ప్రజాసాంస్కృతిక విప్లవాన్ని కళాకారులు ముందుకు తీసుకెళ్లాలి

Jan 25,2024 08:18 #cpm v srinivasarao, #Lenin
  • వామపక్ష నేతలు
  • అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు

ప్రజాశక్తి-విజయవాడ : ప్రజలను ప్రజా సాంస్కృతిక విప్లవం వైపు మళ్లించడానికి కళాకారులు ముందుకు రావాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. సోషలిస్టు వ్యవస్థాపకులు విఐ లెనిన్‌ శత వర్ధంతి సందర్భంగా విజయవాడలోని లెనిన్‌ విగ్రహం వద్ద బుధవారం ఆట-పాట- మాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు.

కార్యక్రమానుద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ… కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాభివృద్ధిని, ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తూ ఓట్ల కోసం మతాన్ని రాజకీయాల చుట్టూ తిప్పుతోందని విమర్శించారు. మోడీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అయోధ్యలో రామమందిరాన్ని రాజకీయ రంగం మీదకు తీసుకొచ్చారని తెలిపారు. అభివృద్ధి నిరోధక విధానాలను అవలంభిస్తోన్న మోడీ విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు అన్ని విషయాలలోనూ ప్రధాని మోడీ వద్ద సాగిలపడుతున్నారని విమర్శించారు. అయోధ్యలో రామ దర్శనం కోసం కాకుండా ప్రధాని మోడీ చూపుల కోసం టిడిపి అధినేత చంద్రబాబు పరితపించారని, రామ భజన కాకుండా మోడీ భజన చేసే స్థాయికి దిగజారి పోవడం రాష్ట్ర ప్రజలు సిగ్గుపడే రీతిలో వ్యవహరించాడని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. పరిపాలన, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమంలో ఘోరంగా విఫలమైన మోడీ దేశ ప్రజల ఆలోచనను దారి మళ్లించేందుకు మతాన్ని రాజకీయాల చుట్టూ తిప్పుతున్నారని తెలిపారు. దేశంలో ఏడు శాతంగా ఉన్న అంబానీ, ఆదానీ వంటి కార్పొరేట్ల కోసం పరితపిస్తూ తీవ్ర సంక్షోభంలో ఉన్న 93 శాతం ప్రజలను మోడీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. ప్రమాదంలో పడిన దేశ భవిష్యత్‌ కోసం వామపక్ష, అభ్యదయ, ప్రజాతంత్రశక్తులు ఏకం కావాలని కోరారు. ఇఫ్టూ రాష్ట్ర కార్యదర్శి ప్రసాదరావు మాట్లాడుతూ… లెనిన్‌ను సామాజిక పరివర్తనకు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అహ్వానితులందరికీ కమ్యూనిస్టు ప్రణాళిక బుక్‌ను శ్రీశ్రీ ప్రింటర్స్‌ అధినేత విశ్వేశ్వరరావు అందజేశారు.

ప్రజాశక్తి బుకహేౌస్‌ మేనేజర్‌ కె లక్ష్మయ్య, విశాలాంధ్ర బుకహేౌస్‌ మేనేజర్‌ టి మనోహర్‌నాయుడు, సాహితీ కళాపోషకులు గోళ్ల నారాయణరావు, బుడ్డిగా జమిందార్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ అనిల్‌కుమార్‌, సీనియర్‌ గాయకులు ఎ జగన్‌, జిల్లా కార్యదర్శి పి అప్పన్న, ఎస్‌కె అనిఫ్‌, ఎపిపిఎన్‌ఎం రాష్ట్ర అధ్యక్షులు పి చంద్రనాయక్‌ పలు విప్లవగేయాలను ఆలపించారు. అనంతరం పలు జానపదగేయాలకు చిన్నారులు చేసిన నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ నర్సింగ్‌రావు, కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి మల్యాద్రి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పాల్గొన్నారు.

➡️