మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి

Mar 28,2024 05:05 #Jeevana Stories

ప్రస్తుత సమాజంలో మనిషి జీవితం గడియారంతో పరుగెత్తాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మనశ్శాంతిగా గడిపే క్షణాలు వేళ్లమీద లెక్కపెట్టుకోవచ్చు. ప్రతి క్షణం ఉద్యోగం, వ్యాపారం, చదువులు, పోటీ పరీక్షలు ఇలా ప్రతి ఒక్కరి మెదడులో ఏదో ఒక టెన్షన్‌ నిరంతరం రక్తప్రసరణతో వేగంగా పరుగెడుతుంది. ప్రతి ఒక్కరిలో శారీరక శ్రమ కంటే మానసిక శ్రమ అధికమైంది. అలాంటి మానసిక ఆలోచనలు జయించడానికి మెదడు ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. అలాంటప్పుడు మెదడును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది.
టెన్షన్‌ జీవితం మెదడుకు పెను ప్రమాదంగా మారుతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిని మార్చుకుని కాస్త ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. లేదంటే తీవ్రమైన బ్రెయిన్‌ స్ట్రోక్‌, పక్షవాతం (పెరాలసిస్‌), మూర్చవ్యాధి (ఫిట్స్‌), తలనొప్పి (మైగ్రేన్‌), మూతి వంకరపోవటం, వెన్నుపూస సమస్యలు (మెడనొప్పి, నడుమునొప్పి), తిమ్మిర్లు, అరికాళ్ల మంటలు, వణుకుడు, కంపవాతం, నరాల బలహీనత, నీరసం, తలతిరగటం, తూలటం, కాళ్లు లాగుట, కాళ్లు గుంజటం, స్పృహకోల్పోవటం, మానసిక, నిద్ర వంటి సమస్యలు వస్తుంటాయి.
పక్షవాతానికి నాణ్యమైన వైద్యం
పక్షవాతం వచ్చిన వ్యక్తికి ఆరు నుంచి ఎనిమిది గంటల్లోపు ఇంజక్షన్‌ ద్వారా వెంటనే నయం చేయటానికి అవకాశం ఉంది. మెదడులోని నరాల్లో రక్తం గడ్డ కట్టి ఉంటుంది. ఐవి థాంబోలైసిస్‌ ద్వారా ఆ గడ్డను కరిగించటం లేదా పూర్తిస్థాయిలో మెకానికల్‌ థ్రోంబెక్టమీ (మెదడుకు వైర్‌ పాస్‌ చేసి) క్లాట్‌ను తీసేయొచ్చు. తద్వారా మెదడుకు రక్త ప్రసరణ జరుగుతుంది. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మెదడులో ఉండే గడ్డను తొలగించడానికి ఆపరేషన్‌ కూడా చేయాల్సి వస్తుంది. తద్వారా ప్రాణాన్ని కాపాడొచ్చు. కానీ నేటికీ అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. పల్లెల్లో పసరు పోయించుకుంటుంటారు. అలా చేస్తే సమస్యలు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు. ప్రతి ఒక్కరి ప్రాణం విలువ ఖరీదైనదే. అందువల్ల మెదడు సమస్యలు నిర్లక్ష్యం చేయొద్దు.


మెదడుకు స్టంట్‌ సరికొత్త విధానం
సాధారణంగా గుండె సమస్యలకు మాత్రమే స్టంట్‌ వేస్తుంటారు. కానీ మెదడు సమస్యలను తగ్గించాలంటే దానికి స్టంట్‌ వేయాల్సివుంది. అప్పుడే ఆ తరహా వ్యాధులు తగ్గుతాయి. న్యూరాలజీ శస్త్ర చికిత్సలో ఐసియు, న్యూరో సర్జరీ ఐసియు, బెయిన్‌ స్ట్రోక్‌ యూనిట్‌, వెంటిలేటర్‌ ఫెసిలిటీస్‌, ఫీట్స్‌ ఇఇజి, నరాల సమస్యలకు నర్వ్‌ స్టడీ వంటివి కీలకమైనవి. బ్రెయిన్‌ స్టంట్లు వేయటం సరికొత్త పద్ధతి. ఈ చికిత్సల ద్వారా రోగులు చక్కగా తమ జీవితాన్ని కొనసాగించుకోవచ్చు. మెదడు సమస్యలను ప్రారంభంలోనే గుర్తిస్తే తగ్గించటం కూడా సులభమే అవుతుంది. ముదిరిన తర్వాత తగ్గాలంటే కొంత సమయం పడుతుంది.
జీవనశైలే అనారోగ్యాలకు కారణం
40 ఏళ్ల కిందట ఉండే శారీరక శ్రమ, నాణ్యమైన ఆహారం, సరైన సమయానికి నిద్ర, అధిక ఒత్తిళ్లు లేని జీవితాన్ని గడిపిన పూర్వీకులు 80 ఏళ్ల పైన ఆరోగ్యంగా జీవించారు. ప్రస్తుతం జంక్‌ పుడ్‌ తీసుకోవడం, మద్యపానం, ధూమపానం అధికమవ్వడం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వీటిని అధిగమించి కల్తీ లేని ఆహారం తీసుకోవటం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఎక్కువ సేపు కూర్చోకుండా తగిన శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యాన్ని పొందొచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
– పాన్‌, జర్దా, గుట్కా, మద్యపానం, ధూమపాన్ని ఆపేయాలి
– కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను అతిగా తీసుకోవద్దు
– రక్తపోటు, షుగర్‌ను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలి. ఎక్కువగా ఉంటే నియంత్రణా పద్ధతులు పాటించాలి.
– కుటుంబంలో ఎవరికైనా పక్షవాతం ఉంటే ముందుగా చెక్‌ చేయించుకోవాలి
– మెదడు సమస్యలు ఉన్నట్లుగా తెలిసినా, చేతులు, కళ్లు తిమ్మిర్లు, మాటలు తడబడటం, నడవడంలో తేడాలు ఉండే వైద్యుడిని సంప్రదించాలి
– ఎక్కువ సేపు ఎక్కడా కూర్చోవద్దు. శారీరక శ్రమ చేయటానికి ప్రయత్నించాలి
– మెదడుకి వచ్చే సమస్యలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిరంతరం జాగ్రత్తగా ఉండాలి.

-డాక్టర్‌ బి.జి.రోహిత్‌
ప్రముఖ న్యూరాలజిస్ట్‌, ఆర్‌ఆర్‌ ఆసుపత్రి, కర్నూలు,
సెల్‌ : 8309166593

➡️