అక్రమ అరెస్టులకు వామపక్షాల ఖండన

Jan 3,2024 22:02 #Anganwadi strike

అక్రమ అరెస్టులకు వామపక్షాల ఖండన

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సమస్యల పరిష్కారం కోసం ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్దకు శాంతియుతంగా వస్తున్న వందలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శులు వై సాంబశివరావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్‌ నాయకులు జాస్తి కిషోర్‌బాబు, ఎంసిపిఐయు నాయకులు కాటం నాగభూషణం, సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు ఎన్‌ మూర్తి, ఎస్‌యుసిఐసి నాయకులు బిఎస్‌ అమర్‌నాథ్‌, ఫార్వార్డ్‌బ్లాక్‌ నాయకులు పివి సుందరరామరాజు, ఆర్‌ఎస్‌పి నాయకులు జానకి రాములు బుధవారం ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. అంగన్‌వాడీల అరెస్టులపై నిరసన తెలపడానికి వెళ్లిన ట్రేడ్‌ యూనియన్‌, సిపిఎం నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేయాలని, వారితో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అరెస్టయినవారిలో అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ, మంజులతోపాటు సుమారు 1000 మందిని వివిధ పోలీసు స్టేషన్లలో పెట్టారని తెలిపారు. 22 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. పైగా జనవరి 5వ తేదీలోగా విధుల్లో చేరకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్యేల, మంత్రుల ఇళ్లకు వెళ్లి విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో అంగన్‌వాడీలు ఆందోళన ఉధృతం చేస్తున్నారని, అందులో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాపితంగా వేలాది మంది కలెక్టరేట్ల వద్ద బైఠాయించారని వివరించారు. న్యాయమైన కోర్కెలు, సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధానికి దిగడం వల్ల వచ్చే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

 

 

➡️