రాష్ట్రపతి నేతృత్వంలో ‘అయోధ్య’ వేడుక : ఉద్ధవ్‌ థాకరే డిమాండ్‌

ముంబయి : అయోధ్యలోని రామాలయంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ట వేడుకను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిపించాలని శివసేన (యుబిటి) చీఫ్‌ ఉద్దవ్‌ థాకరే శనివారం డిమాండ్‌ చేశారు. అయితే ఆలయ ట్రస్టు ఆమెను అతిథిగా ఆహ్వానించింది. ఈ వేడుక ప్రధాని మోడీ నేతృత్వంలో సాగుతున్న సంగతి విదితమే. అయోధ్యలో రామాలయ నిర్మాణం జాతి గర్వించదగ్గ విషయని ఉద్ధవ్‌ అన్నారు. దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ వేడుకను రాష్ట్రపతితో నిర్వహించాలని కోరారు. గుజరాత్‌లో సోమనాథ ఆలయాన్ని పునరుద్ధరించినపుడు కూడా దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌తో లాంఛనంగా పునరుద్ధరణ కార్యక్రమాన్ని నిర్వహించారని ఉద్ధవ్‌ గుర్తు చేశారు. నాసిక్‌లోని కాలారామ్‌ ఆలయానికి ముర్మును ఆహ్వానిస్తామని చెప్పారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగే రోజునే ఆయన కాలారామ్‌ ఆలయాన్ని సందర్శించనున్నారు.

➡️