ఈడి సమన్లు చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితం : కేజ్రీవాల్‌

 న్యూఢిల్లీ   :    ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) పంపిన సమన్లపై గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పందించినట్లు ఆప్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఆ సమన్లు చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితమని ఈడికి లేఖ రాసినట్లు తెలిపాయి. అలాగే సమన్లను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ‘ఈ సమన్లు స్వీకరించడానికి నేను సిద్ధం. కానీ, గతంలో ఇచ్చిన వాటిలాగా ఈ సమన్లు కూడా చట్టవిరుద్ధం, రాజకీయంగా ప్రేరేపితమైనవి. వీటిని ఉపసంహరించుకోవాలి. నేను నిజాయతీ, పారదర్శక జీవితాన్ని గడుపుతున్నాను. నా జీవితంలో దాచడానికి ఏమీ లేదు. చట్టబద్ధమైన సమన్లకు స్పందిస్తాను” అని కేజ్రీవాల్‌ తన సమాధానంలో పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

డిసెంబర్‌ 21న కేజ్రీవాల్‌ ఈడి ఎదుట విచారణకు హాజరుకావాల్సి వుంది. అయితే పంజాబ్‌లోని విపాసనలో పదిరోజులపాటు నిర్వహించే ధ్యానంలో పాల్గొనేందుకు  బుధవారం ఢిల్లీని విడిచి వెళ్లినట్లు ఆప్‌ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం ముఖ్యమంత్రి మంగళవారమే విపాసనకు వెళ్లాల్సి ఉంది. అయితే, ‘ఇండియా’ ఫోరం సమావేశానికి హాజరయ్యారు. తమ న్యాయవాదులు నోటీసుల్ని పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో నవంబర్‌ 2న ఈడి సమన్లు జారీ చేసింది. అయితే మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లడంతో విచారణకు హాజరుకాలేదు.

➡️