అరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ : సిపిఎం

Mar 9,2024 10:40 #Araku, #Assembly, #cpm, #Parliament Seats

ప్రజాశక్తి- పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : రానున్న ఎన్నికల్లో అరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో సిపిఎం అభ్యర్థులు బరిలో ఉంటారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం తెలిపారు. ఆదివాసీల సమస్యలపై పోరాడే సిపిఎం గెలుపునకు విజ్ఞులైన ఏజెన్సీ ప్రాంత మేధావులు, నిరుద్యోగులు, ప్రజలు కృషి చేయాలని కోరారు. పాడేరులో శుక్రవారం జరిగిన సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో లోకనాథం మాట్లాడుతూ సిపిఎం అభ్యర్థుల విషయంలో రాష్ట్ర కమిటీ ఫైనల్‌ చేయనుందని చెప్పారు. తమ ప్రాంతం కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఆదివాసీలకు నిరాశే ఎదురైందన్నారు. ఆదివాసీ సమస్యలపై సిపిఎం నిరంతరం పోరాడుతోందని తెలిపారు. ఆదివాసీ నిరుద్యోగులకు స్పెషల్‌ డిఎస్‌సి నిర్వహించాలని, జిఒ నంబర్‌ 3కి ఆర్డినెన్సు తేవాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని, ఆదివాసీ హక్కులను కాపాడాలని కోరుతూ ఈ నెల పదిన తలపెట్టిన ఏజెన్సీ బంద్‌కు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. ఈ బంద్‌ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకమైనదని తెలిపారు. జిఒ నెంబర్‌ 3ని సుప్రీం కోర్టు రద్దు చేసి మూడేళ్లు దాటినా నేటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆదివాసీ ఎమ్మెల్యేలు దిష్టిబొమ్మల్లా మారారని విమర్శించారు. ఏజెన్సీలో పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాలని, పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీలను నిరాశ్రయులుగా మార్చడానికి కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. సిపిఎం పోరాట ఫలితంగా బాక్సైట్‌ మైనింగ్‌ ఆగిన విషయాన్ని గుర్తు చేశారు. కాఫీ, మిరియాలు, అటవీ ఉత్పత్తులకు గిరాకీ ఉన్నా గిరిజన రైతులు మాత్రం నష్టపోతున్నారని, వారికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ మాతృభాష వలంటీర్లను రెన్యువల్‌ చేయాలని కోరారు. రాష్ట్రానికి, ఆదివాసీలకు ద్రోహం చేసిన బిజెపితో టిడిపి, జనసేన జత కట్టడమంటే ఆదివాసీలకు అన్యాయం చేయడమేనని తెలిపారు. ఈ తరుణంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం సిపిఎం కృషి చేస్తోందని చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సురేంద్ర, జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స పాల్గొన్నారు.

➡️