మౌలిక సదుపాయాల కు నోచుకోని అయ్యప్పనగర్

Apr 4,2024 16:32 #Vizianagaram

తాగునీరు కోనుక్కోవల్సిందే
కాలువలు లేక రోడ్డుపై పారుతున్న మురికినీరు

ప్రజాశక్తి- విజయనగరం టౌన్ : అయ్యప్పనగర్ లో సుసుమారుగా రెండు వేలకు పైగా కుటుంబాలు నివాసముంటున్నాయి. వీటిల్లో  ఎక్కువుగా రియలస్టర్లు, బిల్డర్లు దగ్గర కనుక్కొన్న నివాసాలే అధికం. ఈ  నివాసాలను అమ్మకాలు చేసింది కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలు కి చెందిన అనుయాయులే. అయ్యప్ప నగర్ కాలనీ ఏర్పడి దాదాపు 20 ఏళ్లు దాటుతున్నా నేటికీ మౌలిక సదుపాయాల కు అక్కడి వాసులు నోచుకోలేదు. ఎన్నికల సమయంలో రోడ్లు, కాలువలు వేయిస్తామని తెలుగుదేశం, వైసిపి పార్టీలకు చెందిన నేటి పాలకులు, నాటి పాలకులు ఇరు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కాలనీ సమస్యలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వహించారు. పోరాడితే తప్ప, ఇద్దరు ప్రాణాలు కోల్పోయి,మరి కొంతమంది రోడ్డు ప్రమాదాలకు గురైతే తప్ప స్పీడ్ బ్రేకర్స్ వెయ్యని పాలకులు. ఉదయం లేచిన నుంచి నగరాభివృద్ధి మా ధ్యేయం అని ఇంతకాలం చెప్పుకున్న పాలకవర్గాలు వాస్తవానికి అయ్యప్ప నగర్ కాలనీ వాసులు సమస్యలు పరిష్కారం చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నారు అనడానికి ప్రస్తుత పరిస్తితి అందుకు నిదర్శనంగా ఉంది. భూములు, ఇల్లు, అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకుంటున్న పాలకులకు చెందిన వ్యక్తులు వారి వ్యాపారం పూర్తి అయిన తర్వాత పట్టించుకునే పరిస్తితి లేదు.దీంతో అయ్యప్ప నగర్ కాలనీ వాసులు నేడు తాగునీరు లేక నీటిని డబ్బులిచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు. వాటర్ ట్యాంక్ కట్టిస్తామని చెప్పిన ప్రస్తుత పాలకులు ట్యాంక్ నిర్మాణం చెయ్యడం మర్చిపోయారు. కాలువలు లేవు. 2006 సంవత్సరంలో వేసిన రోడ్లు తప్ప నేటికీ కొత్త రోడ్లు లేవు. దీంతో కాలనీలో రోడ్లు రాళ్ళు తేలి ప్రమాదాలకు నిలయంగా మారాయి. అయ్యప్ప నగర్ లో ఉన్న మోడల్ స్కూల్ విద్యార్దులు పాడైన రోడ్లు కారణంగా రోజు సైకిల్ మీద వెళ్ళేవారు పడిపోవడం, దెబ్బలు తగలడం వంటివి జరుగుతున్నాయి.

రోడ్డు మీదే మురికి నీరు
మరో వైపు కాలనీలో కాలువలు లేకపోవడం వలన అపార్ట్మెంట్లు లోని మురుగు నీరు, కాలనీ వాసులు ఇళ్ళ నుంచి వచ్చే మురికినీరు రోడ్డు మీద నుంచే పారుతుంది. కొన్ని అపార్ట్మెంట్లు నివాసితులు ఇంకుడు గుంతలు తీసుకొని మురికినీరు గుంతల్లో కి వెళ్ళే విధంగా చేస్తున్నారు. అయితే కాలనీవాసుల మురికి నీరు రోడ్డు మీద పారడం వలన మురికి నీటి పైన వాహనాల రాకపోకలు,  మనుషులు కూడా నడుస్తున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అయ్యప్ప నగర్ లో పార్కు
అయ్యప్ప నగర్ లో ఉన్న పార్కు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మందు బాబులతో పాటు, అనేకమైన అసాంఘిక కార్యకలాపాలకు నివాసం గా మారింది. చీకటి పడితే చాలు పార్కు వైపు వెళ్ళాలంటే పురుషలతో పాటు, స్త్రీలు భయపడుతున్నారు.

చాలీచాలని వీధి లైట్లు యదేచ్ఛగా దొంగతనాలు.
అయ్యప్ప నగర్ లో వేలాది కుటుంబాలు ఉన్నప్పటికీ అక్కడి వారంతా మద్య తరగతికి చెందినవారు. ఉదయం పది గంటల తర్వాత ఉద్యోగాలు,వివిధ పనులకు వెళ్లిపోతుంటే ఇదే అదునుగా చూసుకొని వారి ఇళ్లల్లో  పట్టపగలు దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలు రాత్రి వేళ తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా  చేసుకుని  వారి పని వారు చేసుకుంటున్నారు.

తాగునీరు సరఫరా చేయాలి
అయ్యప్ప నగర్ లో ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రతి ఇంటి వాళ్ళు కేన్లుతో నీటిని కొనుక్కోవడం తప్ప నీరు నగర పాలక సంస్థ నుంచి మాకు రావడం లేదు. తాగునీరు అందించి మా దాహాన్ని తీర్చాలని ఆయన కోరారు.

నూకల.సుధీర్, అయ్యప్ప నగర్ కాలనీ కార్యదర్శి 

రోడ్లు,కాలువలు వేసి మురికి కూపం నుంచి కాపాడండి

అయ్యప్ప నగర్ కాలనీ ఏర్పడి ఇరవెల్లూ అయినా నేటికీ కనీస సౌకర్యాలు రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, వంటి సౌకర్యాలకు నోచుకోలేదని అన్నారు. ఎన్నికల సమయంలో రావడం తర్వాత మా కాలనీ గురుంచి మర్చిపోవడం జరుగుతుందన్నారు. మా కాలనీ సమస్యలు పరిష్కారం చేసి మాకు న్యాయం చేయాలని కోరారు.

యు ఎస్ రవికుమార్, అయ్యప్ప నగర్ కాలనీ వాసి.

➡️