ప్రముఖ కళా చరిత్రకారులు బిఎన్‌ గోస్వామి ఇకలేరు

Nov 18,2023 09:48 #Art historian, #BN Goswami

 

న్యూఢిల్లీ : ప్రముఖ కళా చరిత్రకారులు బిజిందర్‌ నాథ్‌ గోస్వామి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోస్వామి చండీగఢ్‌లో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కళారంగంలో బిఎన్‌జిగా సుప్రసిద్ధులైన గోస్వామి 1933 ఆగస్టు 15న సర్గోధ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)లో జన్మించారు. పహారీ స్టైల్‌ పెయింటింగ్స్‌లో చేసిన కృషితో ప్రపంచం దృష్టిని ఆయన ఆకర్షించారు. 1958లో అప్పటి వరకూ మూడేళ్లపాటు పనిచేసిన ప్రతిష్టాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌ను విడిచిపెట్టి కళారంగంలోకి ప్రవేశించారు. కాంగ్రా పెయింటింగ్స్‌పై మూడేళ్లపాటు పరిశోధన చేసి పిహెచ్‌డి చేశారు. టంక్రి పహారి లిపిని నేర్చుకున్నారు. తరువాత సూక్ష్మ చిత్రాల శాసనాలు, భూమి రికార్డులు పునర్‌లిఖించడంపై ఒక నమూనాను అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్‌ గోస్వామి 26 కంటే ఎక్కువ పుస్తకాలను రచించారు. ది స్పిరిట్‌ ఆఫ్‌ ఇండియన్‌ పెయింటింగ్‌, వండర్‌ ఆఫ్‌ ది ఏజ్‌-మాస్టర్‌ పెయింటర్స్‌ ఆఫ్‌ ఇండియా 1100-1900.. వంటి పుస్తకాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. కళల పట్ల సున్నితమైన అభిప్రాయం ఉన్న తరాన్ని తయారు చేసే ప్రాముఖ్యతను గోస్వామి తరచూ ప్రస్తావించేవారు. పద్మశ్రీ, పద్మ భూషణ్‌ వంటి అవార్డులతో భారత ప్రభుత్వం గోస్వామిని సత్కరించింది. ఐఎఎస్‌ను విడిచిపెట్టి మరీ జీవితకాల పరిశోధన, విద్యావేత్తలను తయారు చేయడాన్ని కొనసాగించిన బిఎన్‌ గోస్వామి అభిరుచి, అంకితభావాన్ని కళా ప్రపంచం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని ప్రముఖులు నివాళులర్పించారు.

➡️