క్యారీ కేక..

Mar 11,2024 21:09 #Australia, #Cricket, #Newzland, #test match, #win
  • చివరి టెస్ట్‌లో రెండు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం
  • సిరీస్‌ 2-0తో కైవసం

క్రైస్ట్‌చర్చ్‌: ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ మరో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో, చివరి టెస్టులో 98పరుగులతో అజేయంగా నిలిచి ఆసీస్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ నాలుగు వికెట్ల నష్టానికి 77పరుగులతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ మరో మూడు పరుగులు జతచేసి 80 పరుగుల వద్ద ట్రివిస్‌ హెడ్‌ వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత 6వ వికెట్‌కు క్యారీ(98 నాటౌట్‌), మిఛెల్‌ మార్ష్‌(80) కలిసి 140పరుగులు జతచేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. చివర్లో కమిన్స్‌(32 నాటౌట్‌) సంచలన ఇన్నింగ్స్‌తో రాణించడంతో ఆసీస్‌ మరో రెండు వికెట్లు చేతిలో ఉండగానే గెలిచింది. దాంతో, ఆస్ట్రేలియా చేతిలో న్యూజిలాండ్‌ వరుసగా 10 టెస్టుల్లో ఓటమి పాలైంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది అలెక్స్‌ క్యారీకి, సిరీస్‌ హెన్రీకి లభించాయి. దీంతో రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో చేజిక్కించుకొని క్లీన్‌స్వీప్‌ చేసింది.

➡️