పశ్చిమాసియా అంతటా దాడులు

Feb 6,2024 11:13 #yeman
  • యెమెన్‌ పోర్టు సిటీ ధ్వంసం
  • 30 మంది మృతిశ్రీ ఐరాస నియమావళికి విరుద్ధం
  • అమెరికా, బ్రిటన్‌ దాడులపై ఇరాన్‌,చైనా

సనా: పాలస్తీనాపై యూదు దురాక్రమణదారుల దాడులు ఇప్పుడు పశ్చిమాసియా అంతటికీ విస్తరిస్తున్నాయి. యూదు దుర్హంకార ఇజ్రాయిల్‌కు ఆయుధాలు, డబ్బు ఇస్తూ యుద్ధాన్ని ఎగదోస్తున్న అమెరికా, బ్రిటన్‌లు దీనిని పశ్చిమాసియా ప్రాంత యుద్ధంగా మార్చాలని చూస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇరాక్‌, సిరియా, యెమెన్‌లపై దాడులు చేస్తున్న అమెరికా, బ్రిటన్‌ ఇప్పుడు వాటిని మరింత తీవ్రతరం చేశాయి. యెమెన్‌ రాజధాని సనాలోని పోర్టు సిటీపై ఆదివారం రాత్రి పెద్దయెత్తున బాంబుల వర్షం కురిపించాయి. ఏడు ప్రదేశాల్లోని 85 కేంద్రాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో 30 మంది చనిపోయారు. సిరియాలోని 4 ఇరాక్‌లోని ఇస్లామిక్‌ రివల్యూషనరీగా కోస్ట్‌గార్డు (ఇరాన్‌ ఆర్మీ) స్థావరాలపై దాడి చేసినట్లు అమెరికన్‌ సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. గత వారం ఇరాన్‌ అనుకూల మిలీషియా గ్రూపులు జోర్డాన్‌లోని అమెరికన్‌ టవర్‌-22పై జరిగిన దాడిలో ముగ్గురు అమెరికన్‌ సైనికులు చనిపోగా 40 మంది దాకా గాయపడ్డారు. దీనిని సాకుగా చూపి అమెరికా అన్ని అంతర్జాతీయ నియమాలను తుంగలో తొక్కి పెద్దయెత్తున వైమానిక దాడులకు తెగబడింది. అమెరికా, బ్రిటన్‌ చర్యను ఇరాన్‌, చైనా, రష్యా తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇవి ఐరాస నియమావళికి విరుద్ధమని వ్యాఖ్యానించాయి. సంక్షోభ కేంద్ర భిందువు నుండి ప్రజల దృష్టిని మళ్లించే వికృత ప్రయత్నంగా ఇరాన్‌ పేర్కొంది. ఇదిలా వుండగా గాజాపై ఇజ్రాయిల్‌ ఏకపక్షంగా సాగిస్తున్న యుద్ధం అయిదో నెలలోకి ప్రవేశించింది. రఫా ప్రాంతంపై పెద్దయెత్తున దాడులకు ఇజ్రాయిల్‌ తెగబడుతోంది. ఇజ్రాయిల్‌ సృష్టిస్తున్న మారణ హోమానికి ఇంతవరకు 27, 478 మంది పాలస్తీనీయులు చనిపోయారు. ఇప్పుడు ఈ దాడులు పాలస్తీనాకే పరిమితం కాలేదు. ఇతర అరబ్‌ దేశాలకు కూడా పాకాయి. కాల్పుల విరమణ తక్షణమే ప్రకటించాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి తెస్తున్నా అమెరికా, బ్రిటన్‌ ఖాతరు చేయడం లేదు. కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య ఒక ఒప్పందం సాధించేందుకు అంతర్జాతీయ దౌత్యాధికారులు యత్నాలను ముమ్మరం చేశారు. పారిస్‌లో జరిగిన సమావేశంలో ఈ విషయమై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. కాల్పుల విరమణ ఒప్పంద ప్రతిపాదనల్లో అస్పష్టమైన అంశాలే ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి దీనిని క్షుణ్ణంగా పరిశీలించాకే తమ వైఖరిని తెలియజేస్తామని హమాస్‌ తెలిపింది.

➡️