆపై ఉల్లంఘనను గుర్తించి నోటీసు జారీ చేసింది. గత ఫిబ్రవరిలో బిబిసి 2002 గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీని ప్రసారం చేసింది, అయితే కేంద్ర ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీ ప్రసారాన్ని నిషేధించింది. గుజరాత్ అల్లర్లలో నరేంద్ర మోడీ పాత్రను నిక్కచ్చిగా వివరించిన డాక్యుమెంటరీ చాలా చర్చనీయాంశమైంది. ఏడాది కాలంగా ప్రతీకార చర్య కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బిబిసి భారత్‌లోని న్యూస్‌రూమ్‌లను మూసివేయాలని నిర్ణయించింది. బిబిసి మే 1940లో భారతదేశంలో ప్రసారాన్ని ప్రారంభించింది. హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం మరియు తెలుగు భాషలలో బిబిసి ఇండియా పనిచేస్తుంది.

➡️