‘తెలం’పై మితవాద జేవియర్‌ ఉక్కుపాదం .. వెల్లువెత్తిన కార్మికుల నిరసన

 బ్యూనస్‌ ఎయిర్స్‌ :    అర్జెంటీనాలోని ఏకైక జాతీయ మీడియా సంస్థ ‘టిఇఎల్‌ఎఎం’ (తెలం)ను మితవాద అధ్యక్షుడు జేవియర్‌ మిలే సోమవారం మూసివేశారు.  ఆ సంస్థ వెబ్‌సైట్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు మిలే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జర్నలిస్టులు, వర్కర్లు ఏడురోజుల పాటు విధుల నుండి తొలగించబడ్డారు.

ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు సోమవారం పిలుపునిచ్చిన నిరసన ప్రదర్శనను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దేశ రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌లోని వార్తాసంస్థ భవనం ముందు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు నిరసన ప్రదర్శనకు టెలం కార్మికులు పిలుపునిచ్చారు. వారికి మద్దతుగా వేలాది మంది ప్రజలు భవనం వద్దకు చేరుకున్నారు. అయితే కార్మికులను, మద్దతుదారులను మిలే ప్రభుత్వపు భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. భవనం చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశాయి. అయినప్పటికీ కార్మికులు వెనుతిరగలేదు. అక్కడే ఉండి  తమ నిరసనను వ్యక్తం చేశారు. సోమవారం అర్థరాత్రి మీడియా సంస్థ భవనాన్ని చుట్టుముట్టారు.

మీడియాపై  నిషేధం  భావప్రకటనా స్వేచ్ఛపై దాడిగా కార్మికులు అభివర్ణించారు.  గత 40 ఏళ్లలో ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛపై ప్రభుత్వ అత్యంత తీవ్రమైన దాడి చేస్తోందని కార్మికులు ఓ బహిరంగ ప్రకటనలో పేర్కొన్నారు.  సమాఖ్య, నిర్దిష్టమైన సమాచారాన్ని అందించే కీలకమైన వార్తా సంస్థపై మిలే ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో తెలం వర్కర్లు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ప్రముఖ జర్నలిస్ట్‌ విక్టర్‌ హుగో మోరాల్స్‌ పేర్కొన్నారు.   వార్తా సంస్థపై నిషేధాన్ని, నియంతృత్వాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

తెలం మీడియాను మూసివేస్తున్నట్లు జేవియర్‌ మిలే గత శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా మాజీ అధ్యక్షుడు క్రిస్టినా ఫెర్నాండెజ్‌ డి కిర్చ్‌నర్‌ విధానాలను ప్రోత్సహిస్తున్నందున తెలం మూసివేస్తామని  అన్నారు. ఈ మీడియా దశాబ్దాలుగా కిర్చ్‌నర్‌ ప్రచార సంస్థగా పనిచేస్తోందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలను సమర్పించలేదు.

కాగా, ఆదివారం అర్థరాత్రి నుండి  తెలం వెబ్‌సైట్‌లో అర్జెంటీనా రక్షణ రంగం ఇమేజ్‌ను ప్రసారం చేయడంతో పాటు ” వెబ్‌సైట్‌ పునర్‌నిర్మాణంలో ఉంది ” అనే శీర్షికను ప్రసారం చేస్తోంది. ఫలితంగా  తెలం గతంలో ప్రచురించిన వేలకొద్దీ వ్యాసాలు, ఫోటోగ్రాఫ్స్‌, వీడియోలు పొందేందుకు అవకాశం లేకుండా పోయింది.

➡️