కేడీల పాలనలో రైతున్నలకు బేడీలు

atchannaidu on amaravati protest 1500days

1500 రోజుల పాటు రాజధాని కోసం ఉద్యమించిన చరిత్ర అమరావతి రైతులకే దక్కుతుంది
– కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-అమరావతి : రాజధాని కోసం పోరాడుతున్న రైతున్నలకు కేడీల పాలనలో బేడీలు వేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి జనవరి 25 నాటికి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం నిర్మించ తలపెట్టిన అమరావతిని పూర్తి చేయలేని పాలకులు మూడు రాజధానులంటూ రాష్ట్రం పరువు తీశారన్నారు. ఏపీకి రాజధాని ఏది? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను దిగజార్చారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో ఉద్యమాన్ని అణగదొక్కేందుకు, రైతుల గొంతు నొక్కేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేయని అరాచకాలు లేవని ఆగ్రహించారు. రాజధాని కోసం రైతులు పాదయాత్ర చేపడితే జగన్ రెడ్డి దానిని విధ్వంసం చేసి ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని తెలిపారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం మొదటి నుండి ప్రయత్నం చేస్తూనే ఉందని, దానిలో భాగంగానే 144 సెక్షన్, పోలీసు చట్టంలో సెక్షన్ 30 వంటివి ప్రయోగించి గ్రామాల్నీ తన గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలకు తెగబడ్డారని పేర్కొన్నారు. ప్రజా రాజధాని అమరావతి కోసం 1500 రోజులుగా ఉధ్యమాలు చేస్తున్న రైతులు, మహిళలు పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానాలకు గురి చేశారని తెలిపారు. రాజధాని మహిళల కట్టుబొట్టులపై కూడా విమర్మలకు పాల్పడ్డారని తెలిపారు. పోలీసుల లాఠీ దెబ్బల్ని, హింసాకాండను తట్టుకుని ,మహిళలు, రైతులు ముందు వరుసలో ఉండి అమరావతి ఉద్యమాన్ని నడిపించడం వారి ధీరత్వానికి నిదర్శనమన్నారు. న్యాయ దేవతని నమ్ముకున్న రైతులు హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్ళి వరుస విజయాలు సాధించడం జగన్ రెడ్డికి చెంపపెట్టన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతున్నల మనోభావలను దెబ్బతీసేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. అమరావతి పోరాటంలో 275 మంది రైతుల మరణానికి జగన్ కారకులయ్యారని తెలిపారు. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుందన్నట్లుగా 151 సీట్లు వచ్చాయని విర్రవీగుతున్న జగన్ కి ఒక్క అమరావతి అంశంతోనే మట్టికరవడం తధ్యమని హెచ్చరించారు.

➡️