వర్తమాన ఆవిష్కరణ..

Feb 18,2024 08:28 #book review
appagintalu-book-review

ప్రముఖ రచయిత చలపాక ప్రకాష్‌ రచించిన కథా సంపుటే ‘అప్పగింతలు. ఈ పుస్తకంలో మొత్తం 29 కథలున్నాయి. కథలన్నీ విభిన్నంగా ఉన్నాయి. ఈ కథల్లో ముందు వరుసలో.. మొదటి కథ అయిన ‘జీవితం’ గురించి ప్రస్తావించాలి. ఈ కథలో ప్రధానపాత్ర పేరు సుజాతాదేవి. ఆమెకు సాహిత్యంపై ఉన్న మక్కువతో రిటైర్మెంట్‌ తర్వాత పుస్తకాల్ని రచిస్తుంది. అయితే ఆమె పుస్తకావిష్కరణ సభే.. సంతాప సభ కావడం కన్నీరు తెప్పిస్తుంది. విదేశాల్లో కొడుకులు, స్వదేశంలో తల్లిదండ్రులు వున్న తీరుని ఈ కథ అద్దం పడుతుంది. ఏదో వారికున్న జ్ఞానంతో పుస్తకాలు రచించినా.. వాటిని కొడుకులేమీ పట్టించుకోకుండా.. వృథా వస్తువులుగా భావించి.. కిలోల లెక్కన అమ్మేయడం నేటి తరం ఆలోచనలను ప్రతిబింబిస్తోంది. కనీసం తన తల్లి రచించిన పుస్తకాలకు పిల్లలు విలువ ఇవ్వకపోవడం దారుణం. మన చుట్టూ ఉన్న సమాజంలో ఏం జరుగుతున్నదో ఈ కథ ద్వారా రచయిత తెలిపారు. ‘జగమంత కుటుంబం’ కథ తండ్రీకూతుళ్ల ప్రేమకు నిదర్శనం. ఓ తండ్రి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో ఈ కథ చెబుతుంది. నేను – నా వాళ్లు అనే చట్రాన్ని బిగించుకున్న వాడెప్పుడూ బాధలో ఒంటరిగానే మిగిలిపోతాడు. అదే మన చుట్టూ వున్నవాళ్లంతా మన వాళ్లుగా స్వీకరించి, మంచి ఆశయంతో నడిచేవాడెప్పుడూ ఒంటరివాడు కాదు. జగమంతా తన కుటుంబమే అవుతుందని ఈ కథ తెలుపుతుంది. తెలుగు సినిమాలో నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ నటించిన ‘ఆ నలుగురు’ సినిమాను జ్ఞప్తికి తెచ్చే కథ ‘భూలోక నరకం’. ఈ కథ చదువుతుంటే పెదాలపై నవ్వులు విరబూస్తాయి. చివరికి కథ ముగించిన తీరు అద్భుతంగా ఉంది. నేటికాలంలో ఆసుపత్రుల్లో వైద్యుల తీరుకు ఈ కథ నిదర్శనంగా నిలుస్తోంది. ఇక మరో కథ ‘ఉచితం’. కవి హృదయాన్ని తట్టిలేపుతుంది. పుస్తక రచయిత అగచాట్లు, పడేపాట్లు రచయిత ఈ కథ ద్వారా చెప్పారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి.. తనకంటే నేనే గొప్ప అనిపించుకోవడానికి చేసే ప్రయత్నాలు.. తనకంటే మెరుగ్గా ఉండడం తట్టుకోలేక చేసే ప్రయత్నాలు ‘ఈర్ష్యే లక్ష్యమైతే’ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కథ చదివిన తర్వాత ”డబ్బును కొల్లగొట్టగలం. కానీ తెలివితేటలను దొంగిలించగలమా?” అనే నానుడి గుర్తుకు తెస్తుంది. తండ్రి సేవను తలపింపజేసేది ‘పవిత్ర సంగమం’. కరోనా కాలంలో సాయపడిన వారి గురించి తెలిపే కథే ‘తప్పెవరిది’. స్త్రీల ఆలోచనా ధోరణికి నిదర్శనం ‘వెలితి’. ఆ పుష్కరాలు.. ఈ పుష్కరాలంటూ.. అన్నదమ్ములకి.. అక్కచెల్లెళ్లకి బట్టలు పెట్టడం ఆనవాయితీ. వాటివల్ల వ్యాపారస్తులు లాభపడతారు కానీ సగటు మనిషి మాత్రం ఆర్థికభారంతో చితికిపోతాడనడానికి ఉదాహరణగా ‘అదనపు ఖర్చులు’ కథ ఉంది. మొత్తంగా ఈ పుస్తకంలో కథలు అన్నీ పాఠకుల్ని చదివించేలా ఉన్నాయి.

పేరు : అప్పగింతలు

రచయిత : చలపాక ప్రకాష్‌

వెల : 125/-పుస్తకం కోసం: 9247475975, విశాలాంధ్ర అన్ని బుకహేౌస్‌ బ్రాంచీల్లో దొరుకుతుంది.

  • ఎస్‌. భవాని, 8143839975
➡️